రైతు రుణమాఫీ టైంపాస్‌లా మారింది.. కాంగ్రెస్ సర్కార్‌పై బండి గుర్రు
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన రైతుల రుణమాఫీ ప్రక్రియపై కేంద్రమంత్రి బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన రైతుల రుణమాఫీ ప్రక్రియపై కేంద్రమంత్రి బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వానికి రైతురుణమాఫీ అంటే టైంపాస్ విషయంలా మారిందంటూ విమర్శలు గుప్పించారు. ప్రతి రైతుకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని ఎన్నికల సమయంలో గుండెలు బాదుకుని చెప్పిన కాంగ్రెస్ నాయకులు ఇప్పుడెందుకు మాట్లాడట్లేదని ప్రశ్నించారు. అధికారం వచ్చి ఏడాది కావొస్తున్నా ఇప్పటికీ రైతు రుణమాఫీని ఎందుకు పూర్తి చేయలేని, నామమాత్రంగా కొందరికి రుణమాఫీ చేసి చేతులు దులుపుకుందామనుకుంటే ఎలా అని నిలదీశారు.
ప్రతి రైతుకు రుణమాఫీ చేసే వరకు రైతుల పక్షాన బీజేపీ కొట్లాడుతుందని, రైతుల సంక్షేమమే బీజేపీకి ముఖ్యమని అన్నారాయన. అంతేకాకుండా మాజీ సర్పంచ్‌ల పెండింగ్ బిల్లులు, వాళ్ల అరెస్ట్‌ల వ్యవహారంపై కూడా ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజల పరిస్థితి మరింత దయనీయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.
అదే విధంగా రైతుల దగ్గర నుంచి ధాన్యం కొనుగోలును వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ కూడా తుస్సే అని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి రోజూ నిరూపించుకుంటోందని, వంద రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పి హామీల్లో ఒక్కటయినా పూర్తిగా అమలయిందా అని విమర్శించారు.
యుద్ధం చేయాల్సింది మోదీపై కాదు..
‘‘కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీలో ఉన్న మోదీపై చేయడం కాదు. తెలంగాణ రైతులకు చెప్పిన రుణమాఫీ, రైతు భరోసాను యుద్ధప్రాతిపదికన అందించాలి. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ టైం పాస్‌లా మారిపోయింది. ఇక రాష్ట్రంలో కుల గణన చేస్తామని, ఎవరు వద్దన్నా జరిగుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అంటున్నారు. మేము కుల గణననకు వ్యతిరేకంగా కాదు. కాకపోతే కుల గణనను అత్యంత పారదర్శకంగా నిర్వహించాలనే డిమాండ్ చేస్తున్నాం. అలా కాకుండా ఏదో చేస్తాం.. మేము చెప్పింది నమ్మాలంటే మాత్రం ఊరుకునేది లేదు. ప్రజల పక్షాన పోరాటం చేయడానికి బీజేపీ ఎప్పుడూ భయపడలేదు. భయపడదు కూడా’’ అని అన్నారు.
తెలంగాణకు రూ.7వేల కోట్లు
‘‘అమృత్ స్కీం ద్వారా దేశవ్యాప్తంగా అభివృద్ధి పరుగులు పెడుతోంది. ఈ స్కీం కింద తెలంగాణకు రూ.7000 వేల కోట్ల నిధులు కేటాయించింది కేంద్రం. పార్టీలకు అతీతంగా అందరం కలిసి నగర అభివృద్ధికి కృషి చేద్దాం. అమృత్ స్కీం ద్వారా రూ.2,99,000 కేటాయించడం అంటే మాటలు కాదు. ఇలాంటి వాటిని మన పగలు-ప్రతీకారాలు, పట్టింపులతో అడవి కాచిన వెన్నెలలా మార్చొద్దు. ఒకరికొకరం సహకరించుకుందాం. అదే విధంగా టెంపుల్ టూరిజం కింద వేములవాడ, ఇల్లంతకుంటను అభివృద్ధి చేస్తాం. కరీంనగర్‌లో టీటీడీ కట్టడానికి నా వంతు కృషి చేస్తా’’ అని తెలిపారు.
కాంగ్రెస్‌ది అంతా దుష్ప్రచారమే..
‘‘అధికారంలోకి వచ్చిన అతి తక్కువ సమయంలో ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న పార్టీ కాంగ్రెస్. ఎన్నికల సమయంలో సీఎం రేవంత్ ఇచ్చిన హామీలకు రాష్ట్రం విలువ లేదు. దక్షిణాదికి కేంద్రం అన్యాయం చేస్తుందంటూ కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోంది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మీడియా ప్రచారం తప్ప చేసిందేమీ లేదు. ఒక ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పరిస్థితి చచ్చిన పాములా తయారైంది. బీఆర్ఎస్‌లో క్యాడర్ లేదు. కొందరు బీఆర్ఎస్ నాయకులు అవకాశవాద రాజకీయాలు చేస్తూ ఎటు లాభం ఒరిగితే అటు జంప్ అవుతున్నారు’’ అని ఫిరాయంపులపై స్పందించారు.
వచ్చేది బీజేపీ ప్రభుత్వమే
‘‘తెలంగాణలో 2028లో జరిగే ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించనుంది. ఆ ఎన్నికల్తో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడి ప్రజలకు సుభిక్ష పాలనను అందిస్తుంది. ఆదాయం కోసం కాకుండా ఆలయాల్లో ప్రజలకు సేవలందిస్తాం. హిందూ ధర్మం, ప్రజల ఆలోచనలకు అనుగుణంగా అభివృద్ధి చేస్తాం. దేశాభివృద్ధి కోసం తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలి’’ అని తెలిపారు. అనంతరం మాజీ సర్పంచ్‌ల బిల్లులు, వారి అరెస్ట్‌ల వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ సర్పంచ్‌లను అరెస్ట్‌లు చేయడం అన్యాయమని ఆందోళన వ్యక్తం చేశారు.
మాజీ సర్పంచ్‌లకు న్యాయం జరగాలి
‘‘బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల వల్లే సర్పంచ్‌లు అప్పుల పాలయ్యారు. ప్రభుత్వం ఇవాళ కాకుంటే రేపైనా బిల్లులు ఇస్తుందన్న నమ్మకం అప్పులు తెచ్చి పనులు చేస్తే.. బిల్లులు కట్టడానికి నిరాకరించడం దారుణం. దుర్మార్గం. అధికారంలోకి రాగానే పెండింగ్ బిల్లులన్నీ చెల్లిస్తామని చెప్పిన కాంగ్రెస్.. అధికారం వచ్చి 11 నెలలు అయినా ఎందుకు బిల్లులను క్లోజ్ చేయలేదని ప్రశ్నించారు. ఏడాది కాలంగా పెండింగ్‌లో ఉన్న బిల్లులను ముందుగా చెల్లించాలని కోరినా ఆ బిల్లులను చెల్లించకపోవడం సిగ్గుచేటు. సర్పంచ్‌ల సమస్యలను పరిష్కరించకుండా వారిని పోలీసుల చేత అరెస్ట్ చేయించడం దుర్మార్గం. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు మాజీ సర్పంచ్‌ల కుటుంబాల ఉసురు తగలడం ఖాయం. అరెస్ట్ చేసిన మాజీ సర్పంచ్‌లను వెంటనే విడుదల చేయాలి’’ అని బండి డిమాండ్ చేశారు.