ప్రభుత్వ పథకాలు.. సరిగా అమలు చేస్తే గెలుపు.. లేకపోతే..
x

ప్రభుత్వ పథకాలు.. సరిగా అమలు చేస్తే గెలుపు.. లేకపోతే..

పథకాల అమలులో చిన్న లోపం జరిగినా మొదటికే మోసం


ఆధునిక రాజ్యాలు సంక్షేమ పథకాలకు పెట్టింది పేరు. ప్రజాసంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తూ ప్రజల్లో తమ పేరు శాశ్వతంగా నిలబెట్టుకోవడానికి నాయకులు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ఆరు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ ట్రెండ్ కు నాంది పలికారు.

ప్రజా సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ మహానాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. తరువాత ఆయన కుమారుడు వైఎస్ జగన్ ఆయన పేరు ఉపయోగించుకుని పార్టీ పెట్టి ఐదు సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా, తరువాత సీఎంగా పనిచేశారు.

అయితే గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ పథకాలకు అనుకున్న దానికన్నా ఎక్కువ ప్రచారం.. సరిగ్గా చెప్పాలంటే ‘‘ చారాన కోడికి, బారానా మసాలా’’ అన్న చందంగా జరుగుతుండటంతో ప్రజల నోళ్లలో నానుతున్నాయి. ఇదే సమయంలో ఏదైనా పథకం అమలు చేయడంలో ప్రభుత్వ యంత్రాంగం విఫలమైతే, పేరు వచ్చే సంగతి పక్కన పెడితే అవే అధికారంలో ఉన్నవారిని ఓడించే అస్త్రాలుగా మారుతున్నాయి. ఇది మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికలతో పాటు, అంతకుముందు జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ స్పష్టంగా కనిపించింది.
కాంగ్రెస్ ముందుందా.... అసలు పండగ?
గత ప్రభుత్వం చేస్తున్న తప్పులను ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోంది. ప్రతి పనికి విపరీతమైన ప్రచారం చేసుకోవడానికి ప్రాధాన్యం ఇస్తోంది. ఆడంబరంగా దరఖాస్తులు తీసుకోవడం మొదలు పెట్టిన సంవత్సరం తరువాత దానిపై మెల్లగా ప్రజావ్యతిరేకత ప్రారంభమైంది.
నిజానికి ఆ పార్టీ అధికారంలోకి వచ్చి కేవలం 14 నెలలే అయింది. ఏ మూడో ఏడు పాలనలో రావాల్సిన వ్యతిరేకత ఆలోచన.. ఇప్పుడే రావడానికి కారణం, ఆ పార్టీ అనుసరిస్తున్న విపరీతమైన ప్రచారమే అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్లను నియోజక వర్గానికి కోటా ప్రకారం విడుదల చేస్తామనడంతో ప్రతి ఊరుకు ఏడు, ఎమినిది మించి రావు. కానీ దరఖాస్తులు ప్రతి గ్రామంలోనూ మొదటి ఫేజ్ లోనే వంద పైనే ఉంటున్నాయి.
ఇక్కడ కూడా ఒకరికి ఇచ్చి.. మరోకరికి ఇవ్వకపోతే మిగిలిన దరఖాస్తుదారులు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసే ప్రమాదం ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ ఓ అదృష్టం ఉంది. ఈ పథకం కేవలం ఏ ఒక్క వర్గానికో లక్ష్యంగా చేసుకుని ఇవ్వకపోవడం వల్ల మిగిలిన కులాల నుంచి వ్యతిరేకత రాదు.
అలాగే ఇంతకుముందు ఇళ్లు తీసుకున్న వారి జాబితా ప్రభుత్వం దగ్గర ఉంది. కావునా తిరిగి దరఖాస్తు చేసుకున్న వారికి నచ్చ చెప్పే అవకాశం ఉంది. అలాగే ఇళ్ల నిర్మాణం చేసుకునే వారికి ఎంతోకొంత డబ్బులు ఉన్నప్పుడే మొదలు పెడతారు. లిస్ట్ లో పేరు ఉండి ఇందిరమ్మ ఇళ్లు ఉంటే తమకు సాయం వచ్చిందని సంబరపడతారు. ఇది కాంగ్రెస్ కు ప్లస్ పాయింట్.
