కవితకు ఎంతకాలమీ జైలువాసం ?
x

కవితకు ఎంతకాలమీ జైలువాసం ?

కవితేమో తనకు అసలు స్కామ్ తో సంబంధమే లేదని చెబుతున్నారు. ఈడీ ఏమో స్కామ్ లో కవితే సూత్రదారి కీలకపాత్రదారంటు పదేపదే ఆరోపణలు చేస్తోంది.


ఈ విషయమే కల్వకుంట్ల ఫ్యామిలీతో పాటు కారుపార్టీ నేతలకు అర్ధంకావటంలేదు. బెయిల్ కోసం కవిత పెట్టుకున్న పిటీషన్ను రౌస్ ఎవిన్యు కోర్టు కొట్టేసింది. జ్యుడీషియల్ కస్టడీని 20వ తేదీవరకు కోర్టు పొడిగించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మార్చిలో అరెస్టయిన కవిత అప్పటినుండి ఢిల్లీలోని తీహార్ జైలులోనే ఉంటున్నారు. మంగళవారంతో ఈడీ కస్టడీ అయిపోవటంతో బెయిల్ ఇవ్వాలని కవిత పిటీషన్ దాఖలు చేశారు. అయితే లిక్కర్ స్కామ్ లో కవిత పాత్రపై ఇప్పటికే ఈడీ కోర్టుకు అనేక ఆధారాలను అందించింది. కవిత పాత్రపై అనేక ఆరోపణలు చేయటమే కాకుండా అందుకు తగ్గ ఆధారాలను కూడా ఈడీ కోర్టుకు చూపించింది. ఆరోపణలు, ఆధారాలతో కోర్టు ఏకీభవించిన కారణంగానే కవిత ఎన్నిసార్లు బెయిల్ పిటీషన్లు వేసినా కోర్టు సానుకూలంగా స్పందించటంలేదు.

ఈమధ్యనే పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ కు తాను స్టార్ క్యాంపెయినర్ గా ప్రచారం చేయాలికాబట్టి బెయిల్ ఇవ్వమని అడిగినా కోర్టు అంగీకరించని విషయం తెలిసిందే. చివరకు స్టార్ క్యాంపెయినర్ లేకుండానే ఎన్నికలు అయిపోయాయి. నిజానికి కేసీయార్, కేటీయార్, హరీష్ రావుండగా మళ్ళీ కవిత ఎన్నికల్లో పార్టీని గెలిపించటం కోసం అదనంగా చేయగలిగేది ఏమీ ఉండదు. కాని పార్టీ తనను స్టార్ క్యాంపెయినర్ గా పెట్టింది కాబట్టి ఆ కారణంచూపి కోర్టును బెయిల్ అడిగారంతే. ముందు కొడుకు చదువు, పరీక్షలన్నా కోర్టు బెయిల్ ఇవ్వలేదు. ఇపుడేమో ఎన్నికల్లో స్టార్ క్యెంపెయినర్ అని చెప్పినా కోర్టు పట్టించుకోలేదు. మధ్యలో పొత్తికడుపు, బీపీ లాంటి అనేక అనారోగ్య కారణాలను చూపించినా కోర్టు పట్టించుకోలేదు.

కోర్టులో జరుగుతున్న వ్యవహారాలను చూసిన తర్వాత అందరిలోను పెరిగిపోతున్న అనుమానాలు ఏమిటంటే కల్వకుంట్ల కవిత ఎంతకాలం జైలులో ఉండాలి అని. కవితకు జైలువాసం ఎంతకాలమో కేసీయార్ ఫ్యామిలీకి కూడా అర్ధమవుతున్నట్లు లేదు. ఆమె తరపున వాదించటానికి పెద్ద లాయర్లను పెట్టినా ఎలాంటి ఉపయోగం కనబడటంలేదు. ఈడీ కోర్టులో 8 వేల పేజీల సప్లిమెంటరీ చార్జిషీటును దాఖలుచేయటమే ఆశ్చర్యంగా ఉంది. అన్ని వేల పేజీల్లో లిక్కర్ స్కామ్ లో కవిత పాత్రను ఈడీ ఎంత గట్టిగా చూపించిందో అర్ధంకాక పార్టీతో పాటు ఆమె ఫ్యామిలిలో టెన్షన్ పెరిగిపోతున్నట్లుంది. కవితేమో తనకు అసలు స్కామ్ తో సంబంధమే లేదని చెబుతున్నారు. ఈడీ ఏమో స్కామ్ లో కవితే సూత్రదారి కీలకపాత్రదారంటు పదేపదే ఆరోపణలు చేస్తోంది. సప్లిమెంటరీ చార్జిషీటును పరిగణలోకి తీసుకోవద్దని కవిత కోర్టును విజ్ఞప్తిచేసింది. సప్లిమెంటరీ చార్జిషీటును పరిగణలోకి తీసుకునేది లేనిది ఈనెల 20వ తేదీ విచారణలో ఫైనల్ చేస్తామని కోర్టు చెప్పింది. తనను వర్చువల్ గా కాకుండా ప్రత్యక్షంగా కోర్టులోనే విచారించాలని కవిత అడిగినా కోర్టు పట్టించుకోలేదు. మరి 20వ తేదీన సప్లిమెంటరీ చార్జిషీటుపై ఎలాంటి నిర్ణయం వస్తుందో చూడాలి.

Read More
Next Story