
బీసీ రిజర్వేషన్ల కోసం ఈశ్వరాచారి ఆత్మాహుతి
తెలంగాణ కోసం శ్రీకాంత చారి.. బీసీ రిజర్వేషన్లల కోసం సాయి ఈశ్వరాచారి.
తెలంగాణలో మరోసారి బలిదానాలు మొదలయ్యాయా? అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ప్రత్యేక తెలంగాణ సాధన కోసం శ్రీకాంతాచారి మొదలుకొని ఎందరో ప్రాణ త్యాగాలు చేశారు. ప్రత్యేక తెలంగాణ సాధన తర్వాత అటువంటి దుస్థితి మళ్ళీ తెలంగాణలో కనబడదనుకున్నారు. కానీ ఇప్పుడు హఠాత్తుగా బీసీ రిజర్వేషన్ల డిమాండుతో సాయి ఈశ్వరాచారి ఆత్మహత్య చేసుకోవటం సంచలనంగా మారింది. ‘తెలంగాణ కోసం శ్రీకాంతచారి..బీసీ రిజర్వేషన్ల కోసం ఈశ్వరాచారి’ అని నినదించి ఆత్మాహుతికి పాల్పడటం కలకలం రేపుతోంది. చారి బలిదానంతో బీసీ సంఘాల నేతలు, సామాజికవర్గాలు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై భగ్గుమంటున్నాయి.
గురువారం సాయంత్రం చారి ఎంఎల్సీ, తెలంగాణ రాజ్యాధికారపార్టీ అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న ఆఫీసుకు వచ్చాడు. మల్లన్నతో మాట్లాడుదామని అనుకున్నాడు. అయితే ఎంఎల్సీ ఔటాఫ్ సిటి అని అక్కడి సిబ్బంది చెప్పటంతో వెళ్ళిపోయాడు. మళ్ళీ కాసేపు అయిన తర్వాత మల్లన్న ఆఫీసు ముందు రోడ్డుపైన నిలబడి వెంటతెచ్చుకున్న పెట్రోలును ఒంటిపైన పోసుకుని నిప్పటించుకున్నాడు. దాన్ని గమనించిన కొందరు వెంటనే మంటలను ఆర్పేందుకు ప్రయత్నించటమే కాకుండా అంబులెన్సును పిలిపించారు. అంబులెన్స్ వచ్చేటప్పటికే చారికి బాగా మంటలు అంటుకున్నాయి. అంబులెన్స్ రాగానే చారిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న చారి శుక్రవారం మధ్యాహ్నం మరణించాడు.
రిజర్వేషన్ల విషయంలో బీసీలకు జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకికంగానే ఈశ్వరాచారి తన ప్రాణాలను అర్పించాడు. ఈశ్వరాచారి ఆత్మాహుతి ఘటన ప్రస్తుతం తెలంగాణలో తీవ్ర ఉద్రిక్తలకు దారితీస్తోంది. ఈశ్వరాచారిది ఆత్మహత్య కాదని, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన హత్య అని పలువురు బీసీ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు.
చారి బలిదానం గురించి తెలిసిన వెంటనే తీన్మార్ మల్లన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సుదగాని హరిశంకర్‌తో కలిసి ఆసుపత్రిలో గురువారం రాత్రే బాధితుడిని పరామర్శించారు. శుక్రవారం మధ్యాహ్నం ఈశ్వరాచారి మరణాన్ని అధికారికంగా ప్రకటించకుండా మృతదేహాన్ని పోలీసులు పోస్ట్ మార్టంకు తరలించే ప్రయత్నం చేశారు. డెత్ డిక్లరేషన్ చేసిన తరువాతే పోస్ట్ మార్టం చేయాలని మల్లన్న అడ్డుకోవటంతో ఆసుపత్రిలో ఉద్రిక్త పరిస్ధితులు ఏర్పడ్డాయి. చారి మరణవార్త వినగానే బీసీ సామాజికవర్గాల్లోని ప్రముఖులు, బీసీ సంఘాల నేతలు ఆసుపత్రికి చేరుకుంటున్నారు. ఈ నేపధ్యంలోనే తెలంగాణ ఉద్యమకారుడు పృథ్వీరాజ్ ఈశ్వరాచారిది ఆత్మహత్య కాదని, ప్రభుత్వం చేసిన హత్య అంటూ చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి.
ఈశ్వరాచారి కుటుంబసభ్యులను బీఆర్ఎస్ నేతలు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్ గాంధీ ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు.
రిజర్వేషన్ ఎవరు అడిగారు: తలసాని
ఈశ్వరాచారి కుటుంబసభ్యులను పరామర్శించిన అనంతరం ఆసుపత్రి బయట తలసాని మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. సాయిఈశ్వర్ కుటుంబానికి ప్రభుత్వం రూ. 50 లక్షల ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. ‘‘42 శాతం రిజర్వేషన్ మిమ్మల్ని ఎవరు అడిగారు’’. ‘‘42 శాతం రిజర్వేషన్ ఇస్తామని ఎన్నికల్లో హామీఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత మోసం చేసింది రేవంత్ సర్కార్’’ అని మండిపోయారు. ‘‘జనాభాలో సగభాగం ఉన్న బీసీలు ఏకమై ఈ ప్రభుత్వాన్ని గద్దెదింపుతాం, బీసీబిడ్డలు ఆవేశాలకుపోయి బలవన్మరణాలకు పాల్పడవద్దు’’ అని తలసాని కోరారు.
ఈశ్వర్‌ది కాంగ్రెస్ ప్రభుత్వ హత్యే: కేటీఆర్
సాయి ఈశ్వరాచారిది ముమ్మాటికీ రేవంత్ సర్కార్ చేసిన హత్యేనని బీఆర్ఎస్ వర్కింగె ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. బీసీ రిజర్వేషన్ల పేరిట సీఎం రేవంత్ చేసిన దారుణమైన మోసానికి శ్రీసాయి ఈశ్వర్ అనే యువకుడి నిండు ప్రాణం బలైందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్న హామీకి కాంగ్రెస్ సర్కారు తూట్లు పొడవడాన్ని తట్టుకోలేకే ఈశ్వర్ ఆత్మాహుతి చేసుకున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ‘‘పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు కేవలం 17 శాతానికే కుదించిన ముఖ్యమంత్రి రాష్ట్రంలోని వెనుకబడిన వర్గాలకు వెన్నుపోటు పొడిచారు. ఇది ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన హత్యే. సీఎం రేవంత్ తో పాటు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా సాయి ఈశ్వర్ మరణానికి బాధ్యత వహించాలి’’ అని డిమాండ్ చేశారు. కులగణనను మొదలుకుని న్యాయస్థానాల్లో నిలబడని జీవోల దాకా కాంగ్రెస్ ఏమాత్రం చిత్తశుద్ధి లేకుండా కామారెడ్డి డిక్లరేషన్ కు సమాధి కట్టిందని మండిపడ్డారు. బాధితుడి కుటుంబానికి ప్రభుత్వం రూ.50 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

