పీసీసీపై పెరిగిపోతున్న ఉత్కంఠ..రేవంత్ ఛాయిస్ ఎవరో ?
x
senior leaders in pcc president race

పీసీసీపై పెరిగిపోతున్న ఉత్కంఠ..రేవంత్ ఛాయిస్ ఎవరో ?

పార్లమెంటు ఎన్నికలు అయిపోగానే తెలంగాణా కాంగ్రెస్ పార్టీలో మరో ఉత్కంఠభరితమైన వ్యవహారానికి తెరలేచింది. పీసీసీ అధ్యక్షుడిగా కొందరి పేర్లు చక్కర్లుకొడుతున్నాయి.


పార్లమెంటు ఎన్నికలు అయిపోగానే తెలంగాణా కాంగ్రెస్ పార్టీలో మరో ఉత్కంఠభరితమైన వ్యవహారానికి తెరలేచింది. అదేమిటంటే పీసీసీ అధ్యక్షుడిగా ఎవరుంటారు అనే విషయంలో కొంతమంది సీనియర్ నేతల పేర్లు చక్కర్లుకొడుతున్నాయి. కీలకమైన పార్లమెంటు ఎన్నికలు అయిపోయాయి కాబట్టి రేవంత్ రెడ్డి తన సమయాన్ని మొత్తం పరిపాలనపైనే దృష్టి నిలపాలని అనుకున్నారు. ఇప్పటివరకు అటు పీసీసీ అధ్యక్షుడిగాను ఇటు ముఖ్యమంత్రిగా రేవంత్ డబుల్ యాక్షన్ చేస్తున్న విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలిచి రేవంత్ ముఖ్యమంత్రయ్యారు. డిసెంబర్లో బాధ్యతలు తీసుకున్న రేవంత్ పార్లమెంటు ఎన్నికల కోసమని పీసీసీ అధ్యక్షుడిగా కూడా కంటిన్యు అయ్యారు. అయితే ఇపుడు పార్లమెంటు ఎన్నికలు అయిపోయాయి. కాబట్టి తొందరలోనే పీసీసీ అధ్యక్షపదవి నుండి రేవంత్ పక్కకు తప్పుకుంటారనే ప్రచారం పార్టీలో పెరిగిపోతోంది.

ఈ నేపధ్యంలో తొందరలో ఖాళీ అవబోతున్న పార్టీ అధ్యక్షపదవి కోసం కొందరు సీనియర్లు ప్రయత్నాలు మొదలుపెట్టారని సమాచారం. ప్రయత్నాలు చేసుకుంటున్నవారిలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వర్కింగ్ ప్రెసిడెంట్లు ఎంఎల్సీ బొమ్మా మహేష్ కుమార్ గౌడ్, మాజీ ఎంఎల్ఏ తూర్పు జయప్రకాష్ రెడ్డి(జగ్గారెడ్డి), మాజీ ఎంపీలు మదుయాష్కీ గౌడ్, అంజన్ కుమార్ యాదవ్, మంత్రి సీతక్క, మాజీ ఎంఎల్ఏ సంపత్ పేర్లు ప్రముఖంగా వినబడుతున్నాయి. పై నేతలకు సామాజికవర్గాలపరంగా కొంత ప్లస్సులు, మరికొన్ని మైనస్సులున్నాయి. అవేమిటంటే ముఖ్యమంత్రిగా రేవంత్ ఉన్నారు కాబట్టి మళ్ళీ రెడ్డి సామాజికవర్గానికి పీసీసీ అధ్యక్షపదవి ఇవ్వరనేది ఒక లాజిక్. ఈ లాజిక్ వినటానికి చాలా హేతుబద్దంగానే ఉంది. కాబట్టి జగ్గారెడ్డికి అవకాశాలు తక్కువనే చెప్పాలి. ఇక అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో బీసీలకు ఇవ్వాల్సినంత ప్రాధాన్యత ఇవ్వలేదనే ఆరోపణలు అందరికీ తెలిసిందే. కాబట్టి పీసీసీ అధ్యక్షపదవి బీసీ సామాజికవర్గానికి దక్కే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. దీని ప్రకారంచూస్తే మహేష్ కుమార్ గౌడ్, మదుయాష్కి, అంజన్ కుమార్ కు ఛాన్సుంది.

