
‘పేదవారి ప్రగతి చక్రం ఆర్టీసీ బస్సు’
మహిళల ప్రయాణం 35 శాతం నుంచి 60 శాతానికి పెరిగింది.
తెలంగాణ ప్రజల జీవితాల్లో ఆర్టీసీ ఎంతో కీలక పాత్ర పోషిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజలను తమ గమ్యస్థానాలకు సురక్షితంగా చేర్చడంతో ఎందరో అభ్యున్నతికి ఆర్టీసీ ప్రత్యక్ష సహకారం అందిస్తోందని చెప్పారు. తమ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘మహాలక్ష్మీ’ పథకంతో మహిళలకు ప్రయాణంలో ఆర్దికభారం తగ్గిందని, ఈ పథకం ఎంతో మందికి ఊరటను అందించిందని పేర్కొన్నారు. "ఆర్టీసీ బస్సు పేదవారి ప్రగతి రథ చక్రం" అని పేర్కొన్నారు. ఇప్పటివరకు రూ.200 కోట్ల విలువైన జీరో టికెట్ల ద్వారా మహిళలకు ప్రయోజనం చేకూరిందని వెల్లడించారు. మహాలక్ష్మి పథకం అమలుతో మహిళల ప్రయాణం 35 శాతం నుంచి 60 శాతానికి పెరిగిందని తెలిపారు. గత ప్రభుత్వాల అణచివేతలో ఉన్న ఆర్టీసీని పునరుత్తేజితం చేయడంలో సిబ్బంది కీలకంగా పనిచేశారని, వారికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. మహాలక్ష్మి పథకంతో ఆడబిడ్డలకు ఆర్థిక భారం తగ్గడం ఒక సామాజిక విప్లవం లాంటిదని అభివర్ణించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి ఆర్టీసీ సిబ్బందిని అభినందిస్తూ, ప్రజల సేవలో మరింత చొరవగా పనిచేయాలన్నారు. ప్రభుత్వ ప్రాధాన్య కార్యక్రమాల్లో ఒకటైన మహాలక్ష్మి పథకాన్ని మరింత విస్తరించేందుకు చర్చలు కొనసాగుతున్నట్టు సమాచారం.