AlluArjun and Sandhya Theatre|పోలీసులపై ధియేటర్ యాజమాన్యం ఎదురుదాడి
x
AlluArjun

AlluArjun and Sandhya Theatre|పోలీసులపై ధియేటర్ యాజమాన్యం ఎదురుదాడి

ఆ సమాధానంలో ఎక్కడా తొక్కిసలాట ఘటనకు సంబంధించిన వివరణ లేదు


సంధ్య ధియేటర్ యాజమాన్యం వైఖరి మరీ విచిత్రంగా ఉంది. ఈనెల 4వ తేదీన థియేటర్లో పుష్ప సినిమా రిలీజ్ సందర్భంగా తొక్కిసలాట జరగటం, రేవతి అనే మహిళ మరణించిన ఘటనలో పోలీసుల షోకాజ్ నోటీసుకు థియేటర్ యాజమాన్యం విచిత్రమైన సమాధానం ఇచ్చింది. తొక్కిసలాటలో రేవతి మరణించగా, ఆమె కొడుకు శ్రీతేజ్ కోమాలోకి వెళ్ళిన విషయం తెలిసిందే. పుష్ప సినిమా(Pushpa Movie) రిలీజ్ సందర్భంగా హీరో అల్లుఅర్జున్(Allu Arjun) థియేటర్ కు రావటంతోనే తొక్కిసలాట జరిగిందన్నది వాస్తవం. ఆ తొక్కిసలాటలోనే తల్లి, కొడుకు కిందపడిపోయారు. పోలీసులు అల్లుఅర్జున్ పైన కేసుపెట్టి అరెస్టుచేశారు. నాంపల్లి కోర్టు అల్లుఅర్జున్ కు 14 రోజుల రిమాండు విధించగా హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

ఈ నేపధ్యంలోనే పోలీసులు సంధ్యా ధియేటర్(Sandhya Theatre) యాజమాన్యానికి షోకాజ్ నోటీసు జారీచేశారు. సినిమా యూనిట్ ను థియేటర్ కు పిలిపించవద్దని చెప్పిన విషయాన్ని గుర్తుచేస్తునే తొక్కిసలాటకు యాజమాన్యం నిర్లక్ష్యంగా ఉండటాన్ని తప్పుపట్టారు. అందుకనే థియేటర్ పైన ఎందుకు యాక్షన్ తీసుకోకూడదు ? యాజమాన్యంపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పాలని నోటీసులో పోలీసులు యాజమాన్యాన్ని ప్రశ్నించారు. పోలీసులు నమోదుచేసేన కేసులో అల్లుఅర్జున్ ఏ 11 అయితే మరో 17 మంది మీద కేసులు నమోదయ్యాయి. అందులో థియేటర్ యాజమాన్యం కూడా ఉంది. థియేటర్లో భాగస్తుల మీద కూడా పోలీసులు కేసులు నమోదుచేశారు.

పోలీసులు ఇచ్చిన షో కాజ్ నోటీసుకు థియేటర్ యాజమాన్యం ఆదివారం సమాధానం ఇచ్చింది. ఆ సమాధానంలో ఎక్కడా తొక్కిసలాట ఘటనకు సంబంధించిన వివరణ లేదు. తమ థియేటర్ 45 సంవత్సరాలుగా నడుస్తోందని, ఎంతోమంది హీరోలు మొదటిరోజే సినిమాకు వచ్చి చూశారని, ఏ హీరో ఎప్పుడు వచ్చి సినిమా చూసినా తొక్కిసలాట ఘటన జరగలేదని చెప్పింది. అల్లుఅర్జున్ సినిమా చూడటానికి వచ్చిన రోజు కూడా థియేటర్లో 80 మంది సిబ్బంది డ్యూటీలో ఉన్నారని చెప్పింది. అంటే అల్లుఅర్జున్ వచ్చినరోజున ఎందుకు సరైన జాగ్రత్తలు తీసుకోలేదని, అనుమతి లేకపోయినా హీరో థియేటర్ కు రావటంపైన పోలీసులు అడిగిన ప్రశ్నలకు మాత్రం థియేటర్ యాజమాన్యం సమాధానం చెప్పకుండా తన లేఖలో సోదంతా చెప్పింది. అడిగిన ప్రశ్నలకు తప్ప మిగిలిందంతా చెప్పుకున్నది. మరి థియేటర్ యాజమాన్యం తాజాగా లేఖలో ఇచ్చిన సమాధానానికి పోలీసులు ఏ విధంగా రియాక్టవుతారో చూడాల్సిందే.

Read More
Next Story