సెప్టెంబర్ 17 దగ్గరబడుతూ ఉంది...ఈ ఫోటోకి అర్థం దొరకడం లేదు?
x

సెప్టెంబర్ 17 దగ్గరబడుతూ ఉంది...ఈ ఫోటోకి అర్థం దొరకడం లేదు?

తెలంగాణ చరిత్రకు భాష్యంచెబుతున్నాారా, వక్ర భాష్యం అల్లుతున్నారా?


తెలంగాణ చరిత్రకు వక్ర భాష్యాలేల ?



-రమణాచారి


ప్రజలు తమ చరిత్రను తాము రాసుకోలేకపోతే, దోపిడీ దారుడిచే వ్రాయించబడిందే చరిత్ర అవుతుంది. సెప్టెంబర్ 17 తెలంగాణ చరిత్రలో ప్రాధాన్యత కలిగిన రోజు మాత్రమే కాదు ఇప్పటికీ చర్చనీయాంశంగానే మిగిలిన రోజు. 1948 సెప్టెంబర్ 17ను తెలంగాణకు విమోచన దినోత్సవం అని, భారత్ లో విలీనమైన రోజని, తెలంగాణ ప్రజలకు విద్రోహం జరిగిన రోజు అనే చర్చ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ చారిత్రాత్మక దినాన్నితమ పార్టీ త్యాగాల ఖాతాలో వేసుకునేందుకు రాజకీయ పార్టీలు పోటీ పడుతున్నాయి. వాస్తవంగా జరిగింది ఏమిటి? వివరించి చెప్పాల్సిన సమయమిది.

కూలీరేట్ల పెంపుదల కోసం మొదలైన ఉద్యమం, వెట్టి చాకిరీ నుంచి విముక్తి గా కొనసాగి దున్నేవానికి భూమి నినాదంగా దొరల భూముల అక్రమణ వరకు కొనసాగింది. ఈ క్రమంలో సంగం పెట్టుకునే హక్కు, సమావేశాలు నిర్వహించుకునే ప్రజాస్వామిక ఆకాంక్షలు ఉద్యమంలో భాగమయ్యాయి. జాగిర్దార్, జమిందార్ల ఆగడాలు పెరగడంతో తిరుగుబాటుకు శ్రీకారం చుట్టి నట్లు అయింది. ప్రజల తిరుగుబాటును అణచివేసేందుకు ఏర్పడిన నిజం ప్రైవేట్ సైన్యం రజాకార్ల రంగప్రవేశంతో రైతాంగ సాయుధ పోరాటానికి బీజాలు పడ్డాయి. దురాక్రమణకు గురైన తన భూమిని కోర్టు తీర్పు ద్వారా సాధించుకున్న బందగీని దొరల గుండాలు హతమార్చారు. కమ్యూనిస్టు పార్టీ ఏర్పాటుచేసిన సమావేశాలకు వెళుతున్న ప్రజలపై విస్నూర్ దేశముఖ్( రజాకార్ సైన్యానికి కార్యదర్శి) గుండాలు కాల్పులు జరపడంతో దొడ్డి కొమరయ్య అమరుడయ్యాడు. 4 జులై 1946 నుండి మొదలైన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం దొరల గడీలపై దాడులు చేయడానికి, పంటలను స్వాధీనపరచుకోవడానికి ఈ ఘటన అంకురార్పణ జరిగింది.

తెలంగాణ అంతటా రైతాంగం సాయుధ తిరుగుబాటు చేసి దొరల పెత్తనాన్ని సవాల్ చేశారు. 10 లక్షల పైచిలుకు భూములను ప్రజలు స్వాధీనం చేసుకున్నారు.దొరల గడీల పై దాడులు నిత్య కృత్యమయ్యాయి.తోక ముడిచిన దొరలు కొంతమంది పట్నం బాట పట్టారు. రజాకార్ల ఆగడాలు మిన్నంటాయి. బైరాన్ పల్లి,గుండ్రామ్ పల్లి లలో వందలాది మంది ప్రజలను రజాకార్లు కిరాతకంగా హత్య చేశారు. అనేక గ్రామాలలో అమాయక ప్రజలను పదుల సంఖ్యలో హత్య చేశారు. కమ్యూనిస్టు సాయుధ దళాలపై దాడులు జరిపారు. గ్రామాలపై పడి మహిళలపై అత్యాచారం చేశారు. యువకులు, వృద్ధులు అనే తేడా లేకుండా చిత్రహింసలకు గురిచేసి చంపారు. కానీ ప్రజల పూర్తి సహకారం, భాగస్వామ్యంతో జరిపిన సాయుధ పోరాటంతో హైదరాబాద్ రాష్ట్రంలో కమ్యూనిస్టులు ఆదిపత్యం పెరిగింది. నిజాం కు, దొరలకు ముచ్చమటలు పట్టించారు.

