లష్కర్ ‘హస్త’గతానికి మైనారిటీ,ఎస్సీ,ఎస్టీ, బీసీ ఓట్లపై రేవంత్ గురి
x
Secundrabad Railway Station

లష్కర్ ‘హస్త’గతానికి మైనారిటీ,ఎస్సీ,ఎస్టీ, బీసీ ఓట్లపై రేవంత్ గురి

కేంద్రమంత్రి జి కిషన్‌రెడ్డి సిట్టింగ్ ఎంపీగా ఉన్న సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని హస్తగతం చేసుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాలు రూపొందించారు.


కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి ప్రస్థుతం ప్రాతినిథ్యం వహిస్తున్న సికింద్రాబాద్(లష్కర్) పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవడానికి సీఎం, టీపీసీసీ అధ్యక్షుడు ఎ రేవంత్ రెడ్డి పకడ్బందీ వ్యూహాలు రూపొందించారు. ఇందులో భాగంగానే జంటనగరాల్లో సీనియర్ బీసీ నాయకుడైన మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కు కాంగ్రెస్ కండువా కప్పి లష్కర్ నుంచి ఎన్నికల బరిలోకి దించారు. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఖైరతాబాద్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న దానం నాగేందర్ కు సొంత బలం, బలగం ఉంది. దీంతో సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు సీఎం ముస్లిం మైనారిటీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ ఓటర్లపై గురిపెట్టారు.


2019 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి సికింద్రాబాద్ నుంచి 3,84,248 ఓట్లు సాధించి విజయబావుటా ఎగురవేశారు. పోలైన ఓట్లలో బీజేపీకి 42.5 శాతం ఓట్లు లభించాయి. ఓటమి పాలైన తన సమీప బీఆర్ఎస్ అభ్యర్థి తలసాని సాయి కిరణ్ యాదవ్ కు 3,22,482 ఓట్లు అంటే 35.6 శాతం ఓట్లు దక్కాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఎం అంజన్ కుమార్ యాదవ్ కు 1,73,027 ఓట్లు అంటే 19.1 శాతం ఓట్లు మాత్రమే దక్కడంతో మూడోస్థానంలో నిలిచారు. 2014 పార్లమెంట్ ఎన్నికల్లో లష్కర్ నుంచి విజయం సాధించిన బండారు దత్తాత్రేయకు 4,37,860 ఓట్లు వచ్చాయి. వరుస విజయాలతో సికింద్రాబాద్ నియోజకవర్గం కమలం పార్టీకి కంచుకోటగా మారింది.ఈ నియోజకవర్గంలో కేవలం నాలుగున్నర లక్షల ఓట్లు వస్తే చాలు సునాయాసంగా పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించవచ్చని గత పార్లమెంట్ ఎన్నికల ఫలితాలే వెల్లడిస్తున్నాయి. దీంతో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న మైనారిటీ,ఎస్సీ,ఎస్టీ, బీసీ ఓట్లను పొందడానికి సీఎం రేవంత్ వ్యూహాలు రూపొందించి అమలు చేస్తున్నారు.

కేంద్రప్రభుత్వంపై వ్యతిరేకత ఉందా?
సికింద్రాబాద్ సిట్టింగ్ ఎంపీ కేంద్రమంత్రిగా, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా, ఈశాన్య రాష్ట్రాల ఇన్ చార్జీగా వ్యవహరిస్తుండటంతో ఆయా పనుల్లో బిజీగా ఉండేవారు. దీంతో అసలు తన సొంత సికింద్రాబాద్ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో లేరనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. ధరల పెరుగుదల, కేంద్రప్రభుత్వ వైఖరిపై ప్రజల్లో నిరసనల వల్ల బీజేపీ ఓటు బ్యాంకు తగ్గుతుందని, అదే తనకు లాభిస్తుందని కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్ చెబుతున్నారు.

ముస్లిం మైనారిటీ ఓట్లు ఎవరికి వస్తాయి?
సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ముస్లిం మైనారిటీ, బీసీ, ఎస్సీ,ఎస్టీ ఓట్లే కీలకం. కేంద్రంలోని బీజేపీ సర్కారుపై ఉన్న వ్యతిరేకత, ధరల పెరుగుదల, మత విద్వేషాల వల్ల ముస్లిం మైనారిటీలు కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గుచూపుతున్నారని రాజకీయ పరిశీలకులు అంచనా వేశారు. కీలకమైన ముస్లిం,ఎస్సీ,ఎస్టీ, బీసీల ఓట్లను పొందడం ద్వారా విజయం సాధించాలని హస్తం నేతలు వ్యూహాలు రూపొందిస్తున్నారు. నియోజకవర్గంలో 5లక్షల మందికి పైగా ముస్లిం మైనారిటీ ఓటర్లే ఉన్నారు. 27.4 శాతం ఉన్న ముస్లిం మైనారిటీల ఓట్లు చీలి బీఆర్ఎస్ పార్టీకి పడితే బీజేపీ సునాయాసంగా విజయం సాధించవచ్చు. కానీ అలా కాకుండా ముస్లిం మైనారిటీ ఓటర్లు గంప గుత్తగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి పడితే కాంగ్రెస్ విజయం సాధిస్తుందని సికింద్రాబాద్ ప్రాంత సీనియర్ జర్నలిస్ట్ తాళ్లూరి శ్రీనివాస్ చెప్పారు. కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్ సికింద్రాబాద్ లో ఎన్నికల ప్రచారానికి తెర లేపారు. రోజుకో అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటిస్తూ ఓట్ల వేట సాగిస్తున్నారు. సికింద్రాబాద్ లో 1,61,399 మంది ఎస్సీ ఓటర్లు, 27,556 మంది ఎస్టీ ఓటర్లు ఉన్నారు. కీలకమైన బలహీన వర్గాల ఓటర్ల మద్ధతు కోసం కాంగ్రెస్ అభ్యర్థి దానం ఆయా ప్రాంతాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తూ ఓటర్ల మద్ధతు కోరుతున్నారు.

