తిరువనంతపురంలో   సీనియర్ జర్నలిస్ట్ ల  సభ
x

తిరువనంతపురంలో సీనియర్ జర్నలిస్ట్ ల సభ

ఈ నెల 19 నుంచి 21 వరకు


దేశంలో మొదటిసారిగా సీనియర్ జర్నలిస్టుల జాతీయ మహాసభ ఆగస్టు 19 నుంచి 21, 2025 వరకు తిరువనంతపురంలో జరుగనుంది. పెన్షన్ పరంగా రాష్ట్రాల మధ్య ఉన్న అసమానతల దృష్ట్యా, అన్ని రాష్ట్రాల సీనియర్ జర్నలిస్టులకు సమానంగా జాతీయ పెన్షన్ పథకం కల్పించాలని, ఇప్పటివరకూ జర్నలిస్టులకు పెన్షన్ పథకం అమలు చేయని రాష్ట్రాలలో కూడా ఈ పథకం అమలు చేయాలని కేంద్రాన్ని కోరుతూ ఈ మహాసభలో తీర్మానం చేయనున్నారని హైదరాబాద్ కు చెందిన సీనియర్ జర్నలిస్ట్ నంది రాజు రాధాక్రిష్ణ తెలిపారు

ఈ మహాసభను సీనియర్ జర్నలిస్ట్స్ ఫోరం-కేరళ (SJFK) నిర్వహిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా శాఖలున్న ఈ సంఘం, జర్నలిస్టుల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఆర్థికంగా వెనుకబడిన వారికై వైద్య సహాయ నిధి, కుటుంబాల కోసం గ్రూప్ టూర్లు, అవార్డు పొందిన జర్నలిస్టులకు సత్కారం వంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. కేరళ ప్రభుత్వ నియమించిన జర్నలిస్టుల సంక్షేమ కమిటీల్లో కూడా SJFK సభ్యులకు ప్రాతినిధ్యం ఉంది.మహాసభలో పత్రికా రంగంలోని అన్ని విభాగాలవారిని పెన్షన్ పథకంలో చేర్చడం, జాతీయ ఆరోగ్య బీమా పథకం, రైల్వే కన్సెషన్ల పునరుద్ధరణ, పీఎఫ్ కనీస పెన్షన్ పెంపు తదితర అంశాలు చర్చించనున్నారు. జాతీయ స్థాయి కమిటీని కూడా ఎన్నుకోవాలని భావిస్తున్నారు.

ఈ సమావేశానికి 21 రాష్ట్రాల నుండి సుమారు 250 మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. ఆగస్టు 20న ముఖ్యమంత్రి పినరయి విజయన్ మహాసభను ప్రారంభిస్తారు. అదే రోజున జరగనున్న జాతీయ మీడియా సదస్సును ప్రముఖ మీడియా విశ్లేషకురాలు సెవంతి నినన్ ప్రారంభిస్తారు. ఆగస్టు 19న విద్యాశాఖ మంత్రి వి. శివన్‌కుట్టి పాల్గొనే సంఘీభావ సభ, భారత్ భవన్‌లో జరిగే అంతర్జాతీయ ఫోటో ప్రదర్శన ముఖ్యమైన కార్యక్రమాలు. ఆగస్టు 21న ప్రతినిధుల సమావేశాన్ని ప్రతిపక్ష నేత వీ.డి. సతీషన్ ప్రారంభిస్తారు. సాయంత్రం ముగింపు సమావేశంలో మిజోరం, గోవాల మాజీ గవర్నర్ పి.ఎస్. శ్రీధరన్ పిళ్లై ముఖ్య అతిథిగా పాల్గొంటారు.

Read More
Next Story