Road Accidents | తెలంగాణలో మొక్కుబడిగా రోడ్డు భద్రతా మాసోత్సవాలు
తెలంగాణలో రోడ్డు భద్రతా మాసోత్సవాలు మొక్కుబడిగా మారడంతో రోడ్డు ప్రమాదాల సంఖ్య ఏటేటా పెరుగుతున్నాయి. రోడ్డు ప్రమాదాల నివారణకు శాశ్వత చర్యలు చేపట్టడం లేదు.
తెలంగాణ రాష్ట్రంలో రోడ్డు భద్రత కోసం సరైన చర్యలు తీసుకోవడం లేదు. అధ్వానంగా ఉన్న రోడ్లు, గుంతలు, మూలమలుపులు రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నా, ఈ సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దీనివల్ల దేశంలోనే రోడ్డు ప్రమాదాల సంఖ్య ఏ యేటి కాఏడు పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్ర రవాణ శాఖ, పోలీసులు, రోడ్లు భవనాల శాఖ అధికారులు రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారు.
- పీకల దాకా మద్యం తాగి వాహనాలు నడపడం,స్పీడ్ డ్రైవింగ్,ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించడం, మైనర్లు డ్రైవింగ్ లైసెన్సు లేకుండా వాహనాలు నడపటం, నిద్రమత్తులో డ్రైవింగ్ ఇలా రకరకాల కారణాలతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల్లో పలువురి ప్రాణాలు గాల్లో కలిసి పోతున్నాయి. వేలాదిమంది తీవ్రంగా గాయపడి వికలాంగులవుతున్నారు.
- గత ఏడాది రాష్ట్రంలో ఈ ప్రమాదాలు మరింత పెరిగాయి. డ్రైవింగ్ లైసెన్సు లేని వారు, మైనర్లు వాహనాలు నడపటం వల్ల కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. హెల్మెట్ ధరించక పోవడం వల్ల మృతుల సంఖ్య పెరుగుతోంది.
- ద్విచక్రవాహనాలను నడుపుతున్న వారే కాకుండా వెనుక కూర్చున్న వారు కూడా హెల్మెట్ ధరించాలి. కార్లలో డ్రైవింగ్ చేసే వారితోపాటు ప్రయాణికులు కూడా సీటు బెల్టు ధరించాలి. దేశ రాజధాని నగరమైన ఢిల్లీ కంటే కూడా హైదరాబాద్ లో రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది.
- అధ్వానంగా ఉన్న రోడ్లు, వంపులు తిరిగి గుంతలతో ఉన్న రోడ్లపై ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని వెల్లడైంది. ద్విచక్రవాహనచోదకులే రోడ్డు ప్రమాదాల్లో అధికంగా మృత్యువాత పడుతున్నారు. 45 శాతానికి పైగా బైక్ రైడర్స్ ప్రమాదాల బారిన పడ్డారు.రోడ్డు ప్రమాదాలకు వీధి కుక్కలు కూడా కారణమని వెల్లడైంది.
యాక్సిడెంట్ ఇండెక్స్ ఏం చెబుతుందంటే...
ప్రపంచంలోనే భారతదేశంలో అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని తేలింది. దేశంలోని మెట్రో నగరాల్లోనే అత్యధికంగా అంటే 78 శాతం రోడ్డు ప్రమాదాలు జరిగాయి. రోడ్డు ప్రమాదాల్లో హైదరాబాద్ నగరం అగ్రస్థానంలో ఉందని అకో ఇన్స్యూరెన్స్ కంపెనీ విడుదల చేసిన యాక్సిడెంట్ ఇండెక్స్ 2024 వెల్లడించింది. ఢిల్లీ, పూణే, బెంగళూరు నగరాల్లో అధిక రోడ్డు ప్రమాదాలు జరిగాయని నివేదిక తెలిపింది.
ప్రమాద సమాచారం అందించండి
ప్రమాదం జరిగిన వెంటనే చాలా మంది పోలీసులకు లేదా అంబులెన్స్ కు గానీ సమాచారం అందించేందుకు వెనకడుగు వేస్తుంటారు.దీని వల్ల తమకు ఏదైనా సమస్య వచ్చిపడుతుందేమో అని. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులకు, అంబులెన్స్ కు సమాచారం అందిస్తే వారి ప్రాణాలను కాపాడిన వాళ్లు అవుతారని పోలీసు అధికారి నరేష్ రెడ్డి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.రోడ్డు ప్రమాదాల్లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే 8వస్థానంలో నిలిచింది.
