
BJP POLITICS | ఆర్.కృష్ణయ్యకు బీజేపీ రాజ్యసభ టికెట్
BC నాయకుడు ఆర్.కృష్ణయ్య APనుంచి మళ్లీ రాజ్యసభకు ఎన్నిక కానున్నారు. గతంలో వైసీపీ నుంచి రాజ్యసభకు నామినేట్ అయిన ఆయన ఈసారి బీజేపీ నుంచి నామినేట్ అయ్యారు.
బలహీనవర్గాల నాయకుడు ర్యాగ కృష్ణయ్య (ఆర్.కృష్ణయ్య) ఆంధ్రప్రదేశ్ నుంచి మళ్లీ రాజ్యసభకు ఎన్నిక కానున్నారు. గతంలో వైసీపీ నుంచి రాజ్యసభకు నామినేట్ అయిన ఆయన ఈసారి బీజేపీ నుంచి నామినేట్ అయ్యారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఇప్పుడు బీజేపీ నుంచి నామినేట్ అవుతున్నారు. మూడు రాష్ట్రాల్లో ఖాళీ అయిన రాజ్యసభ స్థానాలకు అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. ఏపీ నుంచి బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య(Ryaga Krishnaiah)కు అవకాశం కల్పించింది. ఆర్.కృష్ణయ్యతో పాటు హరియాణా నుంచి రేఖాశర్మ, ఒడిశా నుంచి సుజిత్‌కుమార్‌ను అభ్యర్థులుగా బీజేపీ ప్రకటించింది.
ఎవరీ కృష్ణయ్య 1954 సెప్టెంబర్ 13న జన్మించిన కృష్ణయ్య జాతీయ స్థాయిలో బీసీల హక్కుల కోసం ఉద్యమించారు. తెలంగాణ, ఆర్ధికంగా వెనుకబడిన తరగతుల రిజర్వేషన్ల కోసం సుదీర్ఘకాలంగా పోరాటం చేస్తున్నారు. రాజకీయవేత్త, సామాజిక కార్యకర్త. 45 ఏళ్లుగా ఆయన వివిధ వేదికలపై ఓబీసీ వర్గాల గళాన్ని వినిపిస్తున్నారు. 2014లో రాష్ట్ర విభజన తర్వాత టీడీపీ తరఫున హైదరాబాద్ లోని ఎల్బీ నగర్ నుంచి తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. OBCలకు విద్య, ఉపాధి, సామాజిక న్యాయం దక్కాలని కోరుతున్నారు. 2022లో ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ గెలిచినపుడు అప్పటి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కృష్ణయ్యను రాజ్యసభకు ఎంపిక చేశారు. రెండేళ్ల పాటు వైసీపీ తరఫున రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. ఆయన పార్లమెంటు సభ్యునిగా ఉన్న సమయంలో ఓబీసీలకు సంబంధించిన వివిధ సమస్యలపై దృష్టి సారించారు. ర్యాగ కృష్ణయ్య 2024 సెప్టెంబర్ 24న రాజ్యసభకు రాజీనామా చేశారు.
పోస్ట్ గ్రాడ్యుయేషన్ తో పాటు న్యాయశాస్త్రంలో పట్టా పొందిన ఆర్. కృష్ణయ్య న్యాయవాద వృత్తి వైపు వెళ్లకుండా బీసీలకు సామాజిక న్యాయం వైపు దృష్టి సారించి పలు వర్గాలకు తలలో నాలుకలా నిలిచారు.
జాతీయ వెనుకబడిన తరగతుల సంక్షేమ సంఘం అధ్యక్షునిగా కృష్ణయ్య ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీ) హక్కులు, సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించారు.
కృష్ణయ్య ఓబీసీ సంఘాలతో పాటు సోషల్ వెల్ఫేర్ హాస్టల్ యూనియన్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. ఈ సంస్థ షెడ్యూల్డ్ కులాలు (SCలు), షెడ్యూల్డ్ తెగలు (STలు), OBCల నుండి 1.4 మిలియన్ల హాస్టల్ విద్యార్థులకు ప్రాతినిధ్యం వహిస్తుంది. ఈ విద్యార్థులకు నాణ్యమైన విద్య, సరైన వసతి, అవసరమైన సాయాన్ని అందించాలని కోరుతోంది. BC గర్జన అనే పత్రికకు సంపాదకులుగా కూడా ఉన్నారు.
1976లో, కృష్ణయ్య హైస్కూల్ విద్యార్థుల కోసం ప్రత్యేక హాస్టళ్ల కోసం ఉద్యమించారు. ఫలితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏటా 300 నుండి 500 కొత్త హాస్టళ్లను స్థాపించింది. ప్రస్తుతం ఆ సంఖ్య సుమారు 5 వేల వరకు చేరింది.
బీజేపీతో సన్నిహిత సంబంధాలున్న ఆర్.కృష్ణయ్య ప్రస్తుతం రాజ్యసభకు ఎంపికయ్యారు. హరియాణ ప్రస్తుత గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.
Next Story