అమ్మచెట్టు జర్నలిస్టు లక్ష్మణరావు కన్నుమూత!
x
లక్ష్మణరావు

'అమ్మచెట్టు' జర్నలిస్టు లక్ష్మణరావు కన్నుమూత!

సీనియర్ జర్నలిస్టు, ‘మఫసిల్ స్పెషలిస్టు’గా పేరుగాంచిన టీకే లక్ష్మణరావు (70) ఇక లేరు.


తెలుగు పత్రికా రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక అధ్యాయాన్ని రాసుకున్న సీనియర్ జర్నలిస్టు, ‘మఫసిల్ స్పెషలిస్టు’గా పేరుగాంచిన టీకే లక్ష్మణరావు (70) ఇక లేరు. కొంతకాలంగా అస్వస్థతతో ఉన్న ఆయన, మంగళవారం (డిసెంబర్ 30) హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణం పట్ల జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాలు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాయి.

ప్రత్తిపాడు నుంచి ప్రస్థానం..

1954లో తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడులో లక్ష్మణరావు జన్మించారు. తండ్రి తెంపల్లి ఆంజనేయులు. గ్రేడ్ వన్ తెలుగు పండితులు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో ఇంటర్మీడియేట్, కాకినాడలో బీఏ చదివారు. పి.హెచ్.డి చేశారు. రాజకీయాలంటే విపరీతమైన ఇష్టం వల్ల రోజూ న్యూస్ పేపర్ చదివే అలవాటు ఉండేది. ఆ క్రమంలో 'ఉదయం'లో అవకాశం రావడంతో ఊహించని కల నిజమైపోయింది.

1984లో ప్రముఖ ఎడిటర్ ఏబీకే ప్రసాద్ సారథ్యంలో ‘ఉదయం’ పత్రికలో ట్రైనీ సబ్ ఎడిటర్‌గా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. సుమారు 38 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో ఉదయం, ఆంధ్రభూమి, వార్త, సాక్షి వంటి ప్రధాన దినపత్రికల్లో వివిధ కీలక బాధ్యతలు నిర్వహించారు. ఆయనకు సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి ప్రేరణ. వృత్తి జీవితంలో ఎన్నో ఎదురుదెబ్బలు తిన్నారు. మొత్తానికి నిలదొక్కుకుని ఉన్నత పదవులు పొందుతూ మెయిన్ స్ట్రీమ్ పత్రికల్లో 38 ఏళ్ల ప్రస్థానం సాగించారు. 'సాక్షి'లో అసిస్టెంట్ ఎడిటర్ గా రిటైరయ్యి గత పదేళ్లుగా విశ్రాంత జీవితం గడుపుతున్నారు.


గ్రామీణ విలేకరుల పక్షపాతిగా పేరుంది. పత్రికా వ్యవస్థకు గ్రామీణ విలేకరులే పునాదిరాళ్లని బలంగా నమ్మే ఆయన, వారి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ 'మఫసిల్ ఎడిటర్'గా ఎంతో గుర్తింపు పొందారు. "వార్త అబద్ధపు పొగడ్తలతో ఉండకూడదు.. వాస్తవానికి దగ్గరగా ఉండాలి.. ఎవరినీ నొప్పించకూడదు" అనే సూత్రాన్ని ఆయన త్రికరణ శుద్ధిగా పాటించారు. భాషలో పరుష పదజాలం పెరుగుతున్న నేటి జర్నలిజం పోకడల పట్ల ఆయన ఎప్పుడూ ఆందోళన వ్యక్తం చేసేవారు.

గ్రామీణ విలేఖరులు తెచ్చే వార్తలకు అద్భుతమైన శీర్షికలు పెట్టి ఎందరెందర్నో కదిలించారని గుర్తు చేసుకున్నారు మరో సీనియర్ జర్నలిస్టు, ది ఫెడరల్ అసిస్టెంట్ ఎడిటర్ జింకా నాగరాజు. కర్నూలులో ఓ తాగుబోతు తన భార్యను కిరాతకంగా హత్య చేస్తే ఓ ఆరేడు నెలల పసికూన అనాదగా మిలిగిపోతుంది. ఈ వార్తకు లక్ష్మణరావు పెట్టిన "అమ్మచెట్టు కూలింది, ఆదుకోండి" అనే శీర్షిక ఆనాటి కర్నూలు జిల్లా కలెక్టర్ రాజేశ్వర్ తివారీ సహా కొన్ని వందల మందిని కదలించిందని, అనాథగా మిగిలిన ఓ చిన్నారిని పెంచుకుంటామంటూ అనేక మంది వచ్చినా వాళ్ల అమ్మమ్మ తానే పెంచుతానని చెప్పడంలో వందలాది మంది సాయం చేసి ఆ పాప జీవితానికి ఆలంబనగా నిలిచారని గుర్తు చేసుకున్నారు నాగరాజు. ఇలా అనేకమంది ఆయన పెట్టిన శీర్షికలు తలుచుకుని నివాళులు అర్పించారు.

ఆయనకు భార్య, ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఆయన కుటుంబం నుండి మొత్తం ముగ్గురు జర్నలిస్టులుగా కొనసాగుతుండటం విశేషం. ఆయన సోదరుల్లో ఒకరైన వేణు ఇటీవలి వరకు సాక్షి అసిస్టెంట్ ఎడిటర్ గా పని చేశారు. లక్ష్మణరావు గారి అంత్యక్రియలు బుధవారం (డిసెంబర్ 31) గోపన్నపల్లిలోని జర్నలిస్టు కాలనీలో జరగనున్నాయి.

ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖ జర్నలిస్టులు, రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేస్తూ, తెలుగు పత్రికా రంగం ఒక గొప్ప మార్గదర్శిని కోల్పోయిందని కొనియాడారు. లక్ష్మణరావు కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపారు.

Read More
Next Story