1947 దేశ స్వాతంత్ర ప్రకటన రావడంతో సంస్థానాలను దేశంలో విలీనం చేయాలనే ప్రతిపాదన ముందుకు వచ్చింది. దీనితో నిజాం సంస్థానం( హైదరాబాద్ సంస్థానం -- తెలుగు మాట్లాడే తొమ్మిది జిల్లాలలే కాకుండా మరాఠీ, కన్నడ భాషలు మాట్లాడే మొత్తం 15 జిల్లాలతో కూడిన రాష్ట్రం ) స్వాధీనానికి ప్రభుత్వం నడుం కట్టింది. అప్పటికే భయాందోళనలో ఉన్న నిజాం ప్రభువు బెట్టు చేయడంతో పోలీస్ చర్య ( మిలటరీ చర్య ) అనివార్యమైంది. సెప్టెంబర్ 17, 1948 న దేశ హోం శాఖ మంత్రి వల్లభాయ్ పటేల్ తో రాజీ పడి ఏడవ నిజాం తన అభిప్రాయాన్ని మార్చుకున్నాడు. దీనినే రాజకీయ పార్టీలు రకాలుగా వ్యాఖ్యానించడం పరిపాటి అయ్యింది.



సెప్టెంబర్ 17, 1948 తెలంగాణ భారతదేశంలో విలీనమైనట్లు కనిపించినా,అది అసంపూర్ణమే. నిజాం ప్రభువుకు గౌరవమే దక్కింది. ఆయనకు ఎలాంటి శిక్ష విధించబడలేదు. ఆయన అరాచకాలు కూడా కొనసాగాయి.విమోచనం జరిగింది, అనుకుంటే నిజాం ఇక్కడి నుండి పారిపోవాలి లేదంటే అతని అధికారాలు, ఆస్తులు జప్తు చేయ బడాలి. చేసిన దుర్మార్గాలకుగాను శిక్ష అనుభవించాలి. అలాంటివేమి జరగలేదు. భారత ప్రభుత్వానికి నిజాంకు మధ్య యథాస్థితి కొనసాగించే ఒప్పందం మాత్రమే కుదిరింది. సర్ఫె కాస్ భూములు ఆయన ఆధీనంలోనే ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా పేరుందిన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ( ఏడవ నిజాం నవాబు) ప్రజలను పీడించి కూడ బెట్టిన బంగారం, నగలు, వజ్రాలు ఇతర దేశాలకు స్వేచ్ఛగా తరలింపబడ్డాయి. అంతేకాదు 1850 జనవరి నుండి 1956 అక్టోబర్ వరకు రాజ్ పాల్ గా రాజభవన్ లోనే ఉండి అధికార్పం చలాయించారు. వందలాది మహిళలను చెరపట్టారు. పిన్న వయసు ( మైనర్ ) బాల బాలికలను సేవకులుగా ఉపయోగించుకున్నారు.


ఈ విషయాన్ని ఆర్య సమాజ్ న్యాయవాది పి. జి. కేస్కర్ కోర్టుకు వివరించి విడుదలకు ప్రయత్నం చేశారు. ఆపరేషన్ పోలో తర్వాత సంవత్సరానికి 50 లక్షలు రాజా భరణంగా నిజాం కు చెల్లించారు . వీటికి పన్నులుమినహాయింపుఇచ్చారు. 1971లో నాటి ప్రధాని ఇందిరాగాంధీ రాజాభరణాలు రద్దు చేసే వరకు భారత ప్రభుత్వం నిజo నవాబుకు చెల్లించింది. ఇది కేవలం హైదరాబాద్ సంస్థానానికి మాత్రమే పరిమితం కాలేదు. దేశంలోని 560 సంస్థానాలలో ఇదే జరిగింది. ఇప్పుడు చెప్పండి. జరిగింది విలీనమా? విమోచనా? గ్రామాలలో 1948 నాటికి ప్రజలు తిరుగుబాటు పెరిగి, కమ్యూనిస్టు పార్టీ బలపడడం భారత ప్రభుత్వం గమనించింది. దీనికి తోడు దున్నే వాడిదేభూమి ప్రాతిపదికగా 10 లక్షల ఎకరాలు ప్రజల స్వాధీనం అయ్యింది. 3000 గ్రామాలలో గ్రామ రాజ్య కమిటీలు ఏర్పడ్డాయి. దీనిని ప్రమాదంగా భావించిన భారత ప్రభుత్వం (కాంగ్రెస్ పాలకులు) నిజాంతో ఒప్పందం కుదుర్చుకున్నారు. అంతకు మించి విలీనం జరగలేదు. విమోచన అంతకంటే జరగలేదు.

