Shibu Soren | శిబు సోరెన్‌ మరణంపై కేసీఆర్ సంతాపం
x

Shibu Soren | శిబు సోరెన్‌ మరణంపై కేసీఆర్ సంతాపం

ఝార్ఖండ్ సీఎం హెమంత్ సోరెన్‌ను పరామర్శించిన కేసీఆర్.


ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత సీఎం హేమంత్ సోరెన్ తండ్రి శిబు సోరెన్ సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా ఆయన తీవ్ర అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఆయన ఢిల్లీలోని గంగారం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మరణించారు. ఆయన మరణంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సహా ఇతర నేతలు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగానే శిబు సోరెన్‌తో తనకున్న ఆత్మీయ అనుబంధాన్ని బీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. శిబు మరణం తనను ఎంతగానో కలచివేసిందని తెలిపారు. ఆయన మరణంపై ప్రగాఢ సంతాపం తెలిపారు.

14ఏళ్ల ఉద్యమంలో ఎనలేని సాకారం: కేసీఆర్

‘‘జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి శిబూ సోరెన్ కుమారుడు, ప్రస్తుత సీఎం హేమంత్ సోరెన్‌ను కేసీఆర్ ఫోన్‌లో పరామర్శించారు. తెలంగాణ ఉద్యమ సందర్భంగా శిబూ సోరెన్‌తో తనకున్న ఆత్మీయ అనుబంధాన్ని కేసీఆర్ పంచుకున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన మలిదశ ఉద్యమానికి శిబూ సోరెన్ అందించిన అపూర్వ సహకారాన్ని ఎప్పటికీ మరిచిపోలేను. స్వరాష్ట్ర కల సాకారమయ్యే వరకూ అడుగడుగునా అండగా నిలిచారు’’ అని ఆనాటి జ్ఞాపకాలను కేసీఆర్ పంచుకున్నారు. ఈ సందర్భంగానే హేమంత్ సోరెన్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

మడమ తిప్పని యోధుడు: రేవంత్

జార్ఖండ్ ప్ర‌త్యేక రాష్ట్ర సాధ‌న‌లోనూ... గిరిజ‌న స‌మ‌స్య‌ల ప‌రిష్కారంలోనూ మ‌డ‌మ తిప్ప‌ని పోరాటం చేసిన యోధుడు గురూజీ శిబు సోరెన్ అని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి కొనియాడారు. జార్ఖండ్ మాజీ ముఖ్య‌మంత్రి శిబుసోరెన్ మృతిపై ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి సంతాపం వ్య‌క్తం చేశారు. వ‌డ్డీ వ్యాపారుల ఆగ‌డాలు, మాద‌క ద్ర‌వ్యాల వ్య‌తిరేక పోరులోనూ శిబు సోరెన్ త‌న‌దైన ముద్ర వేశార‌ని ముఖ్య‌మంత్రి పేర్కొన్నారు. చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు శిబుసోరెన్ ఎప్పుడూ మ‌ద్ద‌తు తెలిపేవార‌ని. తెలంగాణ ప్ర‌త్యేక రాష్ట్ర ఉద్య‌మానికి సైతం చివ‌రి వ‌ర‌కు ఆయ‌న మ‌ద్దతుదారుగా నిలిచిన విష‌యాన్ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఆదివాసీ స‌మాజానికి గురూజీ చేసిన సేవ‌లు చ‌రిత్ర‌లో శాశ్వతంగా నిలిచిపోతాయ‌ని సీఎం తెలిపారు. ఎనిమిది సార్లు లోక్‌స‌భ ఎంపీగా, రెండు సార్లు రాజ్య‌స‌భ స‌భ్యునిగా, జార్ఞండ్ ముఖ్య‌మంత్రిగా ఎన‌లేని సేవ‌లు అందించార‌ని సీఎం తెలిపారు. శిబు సోరెన్ కుమారుడు, జార్ఞండ్ ముఖ్య‌మంత్రి హేమంత్ సోరెన్‌, ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి సానుభూతి తెలియ‌జేశారు.

మహోన్నత వ్యక్తి: కేటీఆర్

‘‘భారత రాజకీయాల్లో శిబు సోరెన్ ఒక మహోన్నత వ్యక్తి. గిరిజన హక్కులు, ప్రాంతీయ స్వయం నిర్ణయాధికారం కోసం ఆయన అవిశ్రాంతంగా పోరాడారు. ఆయన మరణం తీవ్ర బాధను కలిగించింది. ఆయన మరణం కేవలం వ్యక్తిగత నష్టం కాదు. న్యాయం, గౌరవం, గుర్తింపు పట్ల అచంచలమైన నిబద్ధతతో ఏర్పడిన ఒక శకానికి ముగింపు. తెలంగాణ ఉద్యమం అల్లకల్లోలంగా ఉన్న రోజుల్లో తమకు ఆయన తోడుగా నిలిచారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో ఆయనకు ఉన్న అనుబంధం, తెలంగాణకు ఆయన ఇచ్చిన సంఘీభావం కీలకమైన సమయంలో మాకు ఎంతో బలాన్ని ఇచ్చాయి. తెలంగాణ ఆత్మను అర్థం చేసుకున్న వ్యక్తిగా శిబు సోరెన్ నిలిచారు. తెలంగాణ ప్రజలు, బీఆర్ఎస్ కుటుంబం తరపున హేమంత్ సోరెన్, వారి కుటుంబ సభ్యులకు హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేస్తున్నా’’ అని కేటీఆర్ ఎక్స్(ట్విట్టర్) వేదికగా పోస్ట్ పెట్టారు. కాగా ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ జాతీయ నేతలు సహా తెలంగాణ మంత్రులు, ప్రతిపక్ష నేతలు కూడా తమ సంతాపం తెలిపారు.

Read More
Next Story