అయితే వీరిలో కూడా మహేష్ కుమార్ కే ఎక్కువ అవకాశాలున్నాయని సమాచారం. ఎందుకంటే రేవంత్ కు అత్యంత సన్నిహితుడు, నమ్మకస్తుడు మహేష్ అని పార్టీవర్గాలు చెబుతున్నాయి. అలాగే ఎస్సీలకు ఇవ్వాలంటే ఉపముఖ్యమంత్రి పదవి భట్టి(మాల)కి కూడా అవకాశం ఉందట. ఎలాగంటే కర్నాటకలో పీసీసీ అధ్యక్షుడిగా, ఉపముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ఉన్న విషయం తెలిసిందే. అదేపద్దతిలో ఉపముఖ్యమంత్రిగా ఉంటూనే, పీసీసీ అధ్యక్షుడిగా కూడా కంటిన్యు అయ్యేందుకు అవకాశం ఇవ్వమని భట్టి ఇప్పటికే రాహుల్ గాంధిని అడిగారనే ప్రచారం జరుగుతోంది. భట్టీకి రాహుల్, ప్రియాంకతో సన్నిహిత సంబంధాలున్న విషయం తెలిసిందే. అయితే భట్టీకి పోటీగా మరో ఎస్సీ(మాదిగ) మాజీ ఎంఎల్ఏ సంపత్ కూడా ప్రయత్నాలు చేసుకుంటున్నారు. మొన్నటి పార్లమెంటు ఎన్నికల్లో మాదిగలకు ఒక్క సీటు కూడా ఇవ్వలేదు కాబట్టి ఇపుడు పీసీసీ అధ్యక్షుడి పదవైనా ఎస్సీల్లోని మాదిగలకు ఇవ్వాలని సంపత్ పట్టుబడుతున్నారు.

ఇదే సమయంలో మరో ప్రచారం కూడా ఊపందుకుంటోంది. అదేమిటంటే మహిళకు పీసీసీ అధ్యక్షపదవి ఇస్తే బాగుంటుందని. ఇప్పటివరకు పీసీసీ అధ్యక్షపదవిలో మహిళను నియమించలేదు. ఇపుడా పోస్టులో మంత్రి దనసరి అనసూయ(సీతక్క) పేరు పరిశీలనలో ఉందని సమాచారం. సీతక్కకు రేవంత్ ఆశీస్సులు పుష్కలంగా ఉంటాయి. సీతక్కను నియమిస్తే మహిళను నియమించినట్లు అందులోను ట్రైబల్ లీడర్ కు పెద్దపీఠ వేసినట్లుంటుందని కర్నాటకనేత డీకే శివకుమార్ అధిష్టానానికి సీతక్క పేరును ప్రతిపాదించినట్లు ప్రచారం జరుగుతోంది. అసలు రేవంత్ పీసీసీని వదులుకుంటారా ? అన్నది కీలకం. పార్లమెంటు ఎన్నికల్లో పార్టీ మెజారిటి సీట్లు సాధిస్తే అధిష్టానం దగ్గర రేవంత్ పలుకుబడి ఓ రేంజిలో పెరిగిపోతుందనటంలో సందేహంలేదు. రేవంత్ గనుక పీసీసీని వదులుకుంటే అప్పుడు రేసు మరింత జోరందుకుంటందనటంలో సందేహంలేదు. అప్పటివరకు ఈ ఉత్కంఠ పెరిగిపోతునే ఉంటుంది.

Read More
Next Story