డిప్యూటీ సీఎంతో చెట్టాపట్టాల్‌..‌ ముఖ్యమంత్రి రేవంత్‌ ‌కొత్త ఒరవడి..
x

డిప్యూటీ సీఎంతో చెట్టాపట్టాల్‌..‌ ముఖ్యమంత్రి రేవంత్‌ ‌కొత్త ఒరవడి..

పార్టీలో నేనే ‘పెద్ద’ అనే ఇగో కొందరు సీఎంలను వెంటాడుతుంటుంది. తనతో సమానంగా ఎవరూ ఉండకూడదు అనే వైఖరితో ఉంటారు. కాని అందుకు భిన్నం తెలంగాణ సీఎం రేవంత్‌ ‌రెడ్డి ఉంటున్నారు.. వివరాలు


ముఖ్యమంత్రి కాగానే ప్రధానమంత్రిని కలవడం ఆనవాయితీ. అభివాదం చేసి పుష్పగుచ్ఛం ఇచ్చి అసలు విషయాన్ని ప్రస్తావనకు తెస్తారు. రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని కోరతారు. కేంద్రం నుంచి తమకు రావాల్సిన ఆర్థిక వనరుల గురించి ప్రధానికి గుర్తుచేస్తారు. ఈ సంప్రదాయం చాలాఏళ్ల నుంచి చాలామంది ముఖ్యమంత్రులు కొనసాగిస్తున్నారు.

గమనించాల్సిందేమింటే..గతంలో ముఖ్యమంత్రులు ఇలా తొలిసారి ప్రధానిని కలుసుకునేటపుడు ఒంటరిగానే వెళతారు. మంత్రులను, ఉప ముఖ్యమంత్రులను తీసుకెళ్లరు. ఢిల్లీకి ముఖ్యమంత్రి ఎపుడూ వెళ్లినా వెంట మంత్రులు ఉంటారు. అయితే, వాళ్లంతా ప్రధాని దగ్గిరకు వెళ్లేందుకు అనుమతి ఉండదు. అయితే, ఈ సంప్రదాయానికి భిన్నంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానిని తొలిసారి కలుసుకునేందుకువెళ్తూ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లును తీసుకువెళ్లాడు, ఇదొక కొత్త ఒరవడి.

చాలా సందర్బాలలో ముఖ్యమంత్రులు ఢిల్లీకి ఉపముఖ్యమంత్రులను తీసుకెళ్లరు. ఆలాగే ఉప ముఖ్యమంత్రి హోదాలో వాళ్లు ఢిల్లీ వెళ్లే అవకాశమే రానీయరు.

ఉప ముఖ్యమంత్రి హోదా అంటే ఏమిటి ?

రాజ్యాంగంలో ఉపముఖ్యమంత్రి, ఉప ప్రధాని అనే పదవులు లేవు. అయితే, పార్టీలో ఉన్న మరొక పెద్ద నాయకుడిని గుర్తించేందుకు లేదా ముఠాలను, లేదా కొన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునేందుకు ఉప ముఖ్యమంత్రి పదవులను సృష్టిస్తుంటారు. ఉప ముఖ్యమంత్రి పదవి అనేది కేవలం పేపర్ మీద వ్యవహారం కావడం దీనికి కారణం. సిఎం అధికారాల్లో ఒకటి కూడా ఉప ముఖ్యమంత్రికి రాదు.

1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పటినుంచి ఉప ముఖ్యమంత్రి పదవులన్నీ వర్గాలను, కులాలను, ప్రాంతాలను మచ్చిక చేసుకునేందుకు ఏర్పాటు చేసినవే. అందుకే ఉప ముఖ్యమంత్రికి ముఖ్యమంత్రులలెవరూ పెద్దగా గౌరవం ఇవ్వరు. తన కు పోటీగా ఉండే వ్యక్తిని ఉప ముఖ్యమంత్రిగా నియమించేందుకు ఏ ముఖ్యమంత్రి అంగీకరిస్తారు. ఈ పరిస్థితి ఉమ్మడి రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రులను నియమించిన కాంగ్రెస్ , తెలుగుదేశం ప్రభుత్వాలలో చూడవచ్చు. తెలంగాణలో కెసిఆర్ ప్రభుత్వంలో కూడా ఉపముఖ్యమంత్రులున్నారు. వీళ్లకంటే మంత్రులుగా ఉన్న కెటిఆర్, హరీష్ రావు, ఏ పదవీలేని కవిత కే ఎక్కువ గౌరవం ఉండేది. ఉత్త బొమ్మలే.