సెప్టెంబర్ 17,1948 లో జరిగింది ముమ్మాటికి ప్రజా విద్రోహమే. సుదీర్ఘకాలం పోరాడి, రక్త తర్పణం చేసి ప్రజలు సాధించుకున్న హక్కులని కోల్పోయారు. స్వాధీన పరచుకున్న భూమి మళ్లీ దొరల పాలయ్యింది. రూమీ టోపీల తో గ్రామాలను వదిలి హైదరాబాద్ చేరిన దొరలు ఖద్దరు టోపీలతో వచ్చి గ్రామాలపై పెత్తనం కొనసాగించారు. ప్రజా విముక్తి కోసం ఏర్పడ్డ సంఘాలు తీవ్రనిర్భoధాన్ని ఎదుర్కొన్నాయి. కమ్యూనిస్టు పార్టీ దళాలు భారత సైన్యం తుపాకులకు బలయ్యాయి. నిజాంపై తిరుగుబాటు చేసిన సుమారు నాలుగువేల మంది కిరాతకంగా హత్య చేయబడ్డారు. పౌర ప్రజాస్వామిక హక్కులు అడుగంటాయి. హైదరాబాద్ సంస్థానంలో నిజాం, దొరలు, రజాకార్లు చేసిన దురాగతాలపై ఎలాంటి విచారణలు జరగలేదు., ఎలాంటి శిక్షలు విధించబడలేదు. నిజాంపై తిరుగుబాటు చేసి అక్రమ నిర్బంధంలో ఉన్న కవులు, రచయిత లు,ఉద్యమకారులను విడుదల చేయలేదు. ఇవన్నీ ప్రజా విద్రోహ చర్యలే కదా. అందుకే తెలంగాణకు జరిగింది ముమ్మాటికి విద్రోహమని నినదించక తప్పదు.

సెప్టెంబర్ 17ను విమోచన దినంగా గుర్తించి ప్రభుత్వమే నిర్వహించాలని ప్రతిపాదనలు కూడా వస్తున్నాయి. దీనికోసం ఈ ఉద్యమంతో ఏ సంబంధం లేని రాజకీయ పార్టీలు హడావిడి చేయడం ఆశ్చర్యం గొలిపే విషయం. నిజాంతో ఒప్పందం చేసుకున్న కేంద్రo లోని జాతీయ ప్రభుత్వం సెప్టెంబర్ 17ను కూడా ద్రోహంలో భాగస్వామనే చెప్పాలి. బిజెపి, టిడిపి, టిఆర్ఎస్ ల విషయానికి వస్తే ఆఉద్యమ సమయానికి ఈ పార్టీల మనుగడలోనే లేవు. ఈ పార్టీల ఆర్భాటమే మరీ ఎక్కువగా ఉంది.పీడితప్రజల విముక్తి కోసం పోరాడి, ప్రాణాలర్పించిన కమ్యూనిస్టుల పాత్రను కనుమరుచేసే కుట్రలు జరుగుతున్నాయి. వాస్తవ చరిత్రను వక్రీకరించి, వక్ర భాష్యాలు చెప్పి నేటి తరం తెలంగాణ ప్రజల మనసులను కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నాయి. చరిత్రను ఎప్పుడూ వాస్తవిక దృష్టి తోనే చూడాలే తప్ప, తమదైన దృష్టితో చూడరాదు.

ప్రస్తుత పరిస్థితి కూడా కొంత మార్పుతో నాటి కాలాన్నే తలపింప చేస్తున్నది . సెజ్ ల పేరుతో, ఫిల్మ్ సిటీల పేరుతో, ఫాo హౌజ్ లు ఇలా పలు రకాల పేర్లతో వ్యవసాయ భూములను కార్పొరేట్ శక్తుల పరమవుతున్నాయి. ధరణి లో పలు ప్రభుత్వ భూములను తమ స్వంతం చేసుకున్నారు. దేవుని మాన్యాలు అన్యాక్రాంతం అయ్యాయి. చెరువులను, నాలాలను ఆక్రమించారు. వండలాది ఎకరాల ప్రభుత్వ భూమి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కోట్లు సంపాదించి పెట్టాయి. కొండలు, గుట్టలు, ఇసుక, సున్నపురాయి, బొగ్గు, అడవులు, ఎర్ర మట్టిగుట్టలు ఒకటేమిటి సమస్తం మాఫియా చేత కొల్లగొట్ట బడుతున్నాయి. ప్రాజెక్టుల నిర్మాణంలో, ఖనిజాల తవ్వకాలతో ఆదివాసులు, దళితులు, బహుజనులు నిర్వాసితులు అవుతున్నారు. భూమి సమస్య అలాగే మిగిలింది. ప్రశ్నించే గొంతుకను వేధించే చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. అభివృద్ధి పేరుతో జరుగుతున్న విధ్వంసాన్ని అడ్డుకోవడం, జీవించే హక్కు రక్షణ కోసం పోరాడటం బుద్ధి జీవుల ప్రస్తుత కర్తవ్యం కావాలి. సమాజం లోని అన్ని వర్గాల ప్రజలు ఒక్కటై ,నాటి పోరాట స్ఫూర్తి తో ఉద్యమిస్తేనే ప్రజల ప్రజా స్వామిక ఆకాంక్షలను నెరవేర్చుకోవడం సాధ్యమౌతుంది.

(ఇందులో వ్యక్తీకరించినవన్నీ రచయిత సొంత అభిప్రాయాలు. ఫెడరల్-తెలంగాణ భిన్నాభిప్రాయ వ్యక్తీకరణకు ఒక వేదిక గా పనిచేస్తుంది)
Read More
Next Story