
‘మహిళల భద్రతకు పెద్దపీట’
శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో వెనకడుగు వేసేది లేదన్న సజ్జనార్.
హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా ఐపీఎస్ వీసీ సజ్జనార్.. మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా శాంతిభద్రతల విషయంలో రాజీ పడేది లేదని స్పష్టం చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎవరైనా ఉపేక్షించేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. అదే విధంగా మహిళల భ్రదతలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని వెల్లడించారు. డ్రగ్స్, సైబర్ మోసాలపై ఉక్కుపాదం మోపుతామని, మత్తు లోకం నుంచి యువతకు బయటకు తీసుకురావడానికి కొత్తకొత్త మార్గాలు అవలంభిస్తామని చెప్పారు. సైబర్ నేరాలు, డ్రగ్స్ వినియోగం అనేవి రోజురోజుకు అధికమవుతున్నాయని, వాటిని కట్టడిచేయడం కోసం మరింత కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. డ్రగ్స్ అనే మత్తు లోకానికి ఎక్కువగా యువతే బానిసలవుతున్నారని, వారిని ఆ మత్తు లోకం నుంచి బయటకు తీసుకురావడానికి అన్ని విధాలా ప్రయత్నిస్తామని అన్నారు. డ్రగ్స్‌ను కూకటివేళ్లతో పెకలించేలా వ్యూహాలు సిద్ధం చేస్తామన్నారు.
ప్రజలతోనే సాధ్యం..
ప్రజా సంక్షేమ పోలిసింగ్ అమలుకు తాను కృషి చేస్తానని సజ్జనార్ చెప్పారు. అయితే ఇది ప్రజల భాగస్వామ్యంతోనే సాధ్యమవుతుందని అన్నారు. ప్రతి పౌరుడు కూడా పోలీసుగా భావించి నేరాల గురించిన సమాచారాన్ని అందించాలని కోరారు. ఈ సందర్భంగానే పీపుల్ వెల్ఫేర్ పోలీసింగ్ కాన్సెప్ట్ కాస్తంత కొత్తగా ఉన్నా.. ఇది చాలా కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. ఈ కాన్సెప్ట్.. శాంతిభద్రత నిర్వహణతో పాటు ప్రజల సంక్షేమంపై కూడా దృష్టిపెడుతుందని, వారి ఆరోగ్యాన్ని కూడా కాపాడతామని తెలిపారు. డ్రగ్స్‌కు బానిసలైన యువత, వారి కుటుంబాలు నష్టపోకుండా డ్రగ్స్ దందాపై ఉక్కుపాదం మోపుతామని తేల్చి చెప్పారు. సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్ట్, స్టాక్ అడ్వైజర్ మోసాలు పెరిగాయని, ముఖ్యంగా పెన్షనర్లు, వృద్ధులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.