
అట్ల కాడతో చిన్నారికి వాతలు
హైదరాబాద్ ఫిల్మ్ నగర్ లో ఏడేళ్ల బాలుడిపై దాష్టీకం
విద్యాబుద్దులు నేర్పి మంచి సంస్కారం నేర్పాల్సిన టీచర్లు విద్యార్థులను అనాగరికంగా శిక్షిస్తున్నారు. హైదరాబాద్ ఫిల్మ్ నగర్ లో చోటు చేసుకున్న ఈ ఘటన కలకలం రేపింది. ఓ చిన్నారిపై ట్యూషన్ టీచర్ దాష్టీకానికి పాల్పడింది. అట్లకాడతో వాతలు పెట్టడంతో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్ పీఎస్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం షేక్‌పేటలోని ఓయూ కాలనీకి చెందిన ఏడేళ్ల బాలుడు ఒకటో తరగతి చదువుతున్నాడు. తల్లిదండ్రులు గురువారం సాయంత్రం స్థానికంగా ఉన్న మానస అనే టీచర్ వద్దకు ట్యూషన్‌కు పంపించారు.
సరిగా చదవడం లేదనే కారణంతో టీచర్ ఆ బాలుడి పట్ల క్రూరంగా ప్రవర్తించింది. చేతులు, కాళ్లు, ముఖంపై అట్లకాడతో వాతలు పెట్టింది. చిన్నారి శరీరంపై 8 చోట్ల కాలిన గాయాలయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఫిల్మ్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలుడిని వైద్య పరీక్షల నిమిత్తం గోల్కొండ ఏరియా ఆస్పత్రికి పోలీసులు తరలించారు. గాయాల వల్ల బాలుడు నడవలేకపోతున్నాడు. తమ కుమారుడిపై దాష్టీకానికి పాల్పడిన మానసపై కఠిన చర్యలు తీసుకోవాలని అతడి తల్లిదండ్రులు కోరుతున్నారు.
జన్మనిచ్చిన తల్లిదండ్రుల తర్వాత స్థానం ఉపాధ్యాయులదే. చదువుల పేరుతో కొందరు టీచర్లు పిల్లల పట్ల క్రూరంగా వ్యవహరిస్తున్న ఘటనలు ఇటీవల కాలంలో పెరిగిపోతున్నాయి. కొన్ని ఘటనల్లో టీచర్లకు శిక్షలు పడుతున్నా మరికొందరు టీచర్ల వైఖరిలో మార్పులు రావటంలేదు. ఉపాధ్యాయులు విద్యార్థినుల పట్ల అసభ్య ప్రవర్తనతో జైలుకెళ్లిన సంఘటనలు కూడా తెలిసిందే. ఇలాంటి ఘటనలు ప్రస్తుతం కలకలం రేపుతున్నాయి. బాగా పాఠాలు చెబుతు పిల్పలలని ప్రేమగా చూసుకునే టీచర్లు చాలామందే ఉన్నారు. అలాంటి టీచర్లను విద్యార్ధులే కాదు స్కూలు లేదా యావత్ గ్రామం భుజాలపైన మోసిన ఘటనలు కూడా మనకు తెలుసు.

