
మావోయిస్టుల కోసం కర్రెగుట్టలను చుట్టుముట్టిన భద్రతాదళాలు
కర్రెగుట్టల్లో మావోయిస్టుల ఓవర్ యాక్షన్ ఫలితం ఇపుడు వాళ్ళ మెడలకే చుట్టుకుంది.
అనుకున్నంతా జరిగింది. కర్రెగుట్టల్లో మావోయిస్టుల ఓవర్ యాక్షన్ ఫలితం ఇపుడు వాళ్ళ మెడలకే చుట్టుకుంది. తెలంగాణ, ఛత్తీస్ ఘడ్ సరహద్దుల్లోని కర్రెగుట్టల్లో తీవ్ర అలజడి మొదలైంది. ములుగు జిల్లాలోని కర్రెగుట్టలను సుమారు 2వేలమంది భద్రతాదళాలు ఒక్కసారిగా మంగళవారం ఉదయం చుట్టుముట్టాయి. కర్రెగుట్టల్లో మావోయిస్టులు(Maoists) పెద్దసంఖ్యలో క్యాంపు వేశారన్న సమాచారం, అనుమానంతో భద్రతాదళాలు ఒక్కసారిగా కర్రెగుట్టలను చుట్టుముట్టాయి. ఛత్తీస్ ఘడ్(Chhattisgarh) నుండి వందలమంది, తెలంగాణ(Telangana) వైపునుండి మరికొన్ని వందలమంది సాయుధబలగాలు ఒక్కసారిగా కర్రెగుట్టల్లోని అడువులను అణువణున జల్లెడపట్టడం మొదలుపెట్టారు. ఈనేపధ్యంలోనే కొందరు మావోయిస్టులు కనబడ్డారని భద్రతాదళాలు కాల్పులు(police firing) మొదలుపెట్టినట్లు సమాచారం.
నిజానికి కర్రెగ్గుట్టల్లో మావోయిస్టులున్నారన్న విషయం పోలీసులకు తెలీదు. అయితే కొద్దిరోజుల క్రితం మావోయిస్టులు కర్రెగుట్టల్లో మందుపాతర్లు అమర్చిన కారణంగా ఆదివాసీలు ఎవరూ కర్రెగుట్టల మీదకు రావద్దని హెచ్చరికలు పంపారు. తమ మాటవినకుండా ఎవరైనా గుట్టలమీదకు వచ్చినపుడు ప్రాణాలు పోతే తమది బాధ్యత కాదని కూడా వార్నింగ్ ఇచ్చారు. మవోయిస్టుల వార్నింగులపై ఆదివాసీలు(Tribals) మండిపడ్డారు. కర్రెగుట్టల అడవుల మీదే తమ జీవితాలు ఆధారపడున్నాయని చెప్పారు. గుట్టల్లో మందుపాతర్లు అమర్చిన కారణంగా ఆదివాసీలను కర్రెగుట్టల్లోకి రావద్దని చెప్పటానికి మావోయిస్టులు ఎవరంటు ఆదివాసీలు ఎదురుతిరిగారు. మావోయిస్టుల చర్యలను నిరసిస్తు కౌతల్ గ్రామంలో పెద్దఎత్తున పోస్టర్లు అంటించారు.
మావోయిస్టులకు వ్యతిరేకంగా ఆదివాసి యువజన సంఘం అతికించిన పోస్టర్లు పోలీసుల దృష్టిలో పడ్డాయి. దాంతో కొందరు గ్రామస్తులను పోలీసులు మావోయిస్టుల చర్యలపై విచారించారు. దాంతో కర్రెగుట్టల అడవుల్లో మందుపాతర్లు అమర్చినట్లుగా తమకు వార్నింగ్ ఇచ్చిన విషయం ఆదివాసీలు చెప్పేశారు. దాంతో మావోయిస్టులు కర్రెగుట్టల అడవుల్లో క్యాంపేసినట్లు అనుమానించారు. ప్రతిరోజు అడవుల్లోకి వెళ్ళొచ్చే ఆదివాసీలపైన పోలీసులు నిఘాపెట్టడంతో మావోయిస్టుల కదలికలు బయటపడ్డాయి. దాంతో ఇతరత్రా సమాచారం సేకరించుకున్న పోలీసులు, భద్రతాదళాలు మంగళవారం ఉదయం ఒక్కసారిగా కర్రెగుట్టల అడవుల్లోకి చొచ్చుకుపోయారు. మావోయిస్టులు కనబడ్డారు కాబట్టే పోలీసులు కాల్పులు మొదలుపెట్టినట్లు సమాచారం పొక్కింది. అయితే కాల్పుల విషయాన్ని పోలీసులు ధృవీకరించలేదు కాని అడవుల్లో మావోయిస్టుల కోసం పెద్దఎత్తున గాలింపుచర్యలు చేస్తున్నట్లు మాత్రం పోలీసులు అంగీకరించారు. నిజానికి ఆదివాసీలను మావోయిస్టులు హెచ్చరించకపోయుంటే మందుపాతరలు, బాంబులు అమర్చారన్న విషయం పోలీసులకు తెలిసేదికాదేమో. అంటే తమఉనికిని మావోయిస్టులు తామే బయటపెట్టుకున్నారు.
కాల్పులు నిలిపేయాలి
ఈవిషయం ఇలాగుంటే పౌరహక్కుల సంఘం నేత ప్రొఫెసర్ హరగోపాల్(Professor Haragopal ఒక వీడియోను విడుదలచేశారు. కర్రెగుట్టలను చుట్టుముట్టి భద్రతాదళాలు కాల్పులు జరుపుతున్నట్లు చెప్పారు. భద్రతాదళాలు వెంటనే కాల్పులను విరమించాలని కోరారు. ఓవైపు శాంతిచర్చల ప్రతిపాదన తెస్తునే మరోవైపు హత్యాకాండకు ప్రభుత్వాలు తెగబడటం దుర్మార్గమన్నారు. నిజానికి శాంతిచర్చలు ప్రభుత్వం నుండి రాలేదు. శాంతిచర్యలు జరపాలని పదేపదే మావోయిస్టుల అధికార ప్రతినిధి రూపేష్ విజ్ఞప్తిచేస్తున్నారు. హరగోపాల్ ఏమో శాంతిచర్చల ప్రతిపాదన ప్రభుత్వాల నుండే వచ్చినట్లు చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది.