హైదరాబాద్ మొత్తం ఎలక్ట్రిక్ బస్సులేనా ?
x
Electric bus

హైదరాబాద్ మొత్తం ఎలక్ట్రిక్ బస్సులేనా ?

హైదరాబాద్ సిటీలో తిరుగుతున్న డీజల్ బస్సుల స్ధానంలో నూరుశాతం ఎలక్ట్రిక్ బస్సులతో భర్తీ చేయాలని డిసైడ్ అయ్యింది.


అనుకున్నది అనుకున్నట్లు జరిగితే తొందరలోనే హైదరాబాద్ సిటీలో డీజల్ బస్సులన్నవే కనబడవు. ఎందుకంటే హైదరాబాద్ సిటీలో తిరుగుతున్న డీజల్ బస్సుల స్ధానంలో నూరుశాతం ఎలక్ట్రిక్ బస్సులతో భర్తీ చేయాలని డిసైడ్ అయ్యింది. దీనివల్ల వాతావరణ కాలుష్యం నివారణతో పాటు ఆర్టీసీపై డీజల్ ఖర్చులు గణనీయంగా తగ్గిపోతుంది. మొదట్లో ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలుకు ఖర్చు ఎక్కువగా అయినా దీర్ఘకాలంలో చూస్తే డీజల్ బస్సుల నిర్వహణతో పోల్చుకుంటే ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ వ్యయం చాలా తగ్గిపోతుంది. పైగా చాలా రంగాల్లో భవిష్యత్తంగా ఎలక్ట్రికల్ రంగానిదే కదా. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు డీజల్, పెట్రోలు వాడకాన్ని తగ్గించేసి గ్యాస్ లేదా ఎలక్ట్రిక్ వైపుకు మొగ్గుచూపుతున్నాయి. ఇందులో భాగంగానే ఈమధ్య ఆర్టీసీ మీద జరిగిన సమీక్షలో డీజల్ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులతో రీప్లేస్ చేయాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు.

అందుబాటులోని సమాచారం ప్రకారం ప్రస్తుతం సిటీలో 2700 డీజల్ బస్సులు తిరుగుతున్నాయి. వీటిల్లో ప్రయోగాత్మకంగా తిప్పుతున్నవి కేవలం 100 ఎలక్ట్రిక్ బస్సులు మాత్రమే. ఒకేసారి ఇన్ని బస్సులను కొనాలంటే సంస్ధ వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సుంటుంది. అన్ని నిధులు ఆర్టీసీ దగ్గర లేవు. ఒక ఎలక్ట్రిక్ బస్సు ఖరీదు సుమారు రు. 1.85 కోట్లు. ఈ లెక్కల 2700 ఎలక్ట్రిక్ బస్సులు కొనాలంటే మామూలు విషయం కాదు. అందుకనే ఎలక్ట్రిక్ బస్సులను ఉత్పత్తి చేస్తున్న మూడు కంపెనీలతో జీసీసీ(గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్) పద్దతిలో ఆర్టీసీ ఉన్నతాధికారులు చర్చలు జరుపుతున్నారు. అంటే ఈ పద్దతిలో బస్సులను కొనటం బదులు ఉత్పత్తి చేస్తున్న కంపెనీల నుండి అద్దెకు తీసుకోవటం అన్నమాట. ఈ పద్దతిలో బస్సులను ఉత్పత్తి చేస్తున్న కంపెనీయే డ్రైవర్ ను సమకూరుస్తుంది. కండక్టర్లు మాత్రం ఆర్టీసీ వాళ్ళే ఉంటారు. అంతేకాకుండా నిర్వహణ మొత్తాన్ని సదరు కంపెనీయే చూసుకుంటుంది.

జీసీసీ పద్దతిలో కిలోమీటరుకు రు. 60 చెల్లించే అవకాశముంది. కండక్టర్ ఖర్చు రు. 18గా అంచనా వేస్తున్నారు. ఇపుడు తిరుగుతున్న వంద బస్సులు ఒలెక్ట్రా, జేబీఎం కంపెనీల నుండి జీసీసీ పద్దతిలోనే ఆర్టీసీ తీసుకుంది. జేబీఎం కంపెనీ నుండి బస్సులకు కిలోమీటరుకు ఇపుడు రు. 57.90 రూపాయలు చెల్లిస్తోంది. డ్రైవర్లను కూడా కంపనీయే సమకూరుస్తుంది కాబట్టి అద్దె కిలోమీటరుకు 60 రూపాయలకు పెరిగే అవకాశముంది. మహిళకు ప్రయాణం పూర్తిగా ఉచితం కాబట్టి బస్సుల్లో ఓఆర్(ఆక్యుపెన్సీ రేషియో) వందశాతంగా ఉంది. బస్సుల నిర్వహణ ఖర్చు+కండక్టర్ల ఖర్చు కలిపితే 78 రూపాయలయ్యే అవకాశముంది. ఇపుడు బస్సుల ఆదాయం కిలోమీటరుకు రు. 90 వస్తోంది. అంటే ఆదాయం 90 రూపాయల్లో నుండి ఖర్చులు 78 రూపాయలను తీసేస్తే మిగిలే నికర ఆదాయం 12 రూపాయలు. కిలోమీటరుకు ఆర్టీసీకి రు. 12 నికర ఆదాయం వస్తుందంటే బాగానే ఉన్నట్లు లెక్క. ఇదంతా ఎప్పుడంటే ఆర్టీసీకి మహిళల ఉచిత బస్సు ప్రయాణం తాలూకు రీఎంబర్స్ మెంటు చేసినపుడే.

సిటీలో అవసరమైన 2700 బస్సులను ఏడాదిన్నరలో సమకూర్చుకోవాలని ఆర్టీసీ డిసైడ్ చేసింది. బస్సుల సరఫరా, నిర్వహణ విషయాన్ని మూడు ఉత్పత్తి కంపెనీలతో చర్చలు జరుపుతున్నది. ఎలక్ట్రిక్ బస్సుల్లో అతిపెద్ద సవాలు ఏమిటంటే బ్యాటర్ లైఫే. బ్యాటరీలను జాగ్రత్తగా నిర్వహిస్తే ఎక్కువకాలం బాగా పనిచేస్తాయి. బ్యాటరీ లైఫ్ బాగుంటే చాలు బస్సుల నిర్వహణలో పెద్ద సమస్యలుండవు. అందుకనే ఈ విషయంపై ఆర్టీసీ ఉన్నతాధికారులు ఎక్కువ దృష్టి పెట్టడమే కాకుండా ఇదే విషయాన్ని ఉత్పత్తి కంపెనీలతో మాట్లాడుతున్నారు. బస్సుల కొనుగోలు సంఖ్యను బట్టి నిర్వహణ కాంట్రాక్టును కంపెనీలతో చేసుకోవాలని ఆర్టీసీ అధికారులు ప్లాన్ చేస్తున్నారు. అందుకనే అనుకున్నది అనుకున్నట్లు జరిగితే మరో ఏడాదిన్నరలో సిటీలో అన్నీ ఎలక్ట్రిక్ బస్సులే తిరుగుతుంటాయి.

Read More
Next Story