
తెలంగాణలో మండుతున్న ఎండలు
తెలంగాణలో భాణుడి భగభగ, వడదెబ్బతో 9 మంది మృతి
తెలంగాణలో మంగళవారం ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల సెల్సియస్ చేరాయి
తెలంగాణ రాష్ట్రంలో మంగళవారం నుంచి ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగాయి. మండే ఎండలతో పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలకు చేరాయి. ఈ ఎండల ధాటికి రాష్ట్రంలో వడదెబ్బ మరణాలు కూడా ఆరంభమయ్యాయి. ఈ ఎండల నేపథ్యంలో సోమవారం రాష్ట్రవైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తం అయింది.ఈ వేసవిలో ఇతర వ్యాధులు కూడా ప్రబలుతున్నాయి. ఆసుపత్రుల్లో ఓపీ రోగుల సంఖ్య పెరిగింది.
ఆరు జిల్లాల్లో మండుతున్న ఎండలు
తెలంగాణలో మంగళవారం నుంచి నాలుగురోజుల పాటు ఉత్తర తెలంగాణలోని ఆరు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పెచ్చు పెరిగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త ఏ ధర్మరాజు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. ఆదిలాబాద్, కొమురం భీ అసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్ జిల్లాల్లో 45 డిగ్రీల సెల్షియస్ కు చేరే అవకాశముందని ఆయన తెలిపారు. రానున్న నాలుగు రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. సాధారణంగా ప్రతి ఏటా ఏప్రిల్ చివరి వారంలో ఉష్ణోగ్రతలు పెరుగుతుంటాయని, కానీ ఈ ఏడాది ఏప్రిల్ మూడవ వారంలో 45 డిగ్రీల సెల్షియస్ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందని ధర్మరాజు చెప్పారు. ఉత్తర తెలంగాణలో వేడిగాలులు వీచే అవకాశం ఉందని ఆయన వివరించారు.
ఆదిలాబాద్ జిల్లాల్లో అత్యధికం
ఆదిలాబాద్ జిల్లాల్లో మంగళవారం అత్యధికంగా 44 డిగ్రీల సెల్షియస్ ఉష్ణోగ్రత నమోదైంది. నిజామాబాద్ జిల్లాలో 43.4 , మెదక్ జిల్లాలో 43 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు చెప్పారు. మహారాష్ట్రలో విదర్భ ప్రాంతంలో పెరుగుతున్న ఉష్షోగ్రతల ప్రభావం ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కనిపిస్తుందని వాతావరణ కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త ఎ ధర్మరాజు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలోని చంద్రపూర్ జిల్లాలో దేశంలోనే అత్యధికంగా 45.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. మహారాష్ట్రలోని అమరావతిలో 44.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. మహారాష్ట్రలోని చంద్రపూర్‌లో సోమవారం 45.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఇది దేశంలోనే అత్యంత వేడిగా ఉన్న నగరంగా మారిందని ధర్మరాజు తెలిపారు. గత వారం నుంచి ఉత్తర తెలంగాణలో తీవ్రమైన వేడిగాలులు వీస్తున్నాయి.
పలు జిల్లాల్లో వేడిగాలుల తీవ్రత
తెలంగాణలోని పలు జిల్లాల్లో వేడిగాలుల తీవ్రత పెరిగే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త ఏ ధర్మరాజు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. ఆదిలాబాద్ జిల్లాల్లో అత్యధికంగా 44 డిగ్రీల సెల్షియస్ ఉష్ణోగ్రత నమోదైంది. భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, హైదరాబాద్, జనగామ, జోగులాంబ గద్వాల, ఖమ్మం, మహబూబాబాద్, మహబూబ్ నగర్, మేడ్చల్ మల్కాజిగిరి, ములుగు, నాగర్ కర్నూల్ జిల్లాల్లో 36 నుంచి 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కరీంనగర్, కామారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల, మెదక్, జగిత్యాల, ఆదిలాబాద్ జిల్లాల్లో రాగల నాలుగు రోజుల పాటు ఉష్ణోగ్రతలు 41 నుంచి 44 డిగ్రీల సెల్షియస్ నమోదయ్యే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు చెప్పారు.

తెలంగాణ జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ
తెలంగాణలో ఉష్ణోగ్రతలు పెరగడంతో హైదరాబాద్ ఐఎండీ అధికారులు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. ఎండలో వెళ్లరాదని ప్రజలకు సూచించారు. తేలికైన కాటన్ దుస్తులు ధరించాలని, బయటకు వెళ్లాల్సి వస్తే గొడుగులు తీసుకెళ్లాలని లేకుంటే వస్త్రంతో తలను కప్పుకోవాలని ఐఎండీ సూచించించింది.
