కల్తీపై తెలంగాణ కర్ణుడి బాణం
x
ఐఎఎస్ అధికారి ఆర్వీ కర్ణన్

కల్తీపై తెలంగాణ కర్ణుడి బాణం

తెలంగాణరాష్ట్రంలో ఆహార కల్తీరాయుళ్లు సీనియర్ ఐఎఎస్ అధికారి ఆర్వీ కర్ణన్ పేరు వింటేనే హడలిపోతున్నారు.ఫుడ్‌సేఫ్టీ కమిషనరుగా వచ్చాక హోటళ్లలో తనిఖీలు చేస్తున్నారు.


నీతి, నిజాయితీతోపాటు నిక్కచ్చి అధికారిగా పేరొందిన కర్ణన్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఫుడ్ సేఫ్టీ కమిషనరుగా నియమించింది. అంతే ఆర్వీ కర్ణన్ ఫుడ్ సేఫ్టీ కమిషనరుగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఫుడ్ సేఫ్టీ విభాగం ఇన్‌స్పెక్టర్లతో ప్రత్యేకంగా టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేశారు.

- టాస్క్ ఫోర్స్ విభాగాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ అధికారుల బృందాలను హోటళ్లు, బేకరీలు, హాస్టళ్లు, రెస్టారెంట్లు, సూపర్ బజార్లు...ఇలా ఒకటేమిటి అన్ని హోటళ్లలో ఆకస్మిక తనిఖీలు చేపిస్తూ హడలెత్తిస్తున్నారు.
ఫిర్యాదులపై సత్వర స్పందన
వినియోగదారుల నుంచి ఫిర్యాదులు రాగానే సత్వరం స్పందించి ఫుడ్ సేఫ్టీ అధికారులతో ఆకస్మిక తనిఖీలు చేపిస్తూ కల్తీ అని తేలితే వారికి నోటీసులు జారీ చేపిస్తున్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులను ఉదయం సిద్ధంగా ఉండమని ఆదేశాలిచ్చి, వారు రాగానే ఏ ప్రాంతానికి వెళ్లాలి? ఏ రెస్టారెంట్లో తనిఖీలు చేయాలనే విషయాన్ని అత్యంత పకడ్బందీగా చెప్పి చేపిస్తున్నారు.టెలీ కాన్ఫరెన్స్ లేదా మెసేజు ద్వారా ఏ హోటల్ లో తనిఖీలు చేయాలనేది కమిషనర్ కర్ణన్ ఆదేశాలు జారీ చేస్తున్నారు.హోటళ్లు, హాస్టళ్లు అపరిశుభ్రంగా ఉన్నా, కల్లీ పదార్థాలు వాడుతున్నారని తేలినా వారిపై కమిషనర్ కొరఠా ఝళిపిస్తున్నారు.

ఆహార కల్తీకి పాల్పడితే నోటీసులు
కల్తీ ఆహార పదార్థాలు వాడిని 50 మంది హోటళ్లకు నోటీసులు జారీ చేశామని హైదరాబాద్ నగర ఫుడ్ సేఫ్టీ విభాగం హెడ్ కె. బాలాజీరాజు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. ప్యారడైజ్ , పిస్తాహౌస్, షాగోస్, ఎమరాల్డ్ స్వీట్ షాప్... ఇలా ఒకటేమిటీ ఎంతటి పెద్ద హోటళ్లు అయినా ఆకస్మిక తనిఖీలు చేపిస్తూ యజమానులను హడలెత్తిస్తున్నారు.ఏప్రిల్ 16వతేదీ నుంచి వరుస తనిఖీలు చేపిస్తున్నారు.232 హోటళ్లు, హాస్టళ్లకు పైగా తనిఖీలు చేయించారు. వారం వారం సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ కల్తీ లేని ఆహారాన్ని ప్రజలకు అందించడమే లక్ష్యంగా తాము హోటళ్లు, హాస్టళ్లలో వరుస తనిఖీలు చేస్తున్నామని బాలాజీరాజు వివరించారు.

కిచెన్ లో తనిఖీలు చేస్తున్న ఫుడ్ సేఫ్టీ అధికారులు

తమిళనాడు నుంచి తెలంగాణకు...
తమిళనాడు రాష్ట్రంలోని శివగంగా జిల్లా కరైకుడి శ్రీరామనగర్ ప్రాంతానికి చెందిన ఆర్వీ కర్ణన్ 2007 వ సంవత్సరంలో రాసిన ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ పరీక్షల్లో దేశంలోనే నంబర్ వన్ గా నిలిచారు. ఐఎఫ్ఎస్ అధికారిగా అయిదేళ్లు మహారాష్ట్రలో పనిచేశారు. అనంతరం 2012 వ సంవత్సరంలో ఈయన యూపీఎస్సీ సివిల్స్ పరీక్షల్లో 158వ ర్యాంకు సాధించి ఐఎఎస్ అధికారిగా తెలంగాణ రాష్ట్రానికి వచ్చారు.

