డీఎస్సీ కేంద్రంగా పెరిగిపోతున్న ‘వర్గీకరణ’ చిచ్చు
సుప్రింకోర్టు తీర్పివ్వగానే ఒక వైపు మాలలు మరోవైపు మాదిగలు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేస్తున్నారు.
రిజర్వేషన్లకు సంబంధించి ఎస్సీ వర్గీకరణపై సుప్రింకోర్టు ఇచ్చిన తీర్పు ఇపుడు చిచ్చుగా మారబోతోంది. ఎస్సీ వర్గీకరణ వివాదం దశాబ్దాలు కోర్టులో నలుగుతోంది. ఇలాంటి వివాదంపై ఎస్సీ వర్గీకరణ చేయచ్చని సుప్రింకోర్టు ఈమధ్యనే తీర్పిచ్చింది. సుప్రింకోర్టు తీర్పివ్వగానే ఒక వైపు మాలలు మరోవైపు మాదిగలు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేస్తున్నారు. వర్గీకరణ తీర్పు చిచ్చు ఇపుడు డీఎస్సీ నియామకాలపైన తీవ్ర ప్రభావం చూపబోతోంది.
సుప్రింకోర్టు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పుచెప్పగానే రేవంత్ రెడ్డి స్పందిస్తు తీర్పును మొట్టమొదటగా తెలంగాణా రాష్ట్రం అమలుచేస్తుందని అసెంబ్లీలో ప్రకటించారు. ఇపుడా ప్రకటనే డీఎస్సీ ప్రక్రియకు పెద్ద అడ్డంకిగా మారింది. సుప్రింకోర్టు తీర్పును డీఎస్సీ పరీక్షలకు కూడా వర్తింపచేయాల్సిందే అని మాదిగలు డిమాండ్ చేస్తున్నారు. తీర్పుకు ముందే ప్రభుత్వం నోటిపికేషన్ ఇచ్చింది కాబట్టి తీర్పు డీఎస్సీకి వర్తింపచేసేందుకు లేదని మాలలు పట్టుబడుతున్నారు. ఈ ఇద్దరి మధ్య ప్రభుత్వం నలిగిపోతోంది. విషయం ఏమిటంటే 11,062 పోస్టుల భర్తీ నేపధ్యంలో డీఎస్సీ పరీక్షలు జరిగాయి. ఇందుకోసం 2,79,957 మంది దరఖాస్తు చేసుకున్నారు. 2,45,263 మంది పరీక్షకు హాజరయ్యారు.
జూలై 18వ తేదీన మొదలైన డీఎస్సీ పరీక్షలు ఆగష్టు 5వ తేదీతో ముగిసాయి. పరీక్ష ఫలితాలకు సంబంధించిన ‘కీ‘ ని ప్రభుత్వం 8వ తేదీ అంటే గురువారం ప్రకటించబోతోంది. పూర్తిస్ధాయి ఫలితాలను సెప్టెంబర్ మూడోవారంలో రిలీజ్ అవుతాయి. అక్టోబర్లో ఇంటర్వ్యూలు నిర్వహించి ఫైనల్ సెలక్షన్ను పూర్తిచేసి నియామకాలు చేసేందుకు ఇప్పటికే ప్రభుత్వం అన్నీ ఏర్పాట్లుచేసింది. ఈ దశలో ఎస్సీ వర్గీకరణ తీర్పును సుప్రింకోర్టు ప్రకటించింది. దాంతో ఎస్సీలోని మాదిగలు ప్రభుత్వం ముందు కొత్త డిమాండ్ పెట్టారు.
మాదిగలు ఏమంటారంటే పరీక్షలు నిర్వహించిన డీఎస్సీని వెంటనే రద్దుచేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. పరీక్షలు జరిగిపోయిన డీఎస్సీని అలాగే కంటిన్యు చేస్తే మాదిగలకు అన్యాయం జరుగుతుందని వాదిస్తున్నారు. కాబట్టి వర్గీకరణ ప్రకారమే పోస్టులను వర్గీకరించి మళ్ళీ కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వాలన్నది వీళ్ళ డిమాండ్. అయితే వీళ్ళ డిమాండును మాల నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వీళ్ళ వాదన ఏమిటంటే సుప్రింకోర్టు తీర్పుకు ముందే ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ ప్రకటించింది. తీర్పుకు ముందు జారీచేసిన నోటిఫికేషన్లకు సుప్రింకోర్టు తీర్పు వర్తించదని మాల నేతలు వాదిస్తున్నారు. పైగా నోటిఫికేషన్ ప్రకారం పరీక్షలు జరిగిపోయి, కీ ని రెండు రోజుల్లో విడుదల చేస్తారనగా ఇపుడు మొత్తం డీఎస్సీ ప్రక్రియను రద్దుచేయటం సమంజసం కాదంటున్నారు.
