
Benefit shows|సినీ ఇండస్ట్రీకి రేవంత్ ప్రభుత్వం పెద్ద షాక్
మంత్రి మాట్లాడుతు ఇకపై తెలంగాణా(Telangana)లో బెనిఫిట్ షోలకు అనుమతులు ఇవ్వకూడదని ప్రభుత్వం డిసైడ్ చేసినట్లు ప్రకటించారు.
సినీ ఇండస్ట్రీకి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పెద్ద షాకిచ్చింది. ఇక నుండి ఏ సినిమాకు కూడా బెనిఫిట్ షోకు అనుమతులు ఇవ్వకూడదని డిసైడ్ చేసింది. పుష్ప-2 రిలీజ్(Pushpa-2) సందర్భంగా వేసిన బెనిఫిట్ షో(Benefit Show) సందర్భంగా బుధవారం రాత్రి రేవతి అనే మహిళ చనిపోయిన విషయం తెలిసిందే. పుష్ప-2 సినిమా చూడటం కోసం తన భర్త, ఇద్దరు పిల్లలతో రేవతి దిల్ సుఖ్ నగర్ నుండి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్యా థియేటర్(Sandhya Theatre) కు వచ్చింది. అయితే వీళ్ళు టికెట్ల చూపించి థియేటర్లోకి వెళ్ళే కాసేపటి ముందు సినిమాలో హీరోగా వేసిన అల్లుఅర్జున్(Allu Arjun) కూడా అక్కడికి చేరుకున్నాడు. ఎప్పుడైతే అల్లుఅర్జున్ థియేటర్ కు చేరుకున్నాడో అభిమానులు పెద్దఎత్తున గుమిగూడారు. దాంతో పెద్దఎత్తున తొక్కిసలాట జరిగింది.
అల్లుఅర్జున్ ను చూడటం కోసం అభిమానులు పెద్దఎత్తున తోసుకోవటంతో రేవతితో పాటు కొడుకు తేజ కూడా కిందపడిపోయాడు. అయితే వీళ్ళని ఎవరూ పట్టించుకోలేదు. తల్లీ, కొడుకులు కిందపడిపోయినా పట్టించుకోని అభిమానులు అలాగే తొక్కుకుంటూ అల్లుఅర్జున్ ను చూడటం కోసం ఎగబడ్డారు. తొక్కిసలాటలో కిందపడిపోయిన రేవతికి ఊపిరిఆడక మరణించగా కొడుకు పరిస్ధితి ఆసుపత్రిలో సీరియస్ గా ఉంది. జరిగిన ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తొక్కిసలాటకు కారణమైన థియేటర్ యజమానితో పాటు హీరో అల్లుఅర్జున్ తో పాటు మరో 20 మందిపై పోలీసులు కేసు నమోదుచేశారు. నిజానికి తప్పు థియేటర్ యాజమాన్యంపైనే ఉంది. ఎందుకంటే హీరో అల్లుఅర్జున తమ థియేటర్ కు వస్తున్నట్లు తెలిసిన వెంటనే పోలీసులకు చెప్పి బందోబస్తు అడిగుండాలి. అసలు థియేటర్ యాజమాన్యానికి చెప్పకుండా అల్లుఅర్జున్ థియేటర్ దగ్గరకు వస్తే తొక్కిసలాటకు యాజమాన్యంతో పాటు అల్లు అర్జున్ కూడా కారకుడే అవుతాడు.
జరిగిన ఘటనను సీరియస్ గా తీసుకున్న రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఆర్ అండ్ బీ, సినీమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Komatireddy Venkatareddy)తో సమీక్షించారు. సమీక్షలో ఏమి చర్చించారో పూర్తిగా తెలియలేదు. అయితే తర్వాత మంత్రి మాట్లాడుతు ఇకపై తెలంగాణా(Telangana)లో బెనిఫిట్ షోలకు అనుమతులు ఇవ్వకూడదని ప్రభుత్వం డిసైడ్ చేసినట్లు ప్రకటించారు. బెనిఫిట్ షోలు వేయటం, సినీ హీరోలు థియేటర్లకు వచ్చినపుడు అభిమానుల తాకిడిని తట్టుకోవటం కష్టంగా మారుతోందని ప్రభుత్వం అభిప్రాయపడినట్లు మంత్రి చెప్పారు. తొక్కిసలాటలు జరగకుండా, ఎవరూ చనిపోకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవటంలో భాగంగానే బెనిఫిట్ షోలను రద్దు చేయాలని డిసైడ్ చేసినట్లు చెప్పారు. ప్రభుత్వ తాజా నిర్ణయం వల్ల సినీ ఇండస్ట్రీకి(Telugu Cine Industry) పెద్ద దెబ్బనే చెప్పాలి. వందల కోట్లరూపాయల బడ్జెట్లతో సినిమాలు తీస్తున్న నిర్మాతాలు బడ్జెట్లో కొంతమొత్తాన్ని బెనిఫిట్ షోల రూపంలో వెనక్కు రాబట్టుకుంటున్న విషయం అందరికీ తెలిసిందే. తమిష్టం వచ్చినట్లుగా వందలు, వేలాది రూపాయలను టికెట్ ధరగా నిర్ణయించి బెనిపిట్ షోల పేరుతో నిర్మాతాలు జనాలను దోచేసుకుంటున్నారనే ఆరోపణలు అందరికీ తెలిసిందే. ఈ ఆరోపణలపై స్పందించని ప్రభుత్వం మహిళ మృతిని కారణంగా చూపించి బెనిఫిట్ షో పద్దతిని రద్దు చేయాలని నిర్ణయించటం మంచిదే.