హైదరాబాద్ వాటర్ పైప్ లైన్స్ ప్రక్షాళన కు రోబో లు
x

హైదరాబాద్ వాటర్ పైప్ లైన్స్ ప్రక్షాళన కు రోబో లు

హైదరాబాద్ నీళ్ల మీద నమ్మకం లేకే ఇంట్లో వాటర్ ఫిల్టర్స్


‘దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరం’గా అవార్డు పొందిన ఇండోర్, తాగునీటిలో మురుగునీరు కలవడం వల్ల భాగీరథ్‌పురాలో 15 మంది మరణించారు. 1100 మందికి పైగా అస్వస్థతకు గురై వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న నేప‌థ్యంలో హైద‌రాబాద్‌లో ప‌రిస్థితి ఎలా వుంద‌ని ఫెడ‌ర‌ల్ తెలంగాణా బృందం చింత‌ల్‌, షాపూర్‌, జీడిమెట్ల‌, సుభాష్‌న‌గ‌ర్‌, వినాయ‌క్‌న‌గ‌ర్‌, ముషీరాబాద్‌, స‌రూర్‌న‌గ‌ర్, ఖైర‌తాబాద్‌ ప్రాంతాల్లో ప‌ర్య‌టించి అక్క‌డి ప్ర‌జ‌ల‌తో మాట్లాడింది.

"రోజు విడిచి రోజు నీళ్లు వ‌స్తున్నా ఆ నీళ్ళు తాగే ధైర్యం మాకు లేదు. అందుకే బ‌య‌ట నీళ్లు కొని తాగుతున్నాం. సంవ‌త్స‌రానికి 6 వేల‌కు పైగా ఖ‌ర్చు అవుతుంది," అని చింత‌ల్ బ‌స్తీవాసులు చెప్పారు.

"అప్పుడ‌ప్పుడు మురికి మురికి నీళ్ళు వ‌స్తున్నాయి. వాస‌న వ‌స్తుంది. అయినా బియ్యం క‌డ‌గ‌డానికి, తాగ‌డానికి ఆ నీళ్ళే వాడుతున్నాం. చూడ‌డానికి నీళ్ళు బాగానే వున్నాయి. కానీ తాగేట‌ప్పుడు ఆ నీళ్ళ‌లో వాస‌న వ‌స్తుంద‌ని అయినా అవే తాగుతున్నాం," అని సుభాష్‌న‌గ‌ర్‌కు చెందిన యాద‌మ్మ చెప్పారు.

"ఎన్నిక‌ల‌ప్పుడే నేత‌లు వ‌స్తున్నారు. ఆ త‌రువాత ఇటు వైపు క‌న్నెత్తి చూసే వాళ్ళు లేరు. నీళ్ళు వ‌స్తున్నాయి కానీ అప్ప‌డ‌ప్పుడు మురికి నీళ్ళు వ‌స్తున్నాయి," అని ప‌లు బ‌స్తీలో స్థానికుల నుంచి మిశ్ర‌మ స్పంద‌న వ‌చ్చింది.

"న‌ల్లా నీళ్ళ‌ను గృహ అవ‌స‌రాల‌కు వాడుతూ, తాగ‌డానికి బాటిల్ వాళ్ళుతున్నామ‌ని 80 శాతం స్థానికులు చెప్పారు. న‌ల్లా నీళ్ళ‌ను కేవ‌లం ఇంట్లో అవ‌స‌రాల‌కే వాడుకుంటాం. తాగ‌డానికి బాటిల్ నీళ్ళు తెచ్చుకుంటాం. నీళ్ళ‌తో స‌మ‌స్య లేదు, బాగానే నీళ్ళు వ‌స్తున్నాయ‌ని," వినాయ‌క‌న‌గ‌ర్‌కు చెందిన హ‌రి, స‌తీష్ చెప్పారు.

ఖైర‌తాబాద్ బ‌డా గ‌ణేష్ వెనుక వున్న బ‌స్తీలో స‌మ‌స్య ఉంది. ఈ బ‌స్తీ గాంధీన‌గ‌ర్ ఉప్ప‌ల‌మ్మ టెంపుల్ వ‌ద్ద వుంది. "రోజు నీళ్ళు వ‌స్తున్నాయి. కానీ మురికి నీళ్ళు, వాస‌న‌తో వ‌స్తున్నాయి. ఫిర్యాదు చేశాం. కానీ ఎవ‌రూ రాలేదు. డ్రైనేజ్ నీళ్ళు వ‌స్తున్నాయి," అని స్థానిక మ‌హిళ‌లు ల‌క్ష్మీప్రియ‌, స‌రోజా ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

"మా బ‌స్తీకి ఒక ప‌క్క స‌చివాల‌యం, మ‌రో ప‌క్క వాట‌ర్ వ‌ర్క్స్ ప్ర‌ధాన కార్యాల‌యం వుంది. అయినా ఇక్క‌డే స‌మ‌స్య వుంది" అంటే న‌గ‌రంలో ఎలా ఉందో ఊహించుకోవ‌చ్చ‌ని జానీగౌడ్ అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. ఇండోర్ సంఘ‌ట‌న నేప‌థ్యంలో ప్ర‌భుత్వం వెంట‌నే స్పందించాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.

