బీఆర్ఎస్ ఎంఎల్ఏలకు చీరలు, గాజులు
x
BRS MLAs padi kaushikreddy and KP Vivekananda Goud

బీఆర్ఎస్ ఎంఎల్ఏలకు చీరలు, గాజులు

ఫిరాయింపు ఎంఎల్ఏలు వెంటనే రాజీనామాలు చేయకపోతే వాళ్ళకి చీరలు, గాజులు పంపిస్తామని బీఆర్ఎస్ ఎంఎల్ఏలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానందరెడ్డి హెచ్చరించారు.


రాజీనామాలు చేయాలనే డిమాండుతో కారుపార్టీ ఫిరాయింపు ఎంఎల్ఏలపై బీఆర్ఎస్ ఎంఎల్ఏలు ఒత్తిడి పెంచేస్తున్నారు. ఇందులో భాగంగానే పదిమంది ఫిరాయింపు ఎంఎల్ఏలు వెంటనే రాజీనామాలు చేయకపోతే వాళ్ళకి చీరలు, గాజులు పంపిస్తామని బీఆర్ఎస్ ఎంఎల్ఏలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానందరెడ్డి హెచ్చరించారు. బీఆర్ఎస్ తరపున గెలిచిన ఎంఎల్ఏల్లో పదిమంది కాంగ్రెస్ లోకి ఫిరాయించిన విషయం తెలిసిందే. ఇందులో దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకటరావుపై అనర్హత వేటు వేయాలని పాడి, కేపీ హైకోర్టులో కేసు వేశారు. ఈ కేసును విచారించిన కోర్టు నాలుగు వారాల్లో వీరిపై యాక్షన్ తీసుకోవాలని అసెంబ్లీ కార్యదర్శిని ఆదేశించిన విషయం తెలిసిందే.

హైకోర్టు ఆదేశాల నేపధ్యంలో పై ఇద్దరు ఎంఎల్ఏలు అసెంబ్లీ సెక్రటరీని కలిసి వెంటనే యాక్షన్ ఇనీషియేట్ చేయాలని ఒత్తిడిపెట్టారు. తర్వాత మీడియాతో మాట్లాడుతు ఫిరాయించిన ఎంఎల్ఏలందరు వెంటనే తమ పదవులకు రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. రాజీనామాలు చేయకపోతే చీరలు కట్టుకుని గాజులు వేసుకుని తిరగాలంటు పాడి ఎద్దేవా చేశారు. సరే, పాడి ఎద్దేవాకు ఫిరాయింపులు ఏదో సమాధానం చెప్పకుండా ఉండరు. అయితే విచిత్రం ఏమిటంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నపుడు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు నిత్యం ఫిరాయింపులకే సమయం కేటాయించిన విషయం మరచిపోయినట్లున్నారు. పాడి పక్కనే కూర్చుని ఫిరాయింపులు రాజీనామాలు చేయాల్సిందే అని డిమాండ్ చేసిన కేపీ వివేకానందగౌడ్ కూడా ఫిరాయింపు ఎంఎల్ఏనే.

2014లో ప్రత్యేక తెలంగాణా వచ్చిన తర్వాత కేపీ కుత్బుల్లాపూర్ నుండి టీడీపీ తరపున గెలిచారు. తర్వాత బీఆర్ఎస్ లోకి ఫిరాయించారు. మరప్పుడు కేపీ ఎంఎల్ఏ పదవికి రాజీనామా చేశారా అంటే చేయలేదు. కేపీనే కాదు బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్ళల్లో 25 మంది ఎంఎల్ఏలు, 18 మంది ఎంఎల్సీలు, నలుగురు ఎంపీలను కేసీఆర్ ఇతర పార్టీల్లో నుండి లాక్కున్నారు. వీరిలో ఏ ఒక్కరితోను రాజీనామా చేయించలేదు. అప్పట్లో టీడీపీ, కాంగ్రెస్ ఎంఎల్ఏలు ఫిరాయింపులకు వ్యతిరేకంగా ఎంత గోలచేసినా కేసీఆర్ ఏమాత్రం లెక్కచేయలేదు. టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు కోర్టుల్లో కేసులు వేసినా పట్టించుకోలేదు.

పై రెండుపార్టీల ఎంఎల్ఏలు, ఎంఎల్సీలతో పాటు ఎంపీలను కూడా లాక్కున్న కేసీఆర్ తర్వాత అసెంబ్లీలో పై రెండుపార్టీల శాసనసభాపక్షాలను కూడా బీఆర్ఎస్ లో విలీనం చేసేసుకున్నారు. అప్పట్లో తాముచేసిందాంట్లో ఏమీ తప్పు కనబడలేదు. పైగా తాము రాజ్యాంగబద్దంగానే నడుచుకున్నట్లు సమర్ధించుకున్నారు. అప్పుడు తాము చేసిందాన్నే ఇపుడు రేవంత్ చేస్తుంటే కేసీఆర్ తట్టుకోలేకపోతున్నారు. కాకపోతే తాను మాట్లాడకుండా కేటీఆర్, హరీష్ తో రోజు మాట్లాడిస్తున్నారు. సరే, కోర్టు నాలుగువారాల్లో ఏదో నిర్ణయం తీసుకోమన్నది కదా చూడాలి ఏమి జరుగుతుందో.

Read More
Next Story