నిజానికి ఉపముఖ్యమంత్రి పదవి రాజ్యంగం గుర్తించలేదు కాబట్టి గవర్నర్ కూడా ఉప ముఖ్యమంత్రి పేరుతో ప్రమాణం చేయించడం జరుగదు. వాళ్లంతా మంత్రిగానే ప్రమాణం చేస్తారు. మొన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడినపుడు కూడా ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆనరబుల్ ఉప ముఖ్యమంత్రి అని భట్టిని సంభోధించినా భట్టి ప్రమాణం చేసింది మంత్రిగానే. అందువల్ల ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రిని సీరియస్ గా తీసుకోరు.

దేవీలాల్ వ్యవహారం

ఇలాగే ఉపప్రధానిని కూడా ఉపప్రధాని హోదాలో ప్రమాణం చేయించడం జరగదు. ఒక సారి హర్యానా నేత దేవీలాల్ మాత్రం పట్టుబట్టి తనని ఉప ప్రధానిగా ప్రమాణం చేయించేదాకా వదల్లేదు. విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ప్రభుత్వంలో దేవీలాల్ ఉప ప్రధానిగా ఉన్నారు. ఆయనచేత రాష్ట్రపతి ఆర్ వెంకటరామన్ ప్రమాణం చేయించారు. రాష్ట్రపతి ఆయనను మంత్రిగా ప్రమాణం చేయిస్తున్నపుడు ఉప ప్రధానిగా ప్రమాణం చేయించాలని పట్టుబట్టారు. తను ఉప ప్రధాని అనే చెప్పుకుని ప్రమాణం చేశారు. దీన్ని కాదంటే అనవసర రభసఅవుతుందని రాష్ట్రపతి తేలికగా తీసుకున్నారు. ఈ విషయాన్ని వెంకటరామన్ తన ఆత్మకథలో రాసుకున్నారు. ఈ విషయం తర్వా తసుప్రీంకోర్టు దాకా వెళ్లింది. ఉప ప్రధానిగా దేవీలాల్ ప్రమాణం చేయడం రాజ్యాంగ విరుద్ధమనే వాదనతో కోర్టు ఏకీభవించింది.

తెలుగు ఉప ముఖ్యమంత్రులు

ఏపీలో గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి హయంలో నిమ్మకాయల చిన్నరాజప్ప, కేఈ కృష్ణమూర్తి ఉపముఖ్యమంత్రులు. ఇటు తెలంగాణలో గత సీఎం కే చంద్రశేఖర్‌ ‌హయాంలో ఎం. మహమ్మద్‌ అలీ, టీ రాజయ్య, కడియం శ్రీహరి డిప్యూటీ సీఎంలు. అయితే చంద్రబాబుకాని, కేసీఆర్‌కాని తమ వెంట డిప్యూటీ సీఎంలను తీసుకెళ్లలేదు. పేరు తప్ప ఏ ప్రత్యేకాధికారం లేదని ఒక మాజీ ఉప ముఖ్యమంత్రి ఫెడరల్-తెలంగాణ కు చెప్పాడు

రేవంత్ రెడ్డి భిన్నం

ఈ విషయం కాసేపు అటుంచితే.. తెలంగాణ సీఎం ఎనుముల రేవంత్‌ ‌రెడ్డి ఈ విషయం భిన్నంగా ఉంటున్నారు. ఇటీవల ఆయన ప్రధానిని కలుసుకునేందుకు ఢిల్లీ వెళ్లారు. ప్రధాని మోదీని కలిశారు. ఆయన ఒక్కరే హస్తినకు వెళ్లలేదు. వెంట డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్కను తీసుకెళ్లారు. ఆయనను ప్రధానికి పరిచయం చేశారు. రాష్ట్ర సమస్యలను పీఎంతో ఇద్దరూ చర్చించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి వివరించారు. రాష్ట్ర విభజనతో తమకు రావాల్సిన వాటిపై పీఎంకు గుర్తుచేశారు.

అంతేకాదు, పార్టీ అధ్యక్షుడు మల్లి కార్జున ఖర్గేని కూడా ఇద్దరు కలిసే కలిశారు.



ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు చాలా ప్రాధాన్యం ఇస్తున్నారని అర్థమవుతుంది దీని వల్ల. ఇదొక సత్ససంప్రదాయం. తానెంతో.. డిప్యూటీ సీఎం కూడా అంతే అన్నట్లుగా చాలా కార్యక్రమాల్లో ఇద్దరూ కలిసి పాల్గొంటున్నారు. భట్టితో చెట్టపట్టాలేసుుని తిరుగుతున్నారు. ఇది కొనసాగితే, రేవంత్ ప్రజస్వామిక ముఖ్యమంత్రిగా నిలిచిపోతారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఇప్పటి వరకు మంత్రులతో నేను బాస్ అనే ధోరణితో ప్రవర్తిస్తున్నట్లు కనిపించదు. ఇలా అందరిని సమానంతా చూడటం రేవంత్ కు భవిష్యత్తులో బలం అవుతుంది.

Read More
Next Story