గల్ఫ్ ఎడారిలో గొర్రెల కాపరి గోస
x
ఓమాన్ దేశంలో చిక్కుకున్న నాన్నను రక్షించాలని కోరుతూ సీఎం ప్రవాసీ ప్రజావాణిని ఆశ్రయించిన కుమార్తె తేజ శ్రీ

గల్ఫ్ ఎడారిలో గొర్రెల కాపరి గోస

ఓమాన్ దేశంలో చిక్కుకున్న నాన్నను రక్షించాలని కోరుతూ సీఎం ప్రవాసీ ప్రజావాణిని ఆశ్రయించిన కుమార్తె ...


తన భార్య పిల్లలకు మంచి జీవితాన్ని ఇవ్వాలనే ఆశతో 2025 ఆగస్ట్ 20వతేదీన హైదరాబాద్ టు మస్కట్ విమానం ఎక్కిన నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం సిద్దపల్లి - బెజ్జోర గ్రామానికి చెందిన బోజ సురేష్ (42) ఆశలు అడియాసలయ్యాయి.ఈయన ఓమాన్ దేశంలో గొర్రెల కాపరిగా గోస పడుతున్నాడు. 'క్లీనర్' పని అని చెప్పి మెడికల్ చేయించిన ఏజెంట్, 'అగ్రికల్చరల్ వర్కర్' అనే వీసాతో ఓమాన్ దేశానికి పంపించారు. నెలకు 120 రియాళ్ళ జీతం, ఉచిత భోజనం అని ఏజెంట్ చెప్పాడని, వాస్తవం ఇందుకు భిన్నంగా ఉందని ఆయన వాపోతున్నారు.



నన్ను ఇండియాకు పంపండి
ఓమాన్ దేశ రాజధాని మస్కట్ కు 250 కిలోమీటర్ల దూరంలోని 'యాంకుల్' అనే పట్టణం సమీపంలోని ఒక గ్రామంలోని వ్యవసాయ క్షేత్రంలో బోజ సురేష్ గొర్రెల కాపరిగా పనిచేస్తున్నాడు. రెండు గంటలకు ఒకసారి గడ్డి కోయడం, విపరీతమైన పనిఒత్తిడి, ఎడారి వాతావరణం తట్టుకోలేక పోతున్నానని సురేష్ వాపోయాడు. ఇటీవల తన తల్లి చనిపోయిందని, భార్య అనారోగ్యంతో ఉందని, తనను ఎలాగైనా ఇండియాకు వాపస్ పంపాలని కోరుతున్నాడు.



మా నాన్నను స్వదేశానికి తీసుకురండి

సహాయం కోసం సురేష్ కూతురు తేజశ్రీ శుక్రవారం (17.10.2025) హైదరాబాద్ లోని 'సీఎం ప్రవాసీ ప్రజావాణి' లో ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి, ఎన్నారై అడ్వయిజరీ కమిటీ వైస్ ఛైర్మన్ మంద భీంరెడ్డి పేరిట ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. రూ.90 వేలు తీసుకుని ఒకపని అని చెప్పి, మరో పనిపై పంపిన ఎజెంట్ పై తగిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. తన తండ్రి బోజ సురేష్ ను ఓమాన్ ఎడారి నుంచి రక్షించి స్వదేశానికి తీసుకురావాలని ఆమె విన్నవించారు. ఎమిగ్రంట్స్ వెల్ఫేర్ ఫోరం ప్రధాన కార్యదర్శి బిఎల్ సురేంద్రనాథ్, ప్రజావాణి సిబ్బంది జగదీశ్ పటేల్, 'టాంకాం' ప్రతినిధి పవన్ ఆమెకు మార్గదర్శనం చేసి, భరోసా ఇచ్చారు.


Read More
Next Story