రికార్డ్ డాన్సుల వివాదంలో ఇరుక్కున్న కేటీఆర్
x

రికార్డ్ డాన్సుల వివాదంలో ఇరుక్కున్న కేటీఆర్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వివాదంలో ఇరుక్కున్నారు.


బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వివాదంలో ఇరుక్కున్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలు బ్రేక్ డాన్సులు, రికార్డింగ్ డాన్సులు వేసుకోవచ్చు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. తెలంగాణ భవన్ లో స్టేషన్ ఘనపూర్ బీఆర్ఎస్ నాయకులతో కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వంపై, సీఎం రేవంత్ రెడ్డిపై ఆయన విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో మహిళలకు ఉచిత బస్సు పథకం అమలుపై ఆయన చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ నేతల ఆగ్రహానికి కారణమయ్యాయి.

ఇంతకీ ఆయన ఏమన్నారంటే...

"బస్సుల్లో అల్లం, వెల్లిపాయాలు గిల్లుకుంటే తప్పేముందని మంత్రి సీతక్క అంటున్నారు. అందుకే బస్సులు పెట్టరేమో మాకు తెలియదక్కా. బస్సుల్లో మహిళలు కొట్టుకుంటుంటే సీతక్కకి కనబడడం లేదా. ఒక్కో మనిషికి ఒక్కో బస్సు పెట్టండి. బస్సులు పెంచిన తర్వాత అవసరమైతే బ్రేక్ డాన్స్, రికార్డ్ డాన్స్ లు వేసుకోమనండి... మాకేంటి? అదనంగా బస్సులు పెంచాలని మేము డిమాండ్ చేస్తున్నాం" అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి.

సీతక్క ఫైర్...

అవసరమైతే బస్సుల్లో బ్రేక్ డాన్సులు, రికార్డ్ డాన్సులు చేసుకోండి అంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యల్ని మంత్రి సీతక్క తప్పుబట్టారు. మహిళలు పట్ల అసభ్యకర మాటలు మాట్లాడిన కేటీఆర్ తీరును ఖండిస్తున్నానని చెప్పారు. మహిళల పట్ల కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయన్నారు. మీ తండ్రి గారు మీకు నేర్పిన గౌరవం సంస్కారం ఇదేనా కేటీఆర్? మీ ఆడపడుచులు అంతా బ్రేక్ డాన్స్ లు చేస్తున్నారా? అంటూ నిలదీశారు. బేషరతుగా కేటీఆర్ తెలంగాణ మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలి అని సీతక్క డిమాండ్ చేశారు.

ఇంకా ఆమె ఏమన్నారంటే...

"ఆడవాళ్ళను కించపరిచే విధంగా బ్రేక్ డాన్సులు చేసుకోండి అనడం మీ బుర్రలో వున్న బురదకు నిదర్శనం. గత పది సంవత్సరాలు హైదరాబాద్లో క్లబ్బులు, పబ్బులు, బ్రేక్ డాన్సులు ఎంకరేజ్ చేసిన చరిత్ర మీది. మహిళలు ఆర్థికంగా ఎదగాలని మహిళల కోసం సంక్షేమ పథకాలను అమలుపరుస్తున్నాము. అందులో భాగంగా పేద మహిళలకు రవాణా భారాన్ని తగ్గించేందుకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేస్తున్నాం. శ్రమజీవులు, శ్రామిక మహిళలు ప్రయాణ సమయంలో సమయం వృధా చేయకుండా ఏదో పని చేసుకుంటే తప్పేంటి? ఇంటి వద్ద చేసుకునే చిన్నా చితక పనులు బస్సుల్లో చేసుకుంటే... వారిని బ్రేక్ డాన్స్ లు వేసుకోమనడం దుర్మార్గం. మహిళలు బ్రేక్ డాన్స్ లు చేసుకోండి అనే మాటలు నీ నోటికి ఎలా వచ్చాయి కేటీఆర్. కేటీఆర్ మాట్లాడిన మాటలు అత్యంత అసభ్యకరంగా ఉన్నాయి. తెలంగాణ మహిళలకు కేటీఆర్ క్షమాపణ చెప్పాలి, బీఆర్ఎస్ క్రమాపణ చెప్పాలి. ప్రజలకు ఉపయోగపడే పథకాలు మీకు నచ్చవు. ఉచిత బస్సు ప్రయాణ ఆలోచన మీకు రాలేదు.. పదేండ్లు మీరు చేయలేదు. మేము చేస్తే దాని మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఆర్టీసీలో ప్రయాణాలు చేసేవాళ్లు తప్పుడు పనులు చేస్తున్నారన్నట్టుగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. గుమ్మడికాయ దొంగలు అంటే కేటీఆర్ భుజాలు తడుముకోవడం ఎందుకు? కేటీఆర్ తక్షణమే మహిళలకు బహిరంగ క్షమాపణ చెప్పాలి" అని డిమాండ్ చేశారు సీతక్క.

Read More
Next Story