Bandi Sanjay | ‘రైతు భరోసా ఆపడానికి కాంగ్రెస్ కుట్ర’.. సాకు అదేనట..!
కేంద్ర ఎన్నికల సంఘ అభ్యంతరం వ్యక్తం చేస్తే పథకాల కోసం అఖిలపక్షంగా అనుమతి కోరదామన్న బండి సంజయ్
తెలంగాణలో రైతులకు ఇస్తామని చెప్పిన రైతు భరోసా ఎగ్గొట్టడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తుందా? అంటే బీజేపీ నేత, కేంద్రమంత్రి బండిసంజయ్ అవుననే అంటున్నారు. అందుకోసం కాంగ్రెస్.. ఎన్నికల కోడ్ను సాకుగా చూపాలని అనుకుంటుందని ఆయన ఆరోపించారు. రైతు భరోసాపై ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్యలకు దారి తీస్తున్నాయి. రైతు భరోసా అనేది ఇప్పటికే అమలులో ఉన్న పథకం కాబట్టి దీనిని అమలు చేయడానికి ఎన్నికల సంఘం నుంచి ఎటువంటి సమస్య ఉండదని బండి సంజయ్ స్పష్టం చేశారు. అంతేకాకుండా రానున్న ఎన్నికలు శాసనసభకు సంబంధించినవి కాదని, అవి కేవలం పట్టభద్రులు, ఉపాధ్యాయులకే సంబంధించినవే కాబట్టి వాటిపై ఈ పథకం అమలు ఎటువంటి ప్రభావం చూపే అవకాశం లేదని ఆయన పేర్కొన్నారు. ఒకవేళ ఎన్నికలు వస్తున్నాయని సాకు చెప్పి పథకం అమలును వాయిదా వేయాలని కాంగ్రెస్ భావిస్తే సరికాదని, ఈ అంశంపై కిషన్ రెడ్డి ద్వారా ఎన్నికల సంఘానికి లేఖ రాయడానికి కూడా బీజేపీ సిద్ధంగా ఉందని బండి సంజయ్ వివరించారు. ఈ మేరకు ఆయన ఓ కీలక ప్రకటన కూడా విడుదల చేశారు.
పథకాలు వెంటనే అమలు చేయండి
‘‘జనవరి 26 నుంచి అందుబాటులోకి వస్తాయన్న రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం వంటి పథకాలకు తక్షణమే అమలు చేయాలి. ఈ అంశంపై అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించాలి. ఎన్నికల కోడ్ను సాకుగా చూపి రైతులకు అందాల్సిన సొమ్మును ఆపాలనుకోవడం దారుణం. ఒకవేళ ఎన్నికల సంఘం ఎటువంటి అభ్యంతరం వ్యక్తం చేసినా.. అఖిలపక్షం తరపున కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి రైతు ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమచేయడానికి అనుమతి తిసుకుందాం. తెలంగాణ రైతులు ఇప్పటికే ఏడాదిగా రైతు భరోసా అందక అస్తవ్యస్థలు పడుతున్నారు. తీవ్రంగా నష్టపోయారు కూడా. ఈ నెలలో అయినా నిధులు అందకపోతే రైతులు మరింత ఆర్థిక ఇబ్బందులు పడాల్సి వస్తుంది’’ అని బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు.
రైతులను కష్టపెట్టడమే..
‘‘పంట పెట్టుబడులు పెరిగాయి. వర్షాభావ పరిస్థితులు కూడా ఉన్నాయి. దీంతోనే రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమయంలో వారికి అందాల్సిన నగదును కూడా ఏవో కుంటి సాకులు చెప్పి నిలిపివేస్తే వారికి మరింత కష్టం వస్తుంది. ఆత్మహత్యలే గత్యంతరమవుతాయి. అటువంటి పరిస్థితులు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. చెప్పిన పథకాలను చెప్పిన సమయానికి చెప్పినట్లు అందించాలి. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వ పథకాల కోసం రైతులతో పాటు.. కొత్త రేషన్ కారడుల కోసం 40 లక్షల మంది వేచి చూస్తున్నారు. వీరిలో కేవలం 40 వేల మందికే రేషన్ కార్డులను మంజూరు చేయడం అన్యాయం. ఉన్న లబ్ధిదారుల్లో లబ్ధిపొందిన వారికి సంఖ్య చాలా తక్కువ. కేవలం ఒక్కశాతం మందికే రేషన్ కార్డులు అందితే మిగిలిన 99శాతం మంది పరిస్థితి ఏంటి. ఇది అమానవీయం, ఈ వివక్ష ప్రభుత్వానికి పనికిరాదు. వ్యవసాయ భూమిలేని 10 లక్షల మంది కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఎకరాకు రూ.6వేల ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కానీ 20,336 మందికి మాత్రమే డబ్బులు జమచేసి మిగిలిన 9.79 లక్షల మందికి ఇవ్వకపోవడం వెనక ఆంతర్యం ఏంటి. ఎందుకు ఇవ్వలేదు?’’ అని బండి సంజయ్ ప్రశ్నించారు.