![Revanth new decision|కొత్త సంవత్సరంలో రేవంత్ కొత్త నిర్ణయం Revanth new decision|కొత్త సంవత్సరంలో రేవంత్ కొత్త నిర్ణయం](https://telangana.thefederal.com/h-upload/2024/12/27/501672-revanth.webp)
Revanth new decision|కొత్త సంవత్సరంలో రేవంత్ కొత్త నిర్ణయం
నూతన సంవత్సరం సందర్భంగా రేవంత్ మంత్రులతో పాటు చాలామంది నేతలకు స్వయంగా ఫోన్లుచేసి శుభాకాంక్షలు(New Year Wishes) చెప్పారు.
కొత్తసంవత్సరం సందర్భంగా రేవంత్ రెడ్డి సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. అదేమిటంటే పార్టీ నాయకులకు ఎక్కువసమయం కేటాయించాలని. ఈ విషయాన్ని స్వయంగా రేవంతే(Revanth) తనను కలిసిన నేతలతో చెప్పారు. పార్టీ అధ్యక్షులుగా ఉన్నపుడు అధినేతలు 24 గంటలూ పార్టీ నేతలు, క్యాడర్ తోనే గడుపుతుంటారు. అయితే పార్టీ అధికారంలోకి వచ్చి అధినేత ముఖ్యమంత్రి హోదాలోకి మారిన తర్వాత పార్టీకి సమయంకేటాయించటం తగ్గిపోతుంది. దాంతో పార్టీ అధినేత కమ్ ముఖ్యమంత్రితో పార్టీ నేతలు, క్యాడర్ కు గ్యాప్ బాగా పెరిగిపోతుంది. ఈ విషయంలో చంద్రబాబునాయుడు(ChandrababuNaidu), జగన్మోహన్ రెడ్డి(Jaganmohanreddy), కేసీఆర్(KCR) ఎవరూ అతీతులుకారు. అందుకనే సీఎంగా పరిపాలనా వ్యవహారాల్లో ఎలాగున్నా పార్టీల అధినేతలుగా పై ముగ్గురూ దెబ్బతిన్నారు.
బహుశా ఈ విషయాలను దృష్టిలో ఉంచుకున్నారేమో తెలీదు కాని తన పద్దతిని మార్చుకోవాలని మాత్రం డిసైడ్ అయ్యారు. పైగా తొందరలోనే స్ధానికసంస్ధల ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి. అందుకనే రేవంత్ తన వర్కింగ్ స్టైల్ ను మార్చుకోవాలని నిర్ణయించుకున్నారు. తన స్టైల్ మారిందని చెప్పటమే కాకుండా ఆచరణలో కూడా చూపించారు. దీనికి ఉదాహరణ ఏమిటంటే నూతన సంవత్సరం సందర్భంగా రేవంత్ మంత్రులతో పాటు చాలామంది నేతలకు స్వయంగా ఫోన్లుచేసి శుభాకాంక్షలు(New Year Wishes) చెప్పారు. మంత్రులు, ఎంఎల్ఏలు, నేతలు ముఖ్యమంత్రికి ఫోన్ చేసి మాట్లాడటం కష్టం. అదే ముఖ్యమంత్రే ఫోన్ చేస్తే మాట్లాడని మంత్రులు, ఎంఎల్ఏలు, నేతలు ఎవరుంటారు ? మంత్రులు ఎలాగూ సీఎంతో రెగ్యులర్ గా టచ్ లోనే ఉంటారు. ఇక ఎంఎల్ఏలు, సీనియర్ నేతలు, మండలస్ధాయి నేతలకే సీఎంతో మాట్లాడాలంటే చాలాకష్టం. అలాంటిది స్వయంగా ముఖ్యమంత్రే తమకు ఫోన్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పటమే కాకుండా యోగక్షేమాలు కనుక్కోవటంతో అందరు ఫుల్లు హ్యాపీగా ఫీలయ్యారు.
అదేవిషయాన్ని రేవంత్ మంత్రులు, ఎంఎల్ఏలకు చెప్పారు. మంత్రులు, ఎంఎల్ఏలు కిందస్ధాయి నేతలు, క్యాడర్ కు ఫోన్లుచేసి రెగ్యులర్ గా మాట్లాడుతుండాలని చెప్పారు. పార్టీకోసం కష్టపడిపనిచేస్తున్న నేతలు, క్యాడర్ను ఎంఎల్ఏలు గుర్తించాల్సిన అవసరం చాలా ఉందన్నారు. ‘మన నేతలు, క్యాడర్ ను మనం పట్టించుకోకపోతే ఇంకెవరు చూసుకుంటారు’ ? అని ప్రశ్నించారు. ఇకనుండి ప్రతివారం ఎంఎల్ఏలు, జిల్లాల్లోని నేతలకు తగిన సమయాన్ని కేటాయించాలని డిసైడ్ అయినట్లు చెప్పారు. జిల్లాలవారీగా ఎంఎల్ఏలు, నేతలతో సమవేశాలు పెట్టుకోవాలని రేవంత్ అనుకున్నట్లు పార్టీవర్గాల సమాచారం. కొత్తనిర్ణయంవల్ల పార్టీనేతలు, క్యాడర్ తో గ్యాప్ రాకుండా చూసుకున్నట్లు అవుతుందని రేవంత్ ఆలోచనగా పార్టీవర్గాలు చెబుతున్నాయి.
కొత్తసంవత్సరంలో రేవంత్ తీసుకున్న కొత్తనిర్ణయం తొందరలో జరగబోయే స్ధానికసంస్ధలఎన్నికల్లో(Localbody Elections) పార్టీకి కొత్తఉత్సాహం ఇస్తుంది అనటంలో సందేహంలేదు. కష్టపడేవారికి కాస్త ఆలస్యంగా అయినా గుర్తింపు ఉంటుందని, పదవులు దక్కుతాయని నేతలు, క్యాడర్ నమ్మితే పార్టీ విజయంకోసం మనస్పూర్తిగా కష్టపడతారు. ఏ పార్టీకి అయినా ద్వితీయశ్రేణి నేతలు, క్యాడరే కదా అసలైన బలం.