
‘ధరణితో ప్రజలు పడ్డ కష్టాలు వర్ణనాతీతం’
ఉద్యోగులు, రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం చిత్త శుద్ధితో పనిచేస్తోంది.
అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. వీటిలో భాగంగానే బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌ను ‘భూభారతి’గా మార్చింది. బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ధరణి’ పోర్టల్ వల్ల ప్రజలు పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కావని, తమ భూమిని తమదని చెప్పుకోలేని దీన స్థితిలో పడ్డారని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ అన్నారు. తెలంగాణ రెవెన్యూ ఫీల్డ్ టెక్నికల్ స్టాఫ్ అసోసియేషన్ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనానికి మహేష్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగానే ఆయన బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఉద్యోగులు నానావస్థలు పడ్డారని అన్నారు.
‘‘తెలంగాణకు రెవెన్యూ డిపార్ట్మెంట్ గుండె కాయ లాంటివారు. ధరణితో రాష్ట్ర ప్రజలు పడ్డ కష్టాలు వర్ణనాతీతం. అనుభవంతో చెప్తున్నా. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ధరణి తొలగించి భూ భారతి తీసుకురావడం జరిగింది. ఉద్యోగులు, రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం చిత్త శుద్ధితో పనిచేస్తోంది. భూభారతితో భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం కృషి చేస్తోంది. ఉద్యమకారుడిగా కేసీఆర్‌ను అభిమానిస్తా కానీ.. ఆయన పాలనలో తెలంగాణలో అప్పుల మయంగా మారింది’’ అని అన్నారు.
‘‘బీఆర్ఎస్ హయాంలో పేదవాడికి ఒరిగింది ఏమీలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకా ఉద్యోగులకు మొదటి తేదీనే జీతాలు అకౌంట్లో పడుతున్నాయి. ఏడాది పాలనలో కాంగ్రెస్ 55 వేలకు పైగా ఉద్యోగాలు కల్పించాం. అప్పుల తెలంగాణ కాంగ్రెస్ హయంలో రైజింగ్ తెలంగాణ నినాదంతో పునర్వికాసం వైపు పయనిస్తోంది. ఉద్యోగాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కచ్చితత్వంతో పనిచేస్తోంది’’ అని తెలిపారు.