హోరెత్తిపోతున్న ‘జూబ్లీ’ రోడ్డుషోలు
x
Revanth and KTR road shows in Jubilee Hills by poll

హోరెత్తిపోతున్న ‘జూబ్లీ’ రోడ్డుషోలు

రెండుపార్టీలు పోటాపోటీగా రోడ్డుషోలు నిర్వహిస్తున్నాయి


ఉపఎన్నిక దగ్గరపడుతున్న నేపధ్యంలో పార్టీల అధినేతలు, ముఖ్యనేతలు రోడ్డుషోలతో హోరెత్తించేస్తున్నారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్ని(Jubilee Hills by poll)కు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈనెల 11వ తేదీన పోలింగ్ జరగబోతోంది. 9వ తేదీ సాయంత్రానికి ప్రచారం ముగించాల్సుంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్(BRS) రోడ్డుషోలతో హోరెత్తించేస్తున్నాయి. శుక్రవారం రాత్రి ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి(Revanth) ఆధ్వర్యంలో కాంగ్రెస్ అభ్యర్ధి వల్లాల నవీన్ యాదవ్ నాయకత్వంలో భారీ రోడ్డుషో జరిగింది. అలాగే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో అభ్యర్ధి మాగంటి సునీత పర్యవేక్షణలో కారుపార్టీ నేతలు, శ్రేణులు పెద్ద రోడ్డుషో నిర్వహించారు.

తుపాను ప్రభావితప్రాంతాలైన వరంగల్, హనుమకొండ జిల్లాల్లో పర్యటించి తర్వాత జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో శుక్రవారం సాయంత్రం సమీక్ష జరిపిన రేవంత్ తర్వాత హైదరాబాద్ చేరుకున్నారు. రాత్రి సుమారు 10 గంటల ప్రాంతంలో అభ్యర్ధి నవీన్, పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులతో రేవంత్ నియోజకవర్గంలోని వెంగళరావునగర్, యెల్లారెడ్డిగూడలో జరిగిన భారీ ర్యాలీలో పాల్గొన్నారు. అలాగే పై ప్రాంతాల్లో జరిగిన రోడ్డుషోల్లో ప్రసంగించారు. భారీ మెజారిటితో అభ్యర్ధి నవీన్ ను గెలిపించాలని ఓటర్లను అభ్యర్ధించారు. కాంగ్రెస్ ను గెలిపిస్తే జరిగే ప్రయోజనాలను రేవంత్ వివరించారు. ఇప్పటికే తమప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను గుర్తుచేశారు.

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా నియోజకవర్గంలో రోడ్డుషోలో పాల్గొన్నారు. షేక్ పేట నాలాలో జరిగిన కార్నర్ మీటింగులో ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీవల్ల జరుగుతున్న నష్టాలను వివరించారు. కారుపార్టీ అభ్యర్ధి సునీతను గెలిపిస్తే జరగబోయే ఉపయోగాలను కేటీఆర్ చెప్పారు. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ అమలవ్వాలంటే కాంగ్రెస్ ను ఓడించి బీఆర్ఎస్ అభ్యర్ధిని గెలిపించాల్సిందే అని కేటీఆర్ గట్టిగా చెప్పారు. ఇచ్చిన హామీలు కాంగ్రెస్ కు గుర్తుకురావాలన్నా, అమలవ్వాలన్నా బీఆర్ఎస్ గెలవాల్సిందే అని స్పష్టంగా చెప్పారు. సునీతను భారీ మెజారిటితో గెలిపించాలని, దివంగత ఎంఎల్ఏ మాగంటి గోపీనాధ్ ను ఆధరించినట్లుగానే భార్య, అభ్యర్ధి సునీతను కూడా ఆధరించి గెలిపించాలని విజ్ఞప్తిచేశారు.

పోలింగ్ తేదీ దగ్గరపడుతున్న నేపధ్యంలో రేవంత్ శనివారం కూడా నియోజకవర్గంలో రోడ్డుషోలో పాల్గొనబోతున్నారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు, కార్పొరేషన్ ఛైర్మన్లు, సీనియర్ నేతలతో ప్రతిరోజు ప్రచార తీరుతెన్నులను రేవంత్ విశ్లేషిస్తున్నారు. ప్రతిఇంటికి వెళ్ళి ప్రచారం చేసేట్లుగా అందరికీ దిశానిర్దేశం చేస్తున్నారు. 4,5 తేదీల్లో కూడా రెండోవిదత రోడ్డుషోలను రేవంత్ ప్లాన్ చేశారు. తర్వాత అవసరమైతే మరో విడత రోడ్డుషోలు లేదా బహిరంగసభలో పాల్గొనేందుకు రేవంత్ షెడ్యూల్ రెడీచేసుకున్నారు. ఉపఎన్నికలో గెలుపు రేవంత్ కు వ్యక్తిగతంగా చాలా ముఖ్యమని తెలిసిందే.

కేటీఆర్ కూడా ప్రతిరోజు రోడ్డుషోల్లో పాల్గొంటున్నారు. పార్టీకి చెందిన ఎంఎల్ఏలు, ఎంఎల్సీలందరినీ రంగంలోకి దింపేశారు. ప్రజా ప్రతినిధులకు సీనియర్ నేతలను తోడిచ్చి నియోజకవర్గంలోని ఏడు డివిజన్లలో కేటీఆర్ విస్తృతంగా పర్యటిస్తు, ప్రచారం చేయిస్తున్నారు. ఉపఎన్నికలో సునీత గెలవటం కేటీఆర్ కు వ్యక్తిగతంగా చాలా అవసరం. ఇపుడు సునీత ఓడిపోతే పార్టీకి పెద్ద మైనస్ అవవుతుందని రాజకీయపరిశీలకులు అంచనా వేస్తున్నారు.

పోటీలో ఉన్న మూడోపార్టీ బీజేపీ పెద్దగా చప్పుడు చేయటంలేదు. అభ్యర్ధి లంకల దీపక్ రెడ్డి తరపున కేంద్రమంత్రి జీ కిషన్ రెడ్డి రెండుసార్లు ప్రచారంచేశారు. పార్టీఅధ్యక్షుడు నారపరాజు రామచంద్రరావు ఆధ్వర్యంలో పార్టీ ప్రజాప్రతినిధులు, సీనియర్ నేతలు నియోజకవర్గంలో గట్టిగానే ప్రచారంచేస్తున్నారు. అయితే పై రెండుపార్టీలతో పోల్చుకుంటే బీజేపీ వెనకబడిందనే చెప్పాలి.

Read More
Next Story