ఫలితాలకు కూడా కవిత లోపలే
x
Kavitha remand extended

ఫలితాలకు కూడా కవిత లోపలే

పాపం కల్వకుంట్ల కవిత కోరిక తీరలేదు. కవిత బెయిల్ ను రౌస్ ఎవిన్యు కోర్టు జూన్ 7వ తేదీవరకు పొడిగించింది.


పాపం కల్వకుంట్ల కవిత కోరిక తీరలేదు. కవిత బెయిల్ ను రౌస్ ఎవిన్యు కోర్టు జూన్ 7వ తేదీవరకు పొడిగించింది. 7వ తేదీవరకు ఎందుకంటే ఆరోజు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత పాత్రపై సీబీఐ చార్జిషీటు దాఖలు చేయబోతోంది. ఇక ఈడీ అరెస్టుకు సంబంధించి కవిత జ్యుడీషియల్ రిమాండును కోర్టు జూలై 3వ తేదీవరకు పొడిగించింది. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్ధుల తరపున ప్రచారంచేసి పార్టీకి అత్యధిక సీట్లలో విజయం సాధించిపెట్టాలని కవిత చాలా ప్లాన్లు వేసినట్లున్నారు. అయితే ఊహించని రీతిలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ కవితను హైదరాబాద్ లోని తనింట్లోనే అరెస్టుచేసి ఢిల్లీకి తీసుకెళ్ళిపోయింది. మార్చిలో అరెస్టయిన కవిత ఇప్పటికీ ఢిల్లీలోని తీహార్ జైలులోనే ఉండిపోయారు. బెయిల్ కోసం శతవిధాలుగా ప్రయత్నాలు చేసినా ఉపయోగం కనబడలేదు. ముందు అనారోగ్యమన్నారు, తర్వాత కొడుకు చదువు, పరీక్షలన్నారు. ఆ తర్వాత పార్లమెంటు ఎన్నికల్లో ప్రచారమని చెప్పారు. పార్టీకి తాను స్టార్ క్యాంపెయినర్ అని పదేపదే విజ్ఞప్తిచేశారు.

బెయిల్ కోసం ఎన్ని ప్రయత్నాలుచేసినా కోర్టు అంగీకరించలేదు. స్టార్ క్యాంపెయినర్ గా ప్రచారంచేసి పార్టీ అభ్యర్ధులను గెలిపించాలని అనుకుంటే చివరకు ఎన్నికల్లో కవిత పాత్రలేకుండానే ఫలితాలు కూడా వచ్చేస్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్ ప్రకారమైతే మంగళవారం వెలువడే ఫలితాలు అంత ఆశాజనకంగా ఉండవని అర్ధమైంది. అయితే కేసీయార్, కేటీయార్ మాత్రం ఎగ్జిట్ పోల్ ఫలితాలంతా ఉత్త బూటకమని కొట్టిపారేస్తున్నారు. అత్యధిక సీట్లను తమ పార్టీయే గెలవబోతోందని పదేపదే చెబుతున్నారు. సరే, ఎవరి బింకం ఎలాగున్నా, ఎవరి అంచనాలు ఎలాగున్నా మంగళవారం బయటపడే ఫలితాల్లో ఎవరి విషయం ఏమిటో తేలిపోతుంది.

ఈ మొత్తంమీద కవితను చూస్తుంటే జనాలు చాలామంది జాలిపడుతున్నారు. బెయిల్ కోసం ఎన్ని ప్రయత్నాలుచేసినా, ఎన్ని కారణాలు చెప్పినా కోర్టు మాత్రం అంగీకరించలేదు. మరి ఫలితాలు కూడా వచ్చేస్తే ఇక కవిత ఏమి కారణం చెబుతారు ? అన్న విషయమై జనాలు ఆసక్తిగా మాట్లాడుకుంటున్నారు. తొందరలోనే ప్రభుత్వం స్ధానిక సంస్ధల ఎన్నికలను నిర్వహించాలని అనుకుంటోంది. బహుశా ఆ ఎన్నికల సమయానికి కూడా బెయిల్ రాకపోతే అప్పుడు కూడా పార్టీ తరపున ప్రచారం చేయాలని దరఖాస్తు చేస్తారేమో అని కవితపై సెటైర్లు పేలుతున్నాయి. మొత్తంమీద కవిత పాత్రలేకుండానే పార్లమెంటు ఎన్నికలు ముగిసిపోయాయన్నది మాత్రం వాస్తవం.

Read More
Next Story