'ములాయం సింగ్ యాదవ్ వర్ధంతి సభ'
సమాజ్వాది పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ రెండో వర్ధంతి హైదరాబాదులో జరిగింది. ఈ సభ తెలంగాణ రాష్ట్ర విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడమైనది.
సమాజ్వాది పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ రెండో వర్ధంతి హైదరాబాదులో జరిగింది. ఈ సభ తెలంగాణ రాష్ట్ర విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడమైనది. సమాజ్వాది పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ సింహాద్రి మాట్లాడుతూ.. ములాయం సింగ్ యాదవ్ ఈ దేశ రాజకీయాలలో ఒక బలమైన నాయకులుగా నిలిచారని అన్నారు. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ కేంద్రంగా వీరి రాజకీయ జీవితం కొనసాగింది. సామాన్య రైతు కుటుంబంలో జన్మించి చిన్న వయసులోనే రాష్ట్ర అసెంబ్లీకి వీరు ఎన్నికైనారు. 50 సంవత్సరాల వయసులో దేశంలో అతి పెద్ద రాష్ట్రం అయినా ఉత్తరప్రదేశ్‌కు ముఖ్యమంత్రి అయినారు. 1992లో సమాజ్వాది పార్టీని స్థాపించి కాన్‌శీరాంతో కలిసి గెలుపొంది రెండోసారి ముఖ్యమంత్రి అయినారు. సమాజ్వాది పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ సాధించిన విజయం దేశ రాజకీయాల మీద తీరని ముద్ర వేసింది. దశాబ్దాలుగా అధికారానికి దూరంగా ఉన్న ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనారిటీలు ఒకటైతే అధికారం చేపట్టొచ్చని నిరూపించారు. మూడుసార్లు ముఖ్యమంత్రిగా, రెండుసార్లు భారత రక్షణ మంత్రిగా పనిచేశారు. ప్రధానమంత్రి పదవికి అతి దగ్గరలో చేరుకొన్నారు.
రామ్ మనోహర్ లోహియా చూపించిన సమాజ వాద సిద్ధాంతం కేంద్రంగా పేదలు, స్త్రీలు, రైతులు, వెనుకబడిన తరగతుల సమస్యలను నిరంతరం చట్టసభలలో చర్చిస్తూ ప్రభుత్వ పాలసీలను ప్రభావితం చేశారు. మూలాయం మండల కమిషన్ అమలుకై విప్లవ రథయాత్రను చేపట్టినారు. జాతీయస్థాయిలో కులగననకై ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకొచ్చారు. హిందూ, ముస్లింల మధ్య సోదర భావాన్ని రక్షించుటకై పాలనపరమైన చర్యలు నిరంతరం తీసుకునేవారు. భారతదేశ నిర్మాణంలో సామాజిక న్యాయం పునాదిగా ఉండాలని కోరుకునేవారు. రాజ్యాంగ బద్ధ పాలనకై తపించేవారు. పూలన్ దేవిని పార్లమెంటుకు పంపించి స్త్రీల ఆకాంక్షలను నిజం చేసినారు. మొదటిసారి కాన్‌శీరాం పార్లమెంట్ ఎన్నికలలో గెలిపించడంలో వీరి పాత్ర గణనీయమైనది
సిద్ధాంతపరమైన విభేదాలు పార్టీలలో ఉన్నప్పటికీ నాయకుల మధ్య సద్భావన పూర్వకంగా వ్యవహరించేవారు. సమాజవాదానికి ప్రత్యర్ధులయిన హిందుత్వవాదులు కూడా వీరిని గౌరవించేవారు. పార్లమెంటు ముఖ్య నాయకుల ప్రభావంలో భాగంగా నడవాలని కోరుకునేవారు. వీటన్నిటితో పాటు వెనుకబడిన తరగతులకు గుర్తింపు, ఆత్మగౌరవం, అధికారంలో భాగస్వామ్యం కల్పించడంలో వారికి వారే సాటి. మూలాయం నిజంగానే పేదల పెన్నిధిగా, భూమి పుత్రునిగా మన్ననలు పొందినారు. సమాజ్వాది పార్టీకి చెందిన పలువురు రాష్ట్ర నాయకులు ఈ సభలో పాల్గొన్నారు. ముఖ్యంగా గోవర్ధన్, ప్రొఫెసర్ వెంకట్రాజయ్య, మహమ్మద్ మీర్జా బేగ్, మహమ్మద్ రిజ్వాన్, మహమ్మద్ వజీద్, శ్రీహరి ముదిరాజ్, బాలు యాదవులు కూడా ములాయం సింగ్ యాదవ్ రెండో వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించారు.