Mind game on KTR|కేటీఆర్ పై మైండ్ గేమ్ పెరిగిపోతోందా ?
లగచర్ల గొడవల నేపధ్యంలోనే కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ ను పోలీసులు అరెస్టుచేయబోతున్నట్లు బాగా ప్రచారం జరగటాన్ని బీఆర్ఎస్ నేతలు గుర్తుచేస్తున్నారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై రేవంత్ రెడ్డి ప్రభుత్వం మైండ్ గేమ్ పెంచేస్తున్నట్లే అనిపిస్తోంది. పార్టీ నేతలుకూడా ఇలాంటి అనుమానాలనే వ్యక్తంచేస్తున్నారు. ఫార్ములా ఈ-కార్(Formula E Car Race) రేసు కేసులో కేటీఆర్ పై ఒకటిరెండు రోజుల్లో ఏసీబీ కేసు నమోదుచేయటం, విచారణకు నోటీసులు జారీ చేస్తుందనే ప్రచారం పెరిగిపోతున్న విషయం తెలిసిందే. ఈ ప్రచారాన్నే కారుపార్టీ నేతలు మైండ్ గేమ్ అంటున్నారు. ఫార్ములా కుంభకోణంలో కేటీఆర్ మీద కేసే కాదు ఇదివరకు లగచర్ల గొడవల నేపధ్యంలోనే కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ ను పోలీసులు అరెస్టుచేయబోతున్నట్లు బాగా ప్రచారం జరగటాన్ని బీఆర్ఎస్ నేతలు గుర్తుచేస్తున్నారు. ఇదేవిషయాన్ని తనను కలసిన నేతలతో పార్టీఆఫీసులో కేటీఆర్(KTR) కూడా ప్రస్తావించారు. లగచర్లలో కలెక్టర్ ప్రతీక్ జైన్(Collector Pratik Jain) మీద జరిగిన దాడికి కేటీఆరే సూత్రదారుగా పోలీసులు కోర్టులో దాఖలుచేసిన నరేంద్రరెడ్డి రిమాండు రిపోర్టులో ప్రస్తావించారు.
సూత్రదారి కేటీఆర్ అయితే కీలకపాత్రదారి మాజీ ఎంఎల్ఏ నరేందర్ రెడ్డిగా పోలీసులు కోర్టుకు చెప్పారు. దాంతో నరేందర్ రెడ్డిని అరెస్టుచేసినట్లే కేటీఆర్ అరెస్టుకుడా తప్పదనే నిర్ణయానికి కారుపార్టీ నేతలొచ్చారు. ఏదో కేసులో పోలీసులు తనను అరెస్టు చేస్తారని కేటీఆర్ కుడా మానసికంగా సిద్ధమైపోయారు. రాత్రి ఏ సమయంలో అయినా కేటీఆర్ అరెస్టు తప్పదన్న ప్రచారం నేపధ్యంలో సీనియర్ నేతలు, కార్తకర్యలు వందలమంది నందినగర్ లోని కేటీఆర్ ఇంటిదగ్గర పదిరోజుల క్రితం కాపుకాసిన విషయం గుర్తుండే ఉంటుంది. దాదాపు 48 గంటలు సీనియర్ నేతలు, క్యాడర్ కేటీఆర్ ఇంటిచుట్టూ కాపుకాశారు. అయితే కేటీఆర్ ను అరెస్టుచేయటానికి పోలీసులు ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు. సేమ్ టు సేమ్ ఇఫుడు అలాంటి ప్రచారమే పెరిగిపోతోంది.
ఫార్ములా కేసులో అరెస్టుకు ప్రచారం వెనుక కారణం ఏమిటంటే కేటీఆర్ మీద కేసునమోదుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వటమే అని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఫార్ములా ఈ కార్ రేసు నిర్వహించాలని బీఆర్ఎస్ హయాంలో కేటీఆర్ చాలా పట్టుదలగా ఉండేవారు. మున్సిపల్ శాఖ మంత్రిగా హెచ్ఎండీఏ(HMDA) ఆధ్వర్యంలో కార్ రేసు నిర్వహించేందుకు అన్నీ ఏర్పాట్లు కూడా చేశారు. విదేశీ సంస్ధతో ఒప్పందంచేసుకుని రు. 55 కోట్లను చెల్లించారు. జరిగిన ఏర్పాట్లు, చెల్లించిన 55 కోట్ల రూపాయలపై అప్పట్లోనే పెద్దఎత్తున అవినీతి ఆరోపణలు వచ్చాయి. అయితే తనపైన వచ్చిన ఆరోపణలను కేటీఆర్ ఏమాత్రం లెక్కచేయలేదు. కొద్దిరోజుల్లో రేసు మొదలవబోతోందనగా ఎన్నికల ప్రకటన రావటంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి.
