24 గంటల్లో 5 హత్యలు, 2 హత్యాప్రయత్నాలు!!
x

24 గంటల్లో 5 హత్యలు, 2 హత్యాప్రయత్నాలు!!

తెలంగాణ రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న నేరాలపై మాజీ ఐపీఎస్ అధికారి, బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రంగా స్పందించారు.


తెలంగాణ రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న నేరాలపై మాజీ ఐపీఎస్ అధికారి, బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రంగా స్పందించారు. హైదరాబాద్ లో 24 గంటల వ్యవధిలో పలు ప్రాంతాల్లో 5 హత్యలు, 2 హత్యాయత్నాలు జరగడం ఆందోళనకర విషయమన్నారు. హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడేవారిపై కేసులు పెట్టడంలో పోలీసులు బిజీ అయిపోయారని మండిపడ్డారు. ఇంటెలిజెన్స్ విఫలమైందని ఆరోపించారు.

శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... దేశంలో హోమ్ మంత్రి, విద్యాశాఖ మంత్రి లేని రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది తెలంగాణ రాష్ట్రమే అని అన్నారు. ముఖ్యమంత్రి హోమ్ శాఖ, విద్యాశాఖ, ఎస్సీ సంక్షేమ శాఖ, రకరకాల శాఖలు తన గుప్పెట్లో పెట్టుకుని రాష్ట్రాన్ని పూర్తిగా అభద్రతా భావంతో బ్రతికేలా చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కొల్లాపూర్‌లోని మూల్చింతలపల్లి గ్రామంలో ఓ గిరిజన మహిళను వారం రోజులపాటు కిడ్నాప్ చేసి అత్యాచారం చేస్తే కనీసం పోలీసులకు ఈ మాత్రం సమాచారం లేకపోవటమనేది ఈ రాష్ట్రంలో భద్రత వ్యవస్థ, ఇంటెలిజెన్స్ వ్యవస్థ, సమాచార సేకరణ వ్యవస్థ ఎంత ఘోరంగా ఉందో అర్థమవుతుందన్నారు.

24 గంటల్లో 5 హత్యలు, 2 హత్యాప్రయత్నాలు అంటే శాంతి భద్రత వ్యవస్థ ఎక్కడ ఉంది? ఎక్కడికి పోయారు పోలీసులు? అని ప్రశ్నించారు. పోలీసులు దేంట్లో బిజీగా ఉన్నారు అంటే రేవతి అనే ఒక జర్నలిస్ట్ కరెంటు లేదని ట్వీట్ చేస్తే ఆమె మీద సెక్షన్ 505, సెక్షన్ 66 ఐటీ యాక్ట్ కింద పోలీసులు కేసు పెట్టడంలో అని ఆర్ఎస్పీ విమర్శించారు.

"505 సెక్షన్ అనేది ప్రజల మీద భయాందోళనలు సృష్టించి, విద్వేషం రగిలించి, ప్రజలు రెండు గ్రూపులుగా విడిపోయి ఒకరిని ఒకరు కొట్టుకోడానికి ప్రేరేపిస్తే అప్పుడు ఆ సెక్షన్ పెట్టాలి. కానీ ప్రశ్నించే వాళ్లు జర్నలిస్టులైనా సరే, గృహిణులు అయినా, విద్యార్థులు అయినా సరే కేసులు పెట్టండని రేవంత్ రెడ్డి పోలీసులకు ఆదేశాలిచ్చారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు.

హైదరాబాద్‌లో 24 గంటల వ్యవధిలో 5 హత్యలు, 2 హత్యాయత్నాలు..

షా అలీ బండా పీఎస్ పరిధిలోని కాలాపతేర్ దగ్గర రఫీక్ బిన్ అనే వ్యక్తి, ఆసిఫ్ నగర్ పీఎస్ పరిధిలోని ఆసిఫ్ నగర్ దగ్గర అలీమ్ అనే వ్యక్తి, కాచిగూడ పీఎస్ పరిధిలో ఖైజర్ అనే యువకుడు, తుకారాం గేట్ పీఎస్ పరిధిలో రోజా అనే మహిళ, సనత్ నగర్ పీఎస్ పరిధిలోని భరత్ నగర్ వద్ద అజరు అనే వ్యక్తులు హత్యకు గురయ్యారు. షా అలీ బండా పీఎస్ పరిధిలో కాలాపతేర్ దగ్గర వాజిద్ అనే వ్యక్తి పై హత్యాయత్నం.. చందూలాలా బరాదారి దగ్గర ఫకృద్దీన్ పై మరో హత్యాయత్నం జరిగింది.

Read More
Next Story