మిగిలిన పథకాల విషయంలో..
పింఛన్లు, రైతు భరోసా, రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ పార్టీ గట్టిగానే ఎదురుదెబ్బలు తగిలాయి. చాలా చోట్ల 2 లక్షల ఏకమొత్తంలో రుణమాఫీ కాలేదు. దీనికి కారణం ఒక్కటే.. తమ అప్పు 2 లక్షల కంటే ఎక్కువ మొత్తంలో ఉందనే అధికార పార్టీ ఎగ్గొంట్టిదని రైతులు ఆగ్రహంతో ఉన్నారు.
అలాగే బోనస్, రైతు భరోసా చెప్పినదానికంటే తగ్గించినా, ఇప్పటికి ఇవ్వకపోవడంతో కూడా పార్టీపై వ్యతిరేకత ప్రారంభమైందని చెప్పాలి. కేవలం రెండు రోజుల వ్యవధిలో సీఎం రెండు మాటలు చెప్పడం కూడా ప్రభుత్వానికి మైనస్ గా మారింది.
అంతకుముందు కేసీఆర్ చెప్పిన సమయానికి రైతు బంధు ఇచ్చేవారు. ఇప్పుడది రాకపోవడంతో దీనికి కారణం కాంగ్రెస్ అనే మాటలు మెల్లగా ప్రారంభమయ్యాయి. కాకపోతే ప్రభుత్వానికి మరో నాలుగు సంవత్సరాల సమయం ఉంది. ఆలోగా చేసిన తప్పులను సరిదిద్దుకుంటారా? చూడాలి.
బీఆర్ఎస్ కొంపముంచిన పథకాలు..
బీఆర్ఎస్ అధికారం నుంచి దిగిపోవడానికి కొన్ని ప్రభుత్వం పథకాలు కీలక పాత్ర పోషించాయి. వీటిలో అన్నిటికంటే ముందున్నది దళితబంధు. ఈ పథకాన్ని తమ ‘గేమ్ ఛేంజర్’ గా గులాబీ పార్టీ అధినేత అనేక సభల్లో వెల్లడించారు. తమకు శాశ్వతంగా దళిత ఓటు బ్యాంకు సమకూరుతుందని పార్టీ కింది స్థాయి నాయకత్వం కూడా సంబరపడింది.
అయితే పథకం అమలు జరుగుతున్న తీరుతో పార్టీపై తీవ్ర వ్యతిరేకత ప్రబలింది. ముఖ్యంగా దళితబంధుకు సంబంధించి కేవలం పార్టీ కార్యకర్తల పేర్లను పరిగణలోకి తీసుకోవడం, ఊరిలో పది మందికే అవకాశం ఉండటంతో మిగిలిన దళితులకు ఆగ్రహం తెప్పించింది.
అంతకుముందున్న ప్రభుత్వ పథకాల్లా కాకుండా పదిలక్షల రూపాయలు ఏకమొత్తంలో లబ్ధిదారులకు రావడం, ఒక పైసా కూడా పెట్టుబడి లేకపోవడంతో అంతా ఎగబడ్డారు. నాయకులు తమ పేరు రాయకపోవడం, ఎన్నికల వరకూ తిప్పించుకోవడంతో బీఆర్ఎస్ పార్టీకి లాభం కంటే ఎక్కువగా నష్టం జరిగింది.