అధికారులు కూడా మాల నేతల వాదననే బలపరుస్తున్నట్లుగా మాట్లాడుతున్నారు. నోటిఫికేషన్ను ఇపుడు రద్దుచేస్తే ఎవరైనా కోర్టులో కేసు వేసే అవకాశముందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఒకసారి కోర్టులో ఎవరైనా కేసు వేస్తే అది ఎప్పటికి తెగుతుందో తెలీదు. కోర్టులో కేసు వేసిన తర్వాత ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చేందుకు లేదు, పరీక్షలు నిర్వహించేందుకూ లేదు. దాంతో టీచర్ పోస్టుల భర్తీ ఎక్కడికక్కడ ఆగిపోవటం ఖాయమని అధికారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. కాబట్టి నోటిఫికేషన్ ప్రకారం కీని విడుదల చేసి ఇంటర్వ్యూలు జరిపి ఎంపిక చేస్తే బాగుంటుందని విద్యాశాఖ ఉన్నతాధికారులు ప్రభుత్వానికి సలహా ఇచ్చారు. ఇకముందు జారీచేసే నోటిఫికేషన్లను వర్గీకరణపై సుప్రింకోర్టు తీర్పు ప్రకారమే ఇస్తే సరిపోతుందని కూడా చెప్పినట్లు సమాచారం.
చెన్నయ్య డిమాండ్ ఏమిటి ?
ఇదే విషయమై మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు ఇవీ చెన్నయ్య మాట్లాడుతు డీఎస్సీని యథాతథంగా అమలుచేయాలని డిమాండ్ చేశారు. సుప్రింకోర్టు తీర్పుకు ముందు జారీచేసిన నోటిఫికేషన్లకు తీర్పు వర్తించదని ఆయన వాదిస్తున్నారు. సుప్రింకోర్టు తీర్పును సాకుగా చూపించి ప్రభుత్వం మాదిగలను నెత్తికెత్తుకోవటం మంచిదికాదని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. డీఎస్సీ ప్రక్రియను నిలిపినా, రద్దుచేసినా వెంటనే తాము కోర్టులో కేసు వేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు.
నరేష్ మాదిగ ఏమంటున్నారు ?
ఎంఆర్పీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్ నరేష్ మాదిగ మాట్లాడుతు వర్గీకరణ ప్రకారమే డీఎస్సీ పోస్టుల భర్తీ జరగాలన్నారు. తీర్పు ప్రకారం పోస్టుల భర్తీ జరగాలంటే ప్రకటించిన డీఎస్సీని రద్దు చేయాల్సిందే అని నరేష్ డిమాండ్ చేస్తున్నారు. డీఎస్సీని రద్దుచేయకుండా ముందుకు వెళితే మాదిగలకు ప్రభుత్వం అన్యాయం చేసినట్లవుతుందని అంటున్నారు. గతంలో కానిస్టేబుళ్ళు, ఎసై నియామకాల్లో కూడా కటాఫ్ రిజర్వేషన్ల విధానంలో సవరణలు తెచ్చిన విషయాన్ని నరేష్ గుర్తుచేస్తున్నారు. కాబట్టి అదే పద్దతిలో డీఎస్సీ ప్రక్రియను కూడా సవరించటంలో తప్పేమీలేదని అభిప్రాయపడ్డారు. తీర్పు ప్రకారం కాకుండా ప్రకటించిన నోటిఫికేషన్ ప్రకారమే ప్రభుత్వం ముందుకెళితే తాము చూస్తు ఊరుకోమని హెచ్చరిస్తున్నారు.
రావుల వాదన ఏమిటి ?
ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ, ఎస్సీల వర్గీకరణపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డీఎడ్, బీఈడీ అభ్యర్ధుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రావుల రామ్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. సుప్రింకోర్టు తీర్పును అమలుచేస్తామని రేవంత్ ప్రకటించిన నేపధ్యంలో రావుల మరింత స్పష్టత కోరుతున్నారు. జరుగుతున్న పరిణామాలతో పరీక్షలు రాసిన అభ్యర్ధుల్లో మానసిక ఆందోళన పెరిగిపోతోందన్నారు. ప్రభుత్వం గనుక డీఎస్సీ ప్రక్రియను నిలిపినా, రద్దుచేసినా పరీక్షలు రాసిన లక్షలాది మంది ఇబ్బందులో పడుతారని చెప్పారు. కొత్త నోటిఫికేషన్ ప్రకారం లక్షలాది మంది అభ్యర్ధులు మళ్ళీ కోచింగ్ తీసుకుని పరీక్షలు రాయాల్సుంటుందని రావుల వివరించారు.