తర్వాత జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. దాంతో ఫార్ముల అవినీతి ఆరోపణలపై చీఫ్ సెక్రటరీ శాంతికుమారి ఆధ్వర్యంలో ప్రాధమిక విచారణ జరిగింది. మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, హెచ్ఎండీఏ సెక్రటరీగా ఉన్న అర్వింద్ కుమార్ ను చీఫ్ సెక్రటరీ విచారించారు. కేటీఆర్ ఫోన్లో ఇచ్చిన ఆదేశాల ప్రకారమే తాను రు. 55 కోట్లు విదేశీసంస్ధకు చెల్లించినట్లు చెప్పారు. నిజానికి ఏ ఉన్నతాధికారి కూడా 55 కోట్ల రూపాయలను మంత్రి ఫోన్లో చెబితే చెల్లించరు. కాని ఇక్కడ కేటీఆర్ ఆదేశించటం, అర్వింద్ చెల్లించటం అయిపోయింది. దాంతో కోట్లాది రూపాయల అవినీతి జరిగిందనే అనుమానాలు పెరిగిపోయాయి. అందుకనే మున్సిపల్ శాఖ లేఖ ఆధారంగా అర్వింద్ మీద ఏసీబీ(ACB Case) కేసు నమోదుచేసి విచారణ చేస్తోంది. విచారణలో బయటపడిన విషయాల ఆధారంగా మంత్రిగా పనిచేసిన కేటీఆర్ ను కూడా విచారణ చేయాలని ఏసీబీ ప్రభుత్వానికి లేఖరాసింది. ఇదే సమయంలో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతు ఫార్ములా కార్ రేసు ఏర్పాట్లలో ఎలాంటి అవినీతి జరగలేదని చెప్పారు. ఇదే సమయంలో తనఆదేశాల ప్రకారమే అర్వింద్ రు. 55 కోట్లను చెల్లించినట్లు కేటీఆర్ ప్రకటించారు. వీటిన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఏసీబీ రాసిన లేఖ ఆధారంగా కేటీఆర్ పైన కేసు నమోదుచేసి విచారించేందుకు అనుమతి ఇవ్వాలని గవర్నర్(Governor Jishnudev Varma) అనుమతిని ప్రభుత్వం కోరుతు లేఖ రాసింది.
దాదాపు నెలన్నరరోజుల తర్వాత కేటీఆర్ మీద కేసునమోదు, విచారణకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. తాజా పరిణామాల నేపధ్యంలోనే కేటీఆర్ మీద కేసు నమోదుచేసి విచారణకు ప్రభుత్వం ఏసీబీకి ఆదేశాలు జారీచేయబోతోందనే ప్రచారం పెరిగిపోతోంది. ఇలాంటిప్రచారాన్నే బీఆర్ఎస్ నేతలు మైండ్ గేమ్(Mind game) అని అనుమానిస్తున్నారు. ఇది నిజంగా మైండ్ గేమ్ గానే ఉండిపోతుందా ? లేకపోతే సడెన్ గా పోలీసులు విచారణకు నోటీసు జారీచేస్తారా అనే అనుమానాలు కూడా లేకపోలేదు. విచారణకు ఏసీబీ అధికారులు నోటీసులు జారీచేయటం అంటే అరెస్టుకు ఒక అడుగు దూరంలో ఉన్నట్లుగానే అనుకోవాల్సుంటుంది. అదే జరిగితే అప్పుడు పార్టీలోని కీలక నేతలు, క్యాడర్ ఏ విధంగా స్పందిస్తారన్నది చూడాలి.