ఏటేటా పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు
తెలంగాణ రాష్ట్రంలో రోడ్డు భద్రత ప్రశ్నార్థకంగా మారింది. ఏ యేటి కాఏడు రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరుగుతుండటం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది.2020వ సంవత్సరంలో రాష్ట్రంలో 16,866 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాల్లో 5,461 మంది మృత్యవాత పడ్డారు. 2021వ సంవత్సరంలో 19,282 , 2022లో 19,497 రోడ్డు ప్రమాదాలు వాటిల్లాయి. 2023వ సంవత్సరంలో 20,702 రోడ్డు ప్రమాదాలు జరగ్గా, 2024వ సంవత్సరంలో 23,491 కి పెరిగాయి.
పెరిగిన మృతుల సంఖ్య
రోడ్డు ప్రమాదాల సంఖ్యతోపాటు మృతుల సంఖ్య కూడా పెరుగుతోంది. 2021వ సంవత్సరంలో 6,395 మంది రోడ్డు ప్రమాదాల్లో మరణించారు. 2022లో 6,434మంది, 2023వ సంవత్సరంలో 6,541 మంది ప్రమాదాల్లో మరణించారు. 2024వ సంవత్సరంలో 6,640 మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారు.
రోడ్డు భద్రతా మాసోత్సవాలు
ప్రయాణికులకు రోడ్డు-భద్రతపై అవగాహన కల్పించాలని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు సూచించారు.జనవరి 1వతేదీ నుంచి రోడ్డు భద్రతా మాసోత్సవాలు తెలంగాణలో చేపట్టారు. యువకులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించడం, ఆర్టీసీ, ఆటోడ్రైవర్లకు సదస్సులను ఏర్పాటు చేసి ప్రమాదాలను ఆరికట్టడం, ఆతివేగం వల్ల జరిగే దుష్పరిణామాలు, ఆ తర్వా త ఆ కుటుంబం పరిస్థితి ఎలా ఉంటుందనే అంశాలపై అవగాహన కల్పిస్తామని మంత్రి చెప్పారు.
రోడ్డు ప్రమాదాలను నియంత్రణకు చర్యలు : మంత్రి పొన్నం
రోడ్డు ప్రమాదాలను నియంత్రించేందుకు నిరంతరం వాహన తనిఖీలు చేపడుతున్నామని మంత్రి పొన్నం చెప్పారు. తాగి వాహనాలు నడిపేవారిపై కఠినంగా వ్యవహరిస్తున్నామని ఇంకా పర్యవేక్షణ పెంచి ప్రమాదాలు తగ్గించేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు.రోడ్డు నిబంధన లు పాటించి వాహనాలు నడిపితే ఎలాంటి ప్రమాదాలు చోటుచేసుకునేందుకు అవకాశం ఉండదన్నారు.జనవరి 1 నుంచి జనవరి 31 వరకు జరిగే జాతీయ రోడ్డు భద్రతా మాసం విజయవంతం చేసి రోడ్డు భద్రత పై పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. రాష్ట్రంలో ఉన్న 97 ఆర్టీసీ డిపో లు ,62 రవాణా కార్యాలయాల్లో భద్రతా నియమాలు తో అవగాహన కల్పిస్తూ బానర్ ఏర్పాటు చేయాలని సూచించారు.
జనవరి 1 నుండి జనవరి 31 వరకు జాతీయా రోడ్డు భద్రతా మాసం
— Ponnam Prabhakar (@Ponnam_INC) January 2, 2025
రోడ్డు భద్రతా మాసంలో భాగంగా వర్క్ షాప్ లు ,సెమినార్లు, డ్రైవర్లకు ,స్కూల్ విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు, కంటి చెకప్ క్యాంప్ లు నిర్వహణ
రాష్ట్రంలో ఉన్న 97 ఆర్టీసీ డిపో లు ,62 రవాణా కార్యాలయాల్లో భద్రతా నియమాలు తో… pic.twitter.com/ScM3p7eugu
Next Story