ఉట్నూరు ఐటీడీఏ ప్రాజెక్టు డైరెక్టరుగా వినూత్న సేవలు
ఆర్వీ కర్ణన్ ఉట్నూరు ఐటీడీఏ ప్రాజెక్టు డైరెక్టరుగా ఫస్ట్ పోస్టింగ్ పొందారు. గిరిజన దివ్యాంగ పిల్లల కోసం ఉట్నూరులో ప్రత్యేకంగా కర్ణన్ వికాసబడిని ప్రారంభించారు. గిరిజునుల సంక్షేమానికి ఉద్ధేశించిన పథకాల అమలును ఈయన వేగిరం చేసి పాలనలో తనదైన ముద్ర వేశారు. అనంతరం మంచిర్యాల జిల్లా కలెక్టరుగా పనిచేశారు.తర్వాత ఖమ్మం, కరీంనగర్, నల్గొండ జిల్లాల కలెక్టరుగా సేవలందించారు. ఆ తర్వాత హైదరాబాద్ కు బదిలీపై వచ్చిన కర్ణన్ కు సమర్ధ అధికారిగా పేరుండటంతో అదనంగా ఫుడ్ సేఫ్టీ కమిషనరుగా ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది.

ఆహార కల్తీపై ఫిర్యాదులకు ట్విట్టరు ఖాతా
తెలంగాణ రాష్ట్రంలో ఆహార కల్తీ ఫిర్యాదులను స్వీకరించేందుకు ఎక్స్ ఖాతాను ఈ ఏడాది మార్చి నెలలో ప్రారంభించారు. ఎంతటి పెద్ద వారి హోటల్ అయినా ఆకస్మిక తనిఖీలు చేపిస్తూ ముందుకు సాగుతున్నారు. ఏమైనా ఒత్తిళ్లు వచ్చినా వాటిని పట్టించుకోకుండా ప్రభుత్వ నిబంధనల ప్రకారం కమిషనర్ ఆర్వీ కర్ణన్ చర్యలు తీసుకుంటున్నారు.

వైద్యఆరోగ్యశాఖ మంత్రి సైతం మద్ధతు
హోటళ్లలో కల్తీ ఆహార పదార్థాల వినియోగంపై చర్యలు తీసుకుంటున్న ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ కు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ కూడా మద్ధతుగా నిలుస్తున్నారు. ఇటీవల ఫుడ్ సేఫ్టీ అధికారుల సమావేశాన్ని మంత్రి నిర్వహించి వరుస ఆకస్మిక తనిఖీలతో కల్తీకి తెర వేయాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు.

ప్రభుత్వ హాస్టళ్లలోనూ ఆకస్మిక తనిఖీలు
గత రెండు వారాలుగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లలో ఆకస్మిక తనిఖీలు కొనసాగుతున్నాయి. కిచెన్ ఏరియాలో అనుసరించాల్సిన ప్రోటోకాల్, పరిశుభ్ర పద్ధతులపై వంట సిబ్బందికి ఫుడ్ సేఫ్టీ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు.హాస్టళ్లలో అపరిశుభ్ర పరిస్థితులున్నా, కల్లీ ఆహార పదార్థాలను వాడినా ఎఫ్ఎస్ఎస్ చట్టం 2006 రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ 2011కి అనుగుణంగా చర్యలు తీసుకుంటామని ఆర్వీ కర్ణన్ చెప్పారు.

కిచెన్ రూంలో బొద్దింకలు కనిపిస్తే...
హోటళ్లలో చెల్లుబాటు అయ్యే లైసెన్స్,రిజిస్ట్రేషన్ లేకుండా వ్యాపారాన్ని నిర్వహించినా, విచారణలో గడువు ముగిసిన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఉన్నా చర్యలు తీసుకుంటున్నారు. వంటగది ప్రాంగణంలో బొద్దింకలు కన్పించినా చర్యలు తప్పనిసరి. సరిగ్గా లేబుల్ చేయని పదార్థాలను వాడినా, డస్ట్‌బిన్‌లను మూతలు లేకుండా తెరిచి ఉంచినా చర్యలు తీసుకుంటున్నారు. ఫుడ్ హ్యాండ్లర్‌లకు మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు అందుబాటులో ఉండాలని, హోటల్ ప్రాంగణంలో పెస్ట్ కంట్రోల్ రికార్డులు అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు.


కల్తీ లేని ఆహారాన్నిప్రజలకు అందించడమే నా లక్ష్యం
తెలంగాణలో హైదరాబాద్ నగరంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా కల్తీ లేని ఆహారాన్నిప్రజలకు అందించడమే తన లక్ష్యమని తెలంగాణ ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. ఫుడ్ సేఫ్టీ అధికారులతో నిత్యం ఆకస్మిక తనిఖీలు చేపిస్తూ ఆహార కల్తీ, అపరిశుభ్ర పరిస్థితులపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని కర్ణన్ పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ సంబంధిత ఫిర్యాదులను 91001 05795 ఫోన్ నంబరుకు ఫిర్యాదు చేయవచ్చని ఆయన తెలిపారు. హైదరాబాద్ నగరంలో అయితే 040-21111111 ఫోన్ నంబరుకు ఫిర్యాదు చేయాలని ఆయన కోరారు.





Read More
Next Story