
పోలీసుల కాల్పుల్లో రియాజ్ మృతి..
కానిస్టేబుల్ గన్ లాక్కుని పరారీకి ప్రయత్నించిన రియాజ్. ఆత్మరక్షణలో కాల్పులు జరిపిన పోలీసులు.
రౌడీ షీటర్ రియాజ్‌ను పోలీసులు జరిపిన కాల్పుల్లో మరణించాడు. నిజామాబాద్‌లో కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో నిందితుడు అయిన రియాజ్‌కు పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఓ యువకుడితో జరిగిన ఘర్షణలో గాయపడిన రియాజ్‌ను పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. సోమవారం ఉదయం ఆసుపత్రి నుంచి పారిపోవడానికి రియాజ్ ప్రయత్నించాడు. ఈ సమయంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో రియాజ్ మరణించాు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చికిత్స పొందుతున్న రియాజ్ బాత్రూంకి అని చెప్పి లేచాడు. అదే సమయంలో అక్కడ సెక్యూరిటీగా ఉన్న కానిస్టేబుళ్లపై దాడి చేసిన వారి దగ్గర ఉన్న గన్‌ను లాక్కున్నాడు. ఈ ఘర్షణలో ఓ కానిస్టుబుల్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం అక్కడి నుంచి పారిపోయేందకు రియాజ్ ప్రయత్నించాడు. అప్పుడు పోలీసులు జరిపిన కాల్పుల్లో రియాజ్ మరణించాడు. ఈ ఘటన జీజీహెచ్‌లో చోటు చేసుకోగా.. రియాజ్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు పోలీసులు.
గతంలోనూ వచ్చిన ఎన్‌కౌంటర్ వార్తలు..
అయితే కానిస్టేబుల్ ప్రమోద్ హత్య తర్వాత రియాజ్ అజ్ఞాతంలోకి వెళ్లాడు. దాంతో రియాజ్‌ను పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారన్న వార్తలు గట్టిగా వినిపించాయి. కాగా ఆ వార్తలను నిజామాబాద్ సీపీ ఖండించారు. రియాజ్ ఎన్‌కౌంటర్ జరగలేదని చెప్పారు. సారంగాపూర్ అటవీ ప్రాంతంలో రియాజ్ ఓ వ్యక్తితో ఘర్షణ పడటంతో గాయాలయ్యాడని, ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నట్టు, రియాజ్ కు చికిత్స కొనసాగుతుందని పోలీసులు చెప్పారు. కానిస్టేబుల్ ప్రమోద్ హత్య తర్వాత రియాజ్ పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్నాడు. నిజామాబాద్ సారంగాపూర్ లో రోడ్డు ప్రమాదానికి గురైన లారీలో రియాజ్ తలదాచుకున్నాడని తెలిపారు. నిజామాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో కానిస్టేబుల్ దగ్గర నుంచి గన్ లాక్కుని పారిపోవడానికి రియాజ్ ప్రయత్నించగా పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చింది. ఈ ఘటనలో రియాజ్ మరణించాడు.