ఫోన్ ట్యాపింగ్ పై మాజీ ఐపీఎస్ 'నో కామెంట్'
ఫోన్ ట్యాపింగ్ పై మీడియా అడిగిన ప్రశ్నకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు. నో కామెంట్స్ అంటూ తాను గతంలో పోలీస్ అధికారినని గుర్తు చేశారు.
వనపర్తి జిల్లాలో బీఆర్ఎస్ సీనియర్ నేత శ్రీధర్ రెడ్డి హత్య కేసు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆయన హత్య కేసులో సమగ్ర విచారణ జరపాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోలీస్ అధికారులను కోరారు.. ఈ మేరకు సోమవారం డిజిపి రవి గుప్తాని కలిసి నిష్పక్షపాతంగా విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. శ్రీధర్ రెడ్డి హత్య కేసులో మంత్రి జూపల్లి కృష్ణారావు మీద కంప్లైంట్ చేసినప్పటికీ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ప్రధాన నిందితుడు జూపల్లి ఇంట్లోనే ఉన్నాడని, ఈ కేసులో ఇప్పటివరకు ఎవరిని అరెస్టు చేయలేదని మండిపడ్డారు. శ్రీధర్ రెడ్డి హత్య కేసును ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణ జరిపించాలని, వారం రోజుల్లో ఈ కేసులో న్యాయం జరగకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు.
ఫోన్ ట్యాపింగ్ పై నో కామెంట్స్
ఫోన్ ట్యాపింగ్ అంశంపై అడిగిన ప్రశ్నకు స్పందించిన RSP.. ఇది దేశ భద్రతకు సంబంధించిన వ్యవహారమని దానిపై మాజీ పోలీస్ అధికారిని అయిన నేను ఎలాంటి కామెంట్ చేయను అని స్పష్టం చేశారు. గతంలో కూడా మీడియా మిత్రులు అడిగితే ఇదే సమాధానం చెప్పాను అని గుర్తు చేశారు. పోలీసులు ఫోన్ ట్యాపింగ్ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, ఎవరు తప్పు చేస్తే వారిపై చర్యలు తీసుకుంటారని ఆర్ఎస్ ప్రవీణ్ అన్నారు. ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని రాజకీయం కోసం వాడకండి, ఫోన్ ట్యాపింగ్ వ్యక్తిగత అవసరాల కోసం వాడుకుంటే ఖచ్చితంగా వారిని పోలీసులు అరెస్టు చేస్తారని ఆర్ఎస్పీ అన్నారు. కాగా, ఆయన స్టేట్ బీజేపీ చీఫ్ గా ఉన్న సమయంలో తన ఫోన్ కూడా ట్యాప్ చేస్తున్నారంటూ బహిరంగ ఆరోపణలు చేయడం విశేషం.