RAGGING| రిషితేశ్వరి ర్యాగింగ్ కేసు ఎందుకు వీగిపోయిందీ?
x
RISHITESWARI Case

RAGGING| రిషితేశ్వరి ర్యాగింగ్ కేసు ఎందుకు వీగిపోయిందీ?

9 ఏళ్ల కిందట సంచలనం సృష్టించిన వరంగల్ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య కేసును గుంటూరు కోర్టు ఎందుకు కొట్టివేసిందీ? ఆమె తల్లిదండ్రులు ఏమంటున్నారు?


ఉభయ తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన మొండి రిషితేశ్వరి (Rishiteswari) బలవన్మరణం కేసులో అనూహ్యమైన మలుపు తిరిగింది. కోర్టు ఈ కేసును కొట్టి వేసింది. కోర్టులో ప్రాసిక్యూషన్ సరిగా సాక్ష్యాధారాలను నిరూపించలేకపోయింది. దీంతో కేసును కోర్టు కొట్టివేసింది. కోర్టులకు సాక్ష్యాలు తప్ప మనోభావాలతో సంబంధం ఉండదు. ఇప్పుడీ విషయమే తెలుగురాష్ట్రాలలో చర్చనీయాంశంగా మారింది. దాదాపు 9 ఏళ్లు సాగిన ఈ కేసును గుంటూరు జిల్లా కోర్టు నవంబర్ 29న కొట్టివేసింది. దీనిపై తిరిగి అప్పీల్ కు వెళ్లాలని మహిళా సంఘాలు కోరుతున్నాయి. మరికొన్ని సంఘాలు ఆందోళనకు దిగాలని యోచిస్తున్నాయి. పౌర సమాజం కూడా ఈ తీర్పు పట్ల అసంతృప్తి వ్యక్తం చేసింది.
అసలేం జరిగింది...
వరంగల్ కి చెందిన రిషితేశ్వరీ గుంటూరుకు సమీపంలోని నాగార్జున యూనివర్శిటీలో ఆర్కిటెక్చర్ లో పోస్టుగ్రాడ్యుయేషన్ కోసం చేరారు. యూనివర్శిటీలో ర్యాగింగ్ (Ragging) జరిగినట్టు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆమె 2015 జులై 14న నాగార్జున యూనివర్శిటీలో ఆత్మహత్య చేసుకున్నారు. గుంటూరుకు సమీపంలోని పెదకాకాని పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది.
ర్యాగింగ్ కారణంగా తాను బలవన్మరణానికి పాల్పడుతున్నట్లు యువతి సూసైడ్ నోట్ రాసింది. సీనియర్ విద్యార్థుల వేధింపులు తట్టుకోలేకపోతున్నట్లు ఆమె తన లేఖలో పేర్కొంది.
ఆమె మరణం తర్వాత ఈ కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. బాధితురాలి కుటుంబసభ్యులు, బంధువులు, విద్యార్థి సంఘాలు పెద్దఎత్తున నిరసనలు చేపట్టారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విచారణ తుది దశకు చేరుకున్న సమయంలో గుంటూరు జిల్లా 5వ కోర్టు తీర్పు ఇచ్చింది. కేసును కొట్టివేసింది.
2015లో ఆర్కిటెక్చర్ కళాశాల ప్రిన్సిపల్ బాబూరావు అనధికారికంగా తనకు నచ్చిన చోట ఫ్రెషర్స్ డే పార్టీ నిర్వహించారని ఆరోపణలు వచ్చాయి. ప్రిన్సిపల్‌తో పాటు పలువురు విద్యార్థులు మద్యం సేవించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ప్రెషర్స్ డే తర్వాత ఆడపిల్లలతో కొందరు అసభ్యంగా ప్రవర్తించారని, సీనియర్ విద్యార్థులు సైతం ఆమెపై ర్యాగింగ్‌కు పాల్పడ్డారనే ఆరోపణలపై కేసు నమోదైంది. సీనియర్ల ర్యాగింగ్‌కు మనస్తానం చెందిన రిషితేశ్వరి సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడింది. సుదీర్ఘ విచారణ తర్వాత గుంటూరు కోర్టు కేసును కొట్టివేస్తూ తీర్పు ఇచ్చింది.
ఈ తీర్పుపై రిషితేశ్వరి తల్లిదండ్రులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరగలేదని ఆరోపించారు. ఆమె తల్లి దుర్గా బాయి మాట్లాడుతూ.. 9 ఏళ్లుగా పోరాడుతున్నామని, న్యాయం జరుగుతుందని భావించామని, కానీ కోర్టు తీర్పు తమ అంచనాలకు భిన్నంగా వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరగలేదన్నారు. అప్పీల్‌కు వెళ్లాలా లేదా అనే విషయాన్ని ఆలోచిస్తామన్నారు. పోరాడే ఓపిక లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
రిషితేశ్వరీ డైరీలోని సంగతులేమిటీ?
రిషితేశ్వరి తండ్రి మురళీకృష్ణ కూడా తీవ్ర మనస్థాపం చెందినట్టు కనిపించారు. ఆయన ఏమన్నారంటే.. రిషితేశ్వరి డైరీలను ఎందుకు పరిగణలోకి తీసుకోలేదో అర్థం కావటం లేదన్నారు. డైరీలో అన్ని విషయాలు వివరంగా ఉన్నాయన్నారు. ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా రిషితేశ్వరే డైరి రాసినట్లు నివేదిక ఇచ్చిందన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
అయితే సూసైడ్ నోట్ ఆధారంగా పోలీసులు పలువురు నిందితులను అరెస్ట్ చేశారు. 9 ఏళ్ల పాటు ఈ కేసు విచారణ కొనసాగింది. సరైన సాక్షాలు లేని కారణంగా రిషితేశ్వరి ఆత్మహత్య కేసును కొట్టివేస్తున్నట్లు గుంటూరు కోర్టు జడ్జి తెలిపారు. ఈ కేసులో దాదాపు 170 మంది సాక్షులు ఉన్నారని రిషితేశ్వరి తల్లిదండ్రులు చెప్పారు.
ఈ కేసులో తమకు న్యాయం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లను కలుస్తామని చెప్పారు. తమకు పైకోర్టులకు వెళ్లే ఆర్థిక స్థోమత లేదని.. ప్రభుత్వమే సహాయం చేయాలని కోరారు. ఈ కేసులో తమకు న్యాయం జరగకపోతే మరణమే శరణ్యమని రిషితేశ్వరి తల్లిదండ్రులు అంటున్నారు.
రిషితేశ్వరి ఆత్మహత్య కేసులో ఆచార్య నాగార్జున యూనివర్శిటీ (ఏఎన్‌యూ) కాలేజ్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్ ప్రిన్సిపాల్ జి. బాబురావుతో పాటు ముగ్గురు విద్యార్థినులు దుంప హనీషా, ధరావత్ జైచరణ్, నరాల శ్రీనివాస్‌లపై అభియోగాలు నమోదు చేశారు. నిందితులపై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 306, ర్యాగింగ్ నిరోధక చట్టంలోని సెక్షన్ 4 కింద అభియోగాలు మోపారు. రిషితేశ్వరి మృతదేహం లభించిన రెండు రోజుల తర్వాత ఆగస్టు 16న వారిని అరెస్టు చేశారు. యూనివర్సిటీ క్యాంపస్‌లోని తన హాస్టల్ గదిలో సీలింగ్ ఫ్యాన్‌కు రిషితేశ్వరి ఉరి వేసుకుంది.
Read More
Next Story