భవిష్యత్తులో కేసీఆర్ తో కలిసి పని చేస్తా.. ఆర్ఎస్పీ
బీఆర్ఎస్ - బీఎస్పీ పొత్తు ప్రకటించి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అందర్నీ ఆశ్చర్యపరిచారు. నేడు అంతకంటే ఆశ్చర్యానికి గురి చేస్తూ బీఎస్పీని వీడుతున్నట్టు ప్రకటించారు.
బీఆర్ఎస్ - బీఎస్పీ పొత్తు ప్రకటించి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అందర్నీ ఆశ్చర్యపరిచారు. నేడు అంతకంటే ఆశ్చర్యానికి గురి చేస్తూ బీఎస్పీని వీడుతున్నట్టు ప్రకటించారు. బీఎస్పీ సభ్యత్వానికి తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. రాజీనామా అనంతరం కేసీఆర్ నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. అనంతరం తన రాజీనామాకు గల కారణాలను మీడియాకు వివరించారు.
"రాజ్యాంగాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ - బీఎస్పీ పొత్తు పెట్టుకున్నాం. అందులో భాగంగా నాగర్ కర్నూల్, హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గాల్లో బీఎస్పీ పోటీ చేసేందుకు ఇరువర్గాల ఆమోదంతో నిర్ణయం తీసుకున్నాం. శుక్రవారం మా పార్టీ కేంద్ర సమన్వయకర్త అనుమతితో అఫిషియల్ గా ప్రకటించాం. కానీ ఈ లౌకిక కూటమిని రాజ్యాంగాన్ని పరిరక్షించే కూటమిని ఓర్వలేని మోడీ, అమిత్ షా ద్వయం నాపై ఒత్తిడి తీసుకొచ్చారు. పొత్తు రద్దు చేసుకుంటున్నట్టు నన్నే ప్రెస్ మీట్ పెట్టి చెప్పమన్నారు. పొత్తు ధర్మంలో భాగంగా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా రెండు పార్టీలు కలిసి నడవాలి. దురదృష్టవశాత్తు ఆ పొత్తును రద్దు చేసుకోవాలంటూ నాపై ఒత్తిడి పెరిగింది. బిజెపి రాజ్యాంగాన్ని రద్దు చేయాలనే కుటిల ప్రయత్నాలకు తలొగ్గి పొత్తు రద్దు చేస్తే.. నేను బహుజనులకు అన్యాయం చేసిన వాడిని అవుతాను. అందుకే లౌకికవాదాన్ని బ్రతికించడం కోసం నేను పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను. ప్రజలు అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. భవిష్యత్తులో కేసీఆర్ తో కలిసి పని చేస్తా.. త్వరలోనే తదుపరి కార్యాచరణపై ప్రకటన ఉంటుంది" అని ఆర్ఎస్పీ వెల్లడించారు.