హైదరాబాద్‌లో చెరువులకు కాపలా? ఎందుకంటే...
x
ఇక హైదరాబాద్ చెరువుల వద్ద హైడ్రా గార్డులతో గస్తీ

హైదరాబాద్‌లో చెరువులకు కాపలా? ఎందుకంటే...

కబ్జాదారుల మీద హైడ్రా కొరడా...


హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డు పరిధిలోని 70 చెరువులున్నాయి.చెరువుల వద్ద ఉన్న భూముల ధరలు విపరీతంగా పెరగడంతో వీటిపై కబ్జాదారుల కన్ను పడింది. చెరువులను కబ్జా కాకుండా కాపాడేందుకు హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (HYDRAA) కొత్త ప్రణాళిక రూపొందించింది. పోలీసు కానిస్టేబుల్ పరీక్షల్లో తక్కువ మార్కులతో ఉద్యోగ అవకాశం రాని అభ్యర్థులు 400 మందిని హైడ్రా గార్డులుగా అవుట్ సోర్సింగ్ విధానంలో నియమించింది. 400 మంది గార్డులతో చెరువుల వద్ద 24 గంటల పాటు మూడు షిఫ్టుల్లో గస్తీ ఉండేలా హైడ్రా నియమించింది. ఒక్కో చెరువుకు ఏడుగురు హైడ్రా గార్డులు నిత్యం పహరా కాస్తూ చెరువులను కబ్జాదారుల బారి నుంచి పరిరక్షించనున్నారు. హైడ్రా గార్డులకు చెరువుల పరిరక్షణలో శిక్షణ ఇచ్చారు.


జీహెచ్ఎంసీలోని చెరువుల వద్ద సోలార్ ఆధారిత 4 జీ టవర్ ఐపీసీసీ కెమెరాలు
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 185 చెరువుల పరిరక్షణ, వరద ముప్పు నివారణకు వీలుగా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసేలా సోలార్ ఆధారిత 4 జీ టవర్ ఐపీసీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని హైడ్రా నిర్ణయించింది. చెరువల వద్ద సోలార్ ఆధారిత ఐపీసీసీ కెమెరాల ఏర్పాటుకు హైడ్రా రంగం సిద్ధం చేసింది. సెప్టెంబరు 1వతేదీ నుంచి చెరువుల వద్ద ఈ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు.



ఆరు చెరువుల సుందరీకరణకు పనులు

హైదరాబాద్ నగరంలోని అంబర్ పేటలోని బతుకమ్మ కుంట, కూకట్ పల్లిలోని నల్లచెరువులను హైడ్రా సుందరీకరించింది. నగరంలోని సున్నం చెరువు, భమ్రూక్ ఉద్దీన్ దౌలా, తమ్మిడికుంట, ఉప్పల్ నల్లచెరువులను కూడా పునరుద్ధరించి సుందరీకరణ పనులు చేయనున్నారు. దీంతో చెరువులు నగర ప్రజలకు ఆహ్లాదాన్ని అందించనున్నాయి. ఈ చెరువుల వద్ద వాకింగ్ ట్రాక్ లు నిర్మిస్తున్నారు.

హైడ్రా ప్ర‌జావాణికి 48 ఫిర్యాదులు
హైడ్రా ప్రజావాణికి సోమవారం ఒక్క రోజే 48 ఫిర్యాదులు వచ్చాయి. ప్లాట్‌కు ప‌క్క‌న రోడ్డున్నా.. పార్కున్నా.. క‌లిపేసుకుంటున్నార‌ని పలువురు కాలనీ వాసులు ఫిర్యాదు చేశారు. కోర్టు స్టేట‌స్ కో ఉన్నా గ‌చ్చ‌బౌలిలో సంధ్యా క‌న్వెన్ష‌న్ య‌జ‌మాని శ్రీ‌ధ‌ర్ రావు ప‌లు నిర్మాణాలు చేప‌డుతున్నారని ఫెర్టిలైజ‌ర్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ కోప‌రేటివ్ హౌసింగ్ సొసైటీసభ్యులు, ప్లాట్ య‌జ‌మానులు ఫిర్యాదులో పేర్కొన్నారు. కాప్రా జ‌వ‌హార్‌న‌గ‌ర్ స‌రిహ‌ద్దుల్లో లే ఔట్ వేసి 33 అడుగుల రోడ్డును ఆక్ర‌మించేశార‌ని ఫిర్యాదు చేశారు. పార్కులు, ర‌హ‌దారుల‌ ఆక్ర‌మ‌ణ‌లపై ప్రజావాణికి ఫిర్యాదులు వచ్చాయి.బంజారాహిల్స్ రోడ్డు నంబ‌రు 12లోని ఎమ్మెల్యే కాల‌నీలో రెండు ప్లాట్ల మ‌ధ్య 100 గ‌జాల వ‌ర‌కూ ప్ర‌భుత్వ స్థ‌లం ఉంటే.. ఇరువైపుల వారు దానిని క‌బ్జా చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు.



చెరువుల్లో ఆగని భూ ఆక్రమణలు

రంగారెడ్డి జిల్లా శేరిలింగంప‌ల్లి మండలంలోని గోప‌న్న‌ప‌ల్లి గ్రామంలో సర్వే నంబర్ 178లో ఉన్న ప్రభుత్వ భూమి, చిన్నిపెద్ద చెరువు పరిధిలో భూ ఆక్రమణలు జరుగుతున్నాయని బ్రిక్స్ స్కైవుడ్స్ వెల్ఫేర్ అసోసియేష‌న్ ప్ర‌తినిధులు హైడ్రా ప్రజావాణి లో ఫిర్యాదు చేశారు.మేడ్చ‌ల్ జిల్లా కీసర మండలంలోని నాగారం మునిసిపాలిటీ పరిధిలో ఉన్న అన్నారాయన్ చెరువు ఆక్ర‌మ‌ణ‌ల‌కు గురి అవుతోంద‌ని అన్నారాయన్ చెరువు పరి రక్షణ సమితి హైడ్రా ప్రజావాణి లో ఫిర్యాదు చేసింది.బేగంపేట, భ‌గ‌వంత్‌పురం ప్రాంతంలోని విమానాశ్ర‌యం నుంచి వ‌స్తున్న వ‌ర‌ద కాలువ‌ను ఓ వ్య‌క్తి ఆక్ర‌మించి మ‌ట్టితో నింపుతున్నార‌ని.. దీంతో భ‌గ‌వంత్‌పురంలో నివాసాలు వ‌ర్షం వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా నీట మునుగుతున్నాయ‌ని అక్క‌డి నివాసితులు ప్ర‌జావాణి ఫిర్యాదులో పేర్కొన్నారు.


Read More
Next Story