చివరకు ఆ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేయడానికి దారి తీసింది. దళితబంధు కేవలం దళితుల్లోనే కాకుండా ఇతర వర్గాల ప్రజల్లోనూ ఒకరకమైన వ్యతిరేకత ప్రబలడానికి కారణమైంది. కొన్ని కులాల వాళ్లు మాకు కూడా దళితబంధు లాంటి పథకాన్ని ప్రవేశపెట్టాలని బహిరంగంగా సమావేశాలు నిర్వహించి, ప్రభుత్వాన్ని డిమాండ్ చేసే స్థాయికి వచ్చారు. ఈ విషయాన్ని కేసీఆర్ పసిగట్టే సమయానికే పరిస్థితి చేయి దాటిపోయింది.
కాళేశ్వరం ప్రాజెక్ట్..
తెలంగాణ వ్యవసాయరంగ స్వరూపాన్ని పూర్తిగా మార్చే పథకంగా ‘కాళేశ్వరం’ ప్రాజెక్ట్ పై ప్రచారం జరిగింది. పునాది రాయి నుంచి మొదలు, రోజువారీగా జరుగుతున్న పనులు, బాహుబలి పంపులు, బ్యారేజ్ లు, సొరంగాల నిర్మాణంపై టన్నుల కొద్ది వార్తలు వచ్చేవి.
తరువాత కేసీఆర్ తను చేస్తున్న పని గురించి ప్రచారం చేసుకోవాలని నిర్ణయించుకని .. ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేసి ప్రజలను కాళేశ్వరం ప్రాజెక్ట్ సందర్శనకు తీసుకొచ్చారు. ఈ విషయానికి సంబంధించి అప్పట్లో కాళేశ్వరం ప్రాజెక్ట్ సందర్శించిన వ్యక్తులు గ్రామాలల్లో మాట్లాడుకుంటూ ‘‘ అబ్బో అది చాలా పెద్దది... ఏటు చూసిన గంగే( గోదావరి)... పెద్ద కట్ట.. పేద్దపేద్ద మోటార్లు.. అసలు దునియాలో ఎవని తరం కాదు ఇసొంటివి కట్టుడు’’ అని చెప్పుకునే వారు.
కానీ సరిగ్గా ఎన్నికల ప్రచారం ప్రారంభం కాగానే కాళేశ్వరం ప్రాజెక్ట్ కు సంబంధించి మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయింది. ఇది కాంగ్రెస్ పార్టీకి పెద్ద ప్లస్ పాయింట్ గా మారింది. ప్రచారంలో లక్ష కోట్ల అవినీతి జరిగిందని రాహుల్ గాంధీ మొదలు గల్లీ స్థాయి లీడర్ల వరకూ ప్రచారం చేశారు. అప్పటికే ఈ విషయం ప్రజల్లో పాజిటివ్ కాస్త.. ఈ ప్రచారంతో నెగటివ్ గా మారింది.
ఉద్యోగ నోటిఫికేషన్లు..
ఎన్నికలకు ఏడాది ముందు కేసీఆర్ సర్కార్ వరుసగా అన్ని గ్రూప్ ఉద్యోగాల నోటిఫికేషన్లను విడుదల చేయించింది. తమ ప్రభుత్వ హయాంలో వేలాది ఉద్యోగాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ప్రచారం చేసుకున్నారు. అయితే సడన్ గా పేపర్ లీక్ లు, ఉద్యోగ పరీక్షలు తరుచుగా వాయిదా పడటంతో బీఆర్ఎస్ కు దిక్కు తోచలేదు.
యువత నుంచి వ్యతిరేకత రావడంతో ఎలా ఢిపెండ్ చేసుకోవాలో అర్థం కాలేదు. ఈ విషయాన్ని కూడా విపక్ష కాంగ్రెస్ తన ప్రచారం అంశంగా మార్చుకుంది. రేవంత్ రెడ్డి అయితే తన కుటుంబానికి ఉద్యోగాలు ఇప్పించుకుని, తెలంగాణ యువతను నిరుద్యోగులుగా మార్చాడని దుమ్మెత్తి పోశాడు. ఆయన మాటలనే జనం విశ్వసించి అధికారం కట్టబెట్టారు.
మిగిలిన ప్రాంతాల్లో ..
మహారాష్ట్రలో మహాయుతి ప్రభుత్వం తిరిగి రావడానికి ‘లాడ్లీ బెహనా’ పథకం ఎంతో ఉపయోగపడింది. కేవలం ఆరు నెలల ముందు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలిన తరువాత బెహాన పథకంతో తిరిగి అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ఢిల్లీలోనూ ఇలాగే ఆప్ సర్కార్ ఉచిత పథకాలతో ప్రజలను తన వైపు తిప్పుకోవడానికి ప్రయత్నం చేస్తోంది.
అయితే తాను అవినీతి వ్యతిరేక పార్టీ అని మొదట్లో సామాన్యుల మెదడ్లలో గూడు కట్టేలా చేసుకున్న ప్రచారం చేసుకున్న కేజ్రీవాల్ తరువాత లిక్కర్ స్కామ్ లో ఇరుక్కోవడంతో ఆ పార్టీకి ఉన్న మైలేజ్ దాదాపుగా పోయినట్లు కనిపిస్తోంది. ఢిల్లీ అసెంబ్లీలో అనేకమంది అభ్యర్థులు తమ స్థానాలను మార్చుకోవడానికి ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు ఆ పార్టీ ఎన్నికల్లో ఎదురీదుతోంది.
ఇక ఏపీ సీఎం చంద్రబాబు విషయానికి వస్తే.. ప్రతి పనిని ప్రచారం చేసుకోవడంలో ముందుంటారు. అయితే మొన్న జరిగిన దావోస్ పర్యటనలో ఏపీతో ఏ ఒక్క సంస్థ ఎంఓయూ కుదుర్చుకోకపోవడంతో ఆయనపై సోషల్ మీడియాలో విపరీతంగా నెగటివ్ ప్రచారం జరుగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో దావోస్ పర్యటనను బాగా హైలైట్ చేసిందే చంద్రబాబు అండ్ కోనే. ఇప్పుడు సడన్ గా ఏ ఒక్క సంస్థ తో ఎంఓయూ కుదరకపోవడంతో వైసీపీకి సోషల్ మీడియా విభాగానికికు చేతినిండా పని దొరికింది. ఈ విషయాన్ని డిఫెండ్ చేసుకోలేక టీడీపీ ఆస్థాన మీడియా అపసోపాలు పడుతూ నవ్వుల పాలవుతోంది.
హద్దులు దాటిన ప్రచారం
ఒకప్పుడూ చేసిన పనికి ప్రచారం ఉండేది, మెల్లగా పనికంటే ప్రచారం ఎక్కువ కావడంతో , ప్రజలు వాటిని శ్రద్దగా గమనిస్తున్నారు. ‘‘ పథకం అమలులో ఏదైన చిన్న వైఫల్యం ఎదురైనా అది ప్రతిపక్షానికి ఆయుధంగా మారుతోంది’’ అని ఓ మాజీ ప్రొఫెసర్ ఫెడరల్ తో చెప్పారు.
‘‘ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా ఈ - ఫార్మూలా కార్ రేసింగ్ కేసులో ఇదే తరహ ఇబ్బందిని ఎదుర్కోబోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఇందులో కోట్లాది రూపాయల అవినీతి జరిగిందని ప్రచారం చేసిన ప్రభుత్వం, దానికి తగినట్లుగానే విచారణ కొనసాగించింది. కానీ కేటీఆర్ ను ఇందులో దోషిగా నిరూపించకపోతే.. కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ నాయకులపై పెట్టిన అన్ని కేసులపై ప్రభావం పడుతుంది’’ అని ఆయన అభిప్రాయపడ్డారు.
కేవలం గులాబీ నాయకులను ఇబ్బంది పెట్టడానికే ఇలా కేసులు పెట్టారనే సందేశం ప్రజల్లోకి వెళ్తుంది. ఇది కాంగ్రెస్ పార్టీకే తిరిగి బూమరాంగ్ అయ్యే అవకాశం ఉంటుందన్నారు.
Read More
Next Story