రేవంత్ ఆశలన్నీ నాలుగు పథకాలపైనేనా ?
నాలుగుపథకాల అమలును పక్కాగా అమలుచేయగలిగితే ప్రభుత్వం ఎదుర్కొంటున్న చాలా ఆరోపణలనుండి బయటపడుతుంది.
రేవంత్ రెడ్డి ఆశలన్నీ నాలుగు పథకాల అమలుపైనే పెట్టుకున్నాడు. సోమవారం మొదలైన నాలుగుపథకాల అమలును పక్కాగా అమలుచేయగలిగితే ప్రభుత్వం ఎదుర్కొంటున్న చాలా ఆరోపణలనుండి బయటపడుతుంది. ఇంతకీ ప్రభుత్వం తాజాగా అమలైన నాలుగుపథకాలు ఏవంటే రైతుభరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డుల మంజూరు, ఇందిరమ్మ ఇళ్ళ కేటాయింపు. ఈ నాలుగు పథకాల అమలుకోసం ఏర్పాటుచేసిన గ్రామసభల్లోనే ఈమధ్య గొడవలైన విషయంతెలిసిందే. అందుకనే పైపథకాలను రాష్ట్రంమొత్తం ఏకకాలంలో అమలుచేయటంకన్నా పైలెట్ ప్రాజెక్టుగా ఎంపికచేసిన గ్రామాల్లో అమలు చేయాలని డిసైడ్ అయ్యింది. అందుకనే 563 మండలాల్లోని 563 గ్రామాల్లో ప్రయోగాత్మకంగా పై నాలుగుపథకాలను ప్రభుత్వం అమలకు శ్రీకారంచుట్టింది.
ఇందులో భాగంగానే రైతుభరోసాను 4,41,911 మంది రైతులకు పెట్టుబడిసాయం కింద సోమవారం ప్రతిరైతు ఖాతాలోను రు. 6 వేలు జమచేసింది. 4.41 లక్షల మంది రైతుల ఖాతాల్లో రు. 569 కోట్లు జమైంది. అలాగే ఇందిరమ్మ ఆత్మీయభరోసా పథకంలో 18,180 మంది రైతుకూలీలకు రు. 6 వేలుచొప్పున రు. 10.91 కోట్లు జమచేసింది. బీఆర్ఎస్(BRS) హయాంలో వ్యవసాయకూలీలను ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదని మంత్రులు చేస్తున్న ఆరోపణలు అందరికీ తెలిసిందే. ఇక మూడోపథకంగా కొత్తగా 15,414 రేషన్ కార్డులను ప్రభుత్వం మంజూరుచేసింది. ఈ కొత్తకార్డుల వల్ల 51,912 కుటుంబాలు లబ్దిజరిగింది. అలాగే కుటుంబాల్లో కొత్తసభ్యులను చేర్చాలని వచ్చిన దరఖాస్తుల్లో 1.03 లక్షల కార్డుల్లో కొత్తసభ్యుల పేర్లను మార్చింది. చివరగా గూడులేని అర్హులైన నిరుపేదలు 72 వేలమందికి ఇందిరమ్మ ఇళ్ళపథకంలో యాజమాన్య పత్రాలను అందించింది.
రేషన్ కార్డులు కావాలని లక్షల్లో దరఖాస్తులున్నా బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దగా పట్టించుకోకపోవటంతో ఎప్పటికప్పుడు రేషన్ కార్డుల కోసం డిమాండ్ పెరిగిపోతోంది. ఇదే విషయాన్ని రేవంత్ రెడ్డి(Revanth) పదేపదే ఆరోపిస్తున్నారు. అలాగే రైతురుణమాఫీ(Loan waiver) అమలుకు అర్హులు సుమారు 40 లక్షలమంది ఉన్నారు. రుణమాఫీ కింద రు. 41 వేల కోట్లను కేటాయిస్తామని ఎన్నికలముందు ప్రకటించిన హామీని అధికారంలోకి వచ్చినతర్వాత రేవంత్ ప్రభుత్వం విడతలవారీగా మాఫీచేస్తోంది. రు. 2 లక్షలలోపు రుణాలున్న రైతుల అప్పులు దాదాపు 30 లక్షలమందికి మాఫీఅయ్యాయి. రు. 2 లక్షల అప్పులున్న రైతులు ముందుగా తాము అప్పులను బ్యాంకులకు చెల్లించేస్తే ఆమొత్తాన్ని రైతులఖాతాల్లో జమచేస్తామని రేవంత్ చాలాసార్లు చెప్పారు. దాంతో రెండులక్షల రూపాయల రుణాల మాఫీ ఎంతవరకు అమలైందన్న విషయంలో క్లారిటిలేదు.
అలాగే ఆధార్ కార్డు(Aadhar chards)ల్లో తప్పులు, బ్యాంకు ఖాతాలు- ఆధార్ కార్డుల మధ్య సాంకేతిక సమస్యలు, బ్యాంకు ఖాతాలతో లింక్ కాకుండా ఉన్నఆధార్ కార్డులు సుమారు 4 లక్షలుంటాయి. ఇలాంటి సాంకేతిక సమస్యలను, రుణమాఫీకి అవసరమైన పత్రాలు బ్యాంకులకు అందించని కారణంగా మరికొందరు రైతులకు రుణాలుమాఫీ కాలేదు. వీటన్నింటినీ ప్రభుత్వం తరపున నోడల్ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఈ విషయంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు తదితరులు రేవంత్ పై రెగ్యులర్ గా ధ్వజమెత్తుతున్నారు.
తొందరలో జరగబోయే స్ధానికసంస్ధల ఎన్నికల్లో గెలుపును దృష్టిలో పెట్టుకుని రేవంత్ ప్రభుత్వం పై నాలుగు పథకాలు రైతుభరోసా, ఇందిరమ్మఆత్మీయభరోసా, రేషన్ కార్డుల మంజూరు, ఇందిరమ్మ(Indira) ఇళ్ళ లబ్దిదారుల ఎంపిక పక్కాగా చేయాలని గట్టిగా డిసైడ్ అయ్యింది. దాని తర్వాతే స్ధానికసంస్ధల ఎన్నికలను నిర్వహించాలన్నది రేవంత్ ఆలోచనగా పార్టీవర్గాలు చెబుతున్నాయి. అందుకనే ముందుగా పైలెట్ ప్రాజెక్టుగా ఎంపికచేసిన 563 గ్రామాల్లో పథకాల అమలుకు శ్రీకారంచుట్టింది. పైలెట్ ప్రాజెక్టు అమలుసరే పైనాలుగుపథకాలు యావత్ రాష్ట్రంలో వివాదాలకు తావులేకుండా ఎప్పుడు అమలవుతుందో చూడాలి.