పెరిగిన ఉష్ణోగ్రతలు
ఉత్తర తెలంగాణ అంతటా తీవ్రమైన వేడి రాజుకుందని ఈ సంవత్సరం మొదటిసారిగా ఉష్ణోగ్రత 44డిగ్రీల సెల్షియస్ కు చేరిందని తెలంగాణ వెదర్ మ్యాన్ తెలిపింది. ఆదిలాబాద్ లో 44డిగ్రీలు, ఆసిఫాబాద్ లో 43.8, నిర్మల్ లో 43.8,మంచిర్యాల్ లో 43.7, జగిత్యాలలో 43.6, సిరిసిల్లలో 43.5,పెద్దపల్లిలో 43.4 డిగ్రీల సెల్షియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని తెలంగాణ వెదర్ మ్యాన్ తెలిపారు. హైదరాబాద్ నగరంలో కూడా తీవ్రమైన వేడి మొదలైంది. మొదటిసారి ఉష్ణోగ్రత 41డిగ్రీల సెల్షియస్ దాటింది.బంజారా హిల్స్ లో 41.6 డిగ్రీల సెల్షియస్,ముషీరాబాద్ లో 41.6, గాజులరామారంలో 41.5,హబ్సిగూడలో 41.5, చార్మినార్ లో 41.4, ఖైరతాబాద్ లో 41.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని వెదర్ మ్యాన్ తెలిపారు.
వడదెబ్బతో 9 మంది మృతి
తెలంగాణలో మండుతున్న ఎండల ప్రభావంతో 9 మంది వడదెబ్బతో మరణించారని వైద్యశాఖ అధికారులు చెప్పారు. ఆదిలాబాద్ జిల్లాలో ముగ్గురు, వరంగల్ లో ముగ్గురు, ఖమ్మం, కరీంనగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున వడదెబ్బతో మరణించారు. సోమవారం నిర్మల్‌లో వడగాల్పుల కారణంగా ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. కురన్నపేటకు చెందిన శంకర్ (48), రాజు (45) ఆదివారం డ్రమ్మింగ్ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత తీవ్రమైన ఎండ దెబ్బతో మరణించారు.

అప్రమత్తంగా ఉండండి : మంత్రి దామోదర రాజనర్సింహ
తెలంగాణలో ఎండలు ముదురుతున్నందున అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సూచించారు.బయటకు వెళ్లినప్పుడు ఎండదెబ్బ బారిన పడకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. తాగు నీరు తప్పనిసరిగా వెంట తీసుకెళ్లాలని, ఎక్కువసేపు ఎండలో ఉండకూడదని మంత్రి సూచించారు. ఒకవేళ ఏదైనా ఇబ్బంది కలిగితే తక్షణమే సమీపంలోని ప్రభుత్వ దవాఖానాకు వెళ్లాలన్నారు.
వడదెబ్బ తిగిలితే 108కు ఫోన్ చేయండి
తమ చుట్టూ ఉన్నవారిలో ఎవరికైనా వడ దెబ్బ తగిలితే, వెంటనే సమీపంలోని హాస్పిటల్‌కు బాధితున్ని తరలించాలని, 108 అంబులెన్స్‌కు సమాచారం చేరవేయాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రజలను కోరారు.పిల్లలు, వృద్దులు, గర్భిణుల విషయంలో కుటుంబ సభ్యులు మరింత అప్రమత్తంగా ఉండాలని, వారిని జాగ్రత్తగా చూసుకోవాలని మంత్రి సూచించారు.వడదెబ్బపై అవగాహన కల్పించేందుకు విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులకు మంత్రి సూచించారు.
వైద్య బృందాలు సిద్ధం
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి టీచింగ్ హాస్పిటల్స్ వరకూ అన్ని చోట్ల వడ దెబ్బ బాధితులకు చికిత్స అందించేందుకు సిద్ధంగా వైద్య బృందాలను ఏర్పాటు చేయాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశించారు. దీంతో మంత్రి దామోదర్ రాజనర్సింహ సోమవారం వైద్యాధికారులతో వడదెబ్బ తగలకుండా చర్యలు తీసుకోవాలని సూచిస్తూ పోస్టరును విడుదల చేశారు.వడ దెబ్బ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుపుతూ ఆరోగ్యశాఖ రూపొందించిన పోస్టర్‌ను మెడికల్ కార్పొరేషన్ (టీజీఎంఎస్‌ఐడీసీ) కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆవిష్కరించింది.
Next Story