బీసీ, ముస్లిం ఓట్ల చీలేనా?
సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో కీలకమైన ముస్లింమైనారిటీలు, బీసీ ఓటు బ్యాంకు చీలుతుందా? లేదా ? అనేది చర్చనీయాంశంగా మారింది. ఈ కీలకమైన రెండు వర్గాల ఓట్లు గంపగుత్తగా కాంగ్రెస్ అభ్యర్థికి పడితే ఆ పార్టీ అభ్యర్థి దానం నాగేందర్ విజయం సులువు అవుతుందని చెబుతున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి తిగుళ్ల పద్మారావు గౌడ్ బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. పద్మారావుకు బీసీ, ముస్లిం మైనారిటీ ఓటర్లతో సన్నిహిత సంబంధాలున్నాయి. ఈ ప్రధాన వర్గాల ఓట్లు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య చీలితే తమ బీజేపీ పార్టీ మూడోసారి విజయం సాధిస్తుందని బీజేపీ నాయకుడు బండ చంద్రారెడ్డి ఫెడరల్ తెలంగాణకు చెప్పారు.

బీసీ ఓట్లపైనే కాంగ్రెస్ ఆశలు
సికింద్రాబాద్ లోక్‌సభ ఎన్నికల్లో వెనుకబడిన తరగతుల ఓట్లు నిర్ణయాత్మక పాత్ర పోషించనున్నాయి. కులాల సర్వే నిర్వహించి సామాజిక వర్గాలకు దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పిస్తామని రాహుల్‌గాంధీ హామీ ఇచ్చారు. దీంతో కాంగ్రెస్‌ పార్టీ బీసీల ఓట్లపై ఆశలు పెట్టుకుంది. మున్నూరు కాపు సామాజికవర్గం, కల్లుగీత కార్మికులు, పద్మశాలి వర్గం, ఇతర బీసీ సంఘాలకు చెందిన ఓటర్లు సికింద్రాబాద్ లో 3 లక్షల మంది ఉన్నారని, వారంతా తమ వెంట ఉన్నారని దానం నాగేందర్ పేర్కొన్నారు. బీజేపీ అంటే ముస్లింలు, క్రైస్తవుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. గతంలో గ్రేటర్‌ హైదరాబాద్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడిగా దానం నాగేందర్ రెండు పర్యాయాలు 24 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించి ప్రజలతో సాన్నిహిత్యం పెంచుకున్నారు. జంటనగరాల అభివృద్ధికి ప్రత్యేక నిధుల కోసం తాను ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డిని కోరతానని దానం నాగేందర్ చెప్పారు. ‘‘ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించిన తర్వాత మహిళలు పెద్ద ఎత్తున పుణ్యక్షేత్రాలకు వెళ్లారని..వారంతా కాంగ్రెస్‌కు ఓటేస్తారు’’ అని నాగేందర్ చెప్పారు.

బీజేపీకి లష్కర్ కంచుకోట
2019 సార్వత్రిక ఎన్నికలలో సికింద్రాబాద్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీకి అత్యధికంగా 44.84 ఓట్లు వచ్చాయి.2014 లోక్ సభ ఎన్నికల్లోనూ బీజేపీకి అత్యధికంగా 43.7 శాతం ఓట్లు వచ్చాయి. సికింద్రాబాద్ నుంచి రెండు సార్లు వరుసగా బీజేపీ గెలవగా, 2009 సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ 39.4 శాతం ఓట్లతో విజయం సాధించింది. కేంద్రమంత్రి అయిన కిషన్ రెడ్డి హంగూ ఆర్భాటంతో సికింద్రాబాద్ నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలు చేస్తూ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా, కేంద్రమంత్రిగా ఉన్నా కిషన్ రెడ్డి తన సొంత సికింద్రాబాద్ నియోజకవర్గంపైనే దృష్టి సారించారు.
మొత్తం మీద సార్వత్రిక ఎన్నికల్లో సికింద్రాబాద్ నియోజకవర్గంలో జి. కిషన్ రెడ్డి, కాంగ్రెస్‌కు చెందిన దానం నాగేందర్, బీఆర్‌ఎస్ అభ్యర్థి టి. పద్మారావు గౌడ్‌ల మధ్య సాగుతున్న త్రిముఖ పోరు ఆసక్తికరంగా మారింది. ఈ త్రిముఖ పోరులో ఎవరు విజయం సాధిస్తారనేది జూన్ 4వతేదీ ఎన్నికల ఫలితం వెలువడే వరకు వేచిచూడాల్సిందే.


Read More
Next Story