ప్రస్తుతం హైదరాబాద్ తాగునీటి అవసరాలకు అన్ని వనరుల నుంచి 580 ఎంజీడీల నుంచి 600 ఎంజీడీల నీరు సరఫరా చేస్తున్నారు. జ‌ల‌మండ‌లి ప‌రిధిలో దాదాపు 1150 కి పైగా ట్యాంక‌ర్లు, 90 ఫిల్లింగ్ స్టేషన్లు, 150 ఫిల్లింగ్ పాయింట్స్ ఉండగా, గ‌త‌ ఏడాది జనవరి 1 నుంచి మొత్తం డిసెంబర్ 30వ తేదీ వరకు సుమారు 19 లక్షల 62 వేల 99 ట్యాంక‌ర్ ట్రిప్పులను జలమండలి డెలివరీ చేసింది.

అయితే "ప్ర‌తి రోజు ఐదు ఫిర్యాదులు వ‌స్తున్నాయి. వాటిని రెడ్ జోన్‌గా పెట్టి పైప్‌లైన‌ల‌నే మార్చి వేస్తున్నాం. వాటర్ పొల్యూషన్ ఫ్రీ సిటీగా హైదరాబాద్​ను మార్చ‌డానికి రోబోటిక్ టెక్నాలజీని వాడుతున్నాం," అని మెట్రో వాటర్ బోర్డు ఎండీ అశోక్ రెడ్డి ఫెడ‌ర‌ల్ తెలంగాణాతో తెలిపారు. మెట్రో కస్టమర్ కేర్ లో "ఏ ప్రాంతాల నుంచి అధిక ఫిర్యాదులు వస్తున్నాయో సమాచారం సేకరించి సమస్య మూలాలను విశ్లేషిస్తున్నాం. కాలం చెల్లిన పైప్ లైన్ల పటిష్టతను అంచనా వేసి, వాటి స్థానంలో కొత్తవి ఏర్పాట్లు చేస్తున్నాం," అని ఎం.డీ. తెలిపారు.

ఇప్పటి వరకు "కలుషిత నీరు కనిపెట్టేందుకు అధికారులు ఆయా ప్రాంతాల్లో పైప్ లైన్లను తవ్వి పరిశీలిస్తున్నారు. దీని వల్ల ఎంతో సమయం, మ్యాన్​పవర్, ఖర్చు పెరుగుతోంది. తాజాగా రోబోటిక్​టెక్నాలజీతో కలుషిత నీరు, లీకేజీలు అరికట్టడానికి చర్యలు తీసుకుంటున్నాం. ఇందుకోసం రోబోటిక్ టెక్నాలజీతో పనిచేసే పొల్యూషన్ ఐడెంటిఫికేషన్ మెషిన్​ను అందుబాటులోకి తీసుకొచ్చాం. ఈ యంత్రాన్ని పైప్ ఇన్​స్పెక్షన్ కెమెరా సిస్టమ్ అని కూడా అంటారు. కలుషిత నీటి సరఫరా జరుగుతున్న ప్రాంతాల్లోని పైప్​లైన్​లోకి ఈ కెమెరా కలిగిన యంత్రాన్ని వదులుతారు. దీంతో పైప్​లైన్​లో ఉన్న కలుషిత నీటిని, అందులో ఉన్న కలుషిత పదార్థాలు కంప్యూటర్​ మానిటర్​ పై స్పష్టంగా కనిపిస్తుంది. దీంతో వెంటనే సమస్యను పరిష్కరించడానికి అవకాశం ఉంటుందని ఎండీ అశోక్ రెడ్డి తెలిపారు.

గ్రేట‌ర్ ప‌రిధిలో కోటిన్న‌ర‌కు పైగా జనాభాకు జ‌ల‌మండ‌లి తాగునీటి సరఫరాతో పాటు మురుగు నీటి నిర్వహణ బాధ్యతల్ని నిర్వహిస్తోంది. 11 వేల కిలోమీట‌ర్‌ల‌ వాట‌ర్ స‌ప్లాయి లైన్లు, 13 వేల కీలోమీట‌ర్ల సివ‌రేజ్ లైన్లు వున్నాయి.

Read More
Next Story