బెజగాంలో అపూర్వ సతిశిల
x

బెజగాంలో అపూర్వ సతిశిల

తెలంగాణలో కూడా సతి ఆచారం ఉండిందనేందుకు నిదర్శనమా?


ఇటీవల జైన తీర్థంకరుల శిల్పాలు వెలుగుచూసిన బెజగాంలో కొత్త సతిశిలతో పాటు, శూలారోహణ ఆత్మాహుతి, ఇతర వీరగల్లులను గుర్తించారు.

ఈ సతిశిల ఇంతకు ముందెన్నడు అగుపించని, అరుదైన వీరస్మారకశిల అని ఔత్సాహిక చరిత్ర పరిశోధకుడు, కొత్త తెలంగాణ చరిత్ర బృంద సభ్యుడు కొలిపాక శ్రీనివాస్ తెలిపారు.

ఈ శిల్పంలో వీరుడు తలమీద పెద్దసిగతో, చెవులకు జూకాలు, మెడలో కంటె, జంధ్యం, హస్తభూషణాలు, నడుమున దట్టీ, వీరకాసె, చేతులలో ఈటెతో, డాకాలు సాచి, యుద్దానికి సిద్ధమై ఉన్నాడు, వీరునికి కుడిపక్కన పెద్ద ధమ్మిల్లంతో, చెవులకు జూకాలతో, మెడలో హారం, నడుమున నీవీబంధం, చేతులలో ఈటెతో శత్రువును చంపుతున్న వీరనారి నిలబడివుంది. వీరునికి ఎడమవైపున పెద్ద ధమ్మిల్లంతో, జూకాలతో, మెడలో హారంతో, నడుమున మేఖల కుడిచేతిలో పువ్వు, ఎడమచేత కమండలం పట్టుకొని కనిపిస్తున్న స్త్రీ ఆ వీరుని సతి. వీరుని కుడి పక్కన ఈటెతో శత్రువుని చంపుతున్న ఆ నారీమణి కూడా వీరుని వీరపత్నే. బహుశా ఈ వీరునికి ఇద్దరు భార్యలు ఉండచ్చు. అక్కడ జరిగిన పోరులో భర్తతో పాటు పోరాడిన భార్య కూడా చనిపోయింది. మిగిలిన మరొక భార్య భర్తతో పాటు సతీసహగమనం చేసిందనీ శ్రీనివాస్ తెలిపారు.



ఇటువంటి వీరస్మారకశిల ఇంతకు ముందెన్నడు లభించలేదని, ఈ సతిశిల కళ్యాణీ చాళుక్యుల కాలానికి చెందిందని చరిత్రబృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ అన్నారు. ఈ పరిశీలనలో కొలిపాక శ్రీనివాస్ వెంట గ్రామస్తులు నర్రా కళాధర్, నాంపల్లి స్వామి, శ్యాంకుమార్ పాల్గొన్నట్లు తెలిపారు.


Read More
Next Story