
రేవంత్ ఏపీ జల దోపిడీకి సహకరిస్తున్నారు: హరీశ్ రావు
బనకచర్ల ద్వారా గోదావరి నీరు తీసుకుంటే తెలంగాణ కు వాటా యివ్వాల్సి వస్తుందనే నల్లమలసాగర్ కు మార్చారు
గోదావరి బనకచర్ల ప్రాజెక్టును అపామని తెలంగాణ ముఖ్యమంత్రి, నీటి పారుదల శాఖ మంత్రి గొప్పలు చెప్పుకుంటుంటే ఆంధ్ర నల్లమలసాగర్ ద్వారా గోదావరి జల దోపిడీకి తెరలేపిందని మాజీ మంత్రి బిఆర్ఎస్ నాయకుడు హరీశ్ రావు రాష్ట్ర ప్రభుత్వం పై ధ్వజమెత్తారు. బనకచర్ల నుంచి కాక నల్లమలసాగర్ నుండి నీరు తీసుకోవటం ద్వారా కృష్ణ నీటిలో తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక కృష్ణ నీటిలో వాటా కొరకుండా ఏపీ జాగ్రత్త పడుతోందని ఆయన అన్నారు.
పేరు మారినా ఆంధ్ర జల దోపిడీని బనకచర్ల పై కేంద్రం పెట్టిన మీటింగ్ కు హాజరు అయ్యి సంతకం చేయటం ద్వారా రేవంత్ రెడ్డి సుగమం చేస్తున్నారని తెలంగాణ భవన్ లో పెట్టిన ప్రెస్ మీట్ లో హరీష్ ఆరోపించారు.
“నల్లమలసాగర్ అక్రమ నిర్మాణానికి సూత్రధారి చంద్రబాబు అయితే పాత్ర దారి రేవంత్ రెడ్డి. కత్తి చంద్రబాబుది అయినా పొడిచే వాడు రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రినా లేక చంద్రబాబుకు గురుదక్షిణ చెల్లిస్తున్నడా? మేము బనకచర్ల విషయంలో పోరాటం చేసి నిలదీస్తే పాత డేట్లు వేసి ఉత్తం కుమార్ రెడ్డి లెటర్లు విడుదల చేసిండు,” అని ఆయన ప్రశ్నించారు.
బనకచర్ల ప్రాజెక్టు పై కేంద్రం పెట్టిన మీటింగ్ కు హాజరు అయిన ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి సంతకం చేసి చేయలేదని బుకాయించాడు. ఏపీ ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు ఆయన బండారం బయట పెట్టారు. ప్రాజెక్టు సుసాధ్యం చేసేందుకు కమిటీ ఏర్పాటు అయ్యిందని కూడా చెప్పారని హరీష్ గుర్తు చేశారు.
డిసెంబర్ 15 న ఆంధ్ర కమిటీ వేస్తే, డిసెంబర్ 23 నాడు రేవంత్ కమిటీ వేశాడు. కమిటీ లో తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకోవడానికి ఏపీ ప్రభుత్వ పక్షాన 100కి పైగా లేఖలు రాసిన, చంద్రబాబు సూచించిన ఆదిత్యానాథ్ దాస్ ఆధ్వర్యం లో కమిటీ వేశాడు. రాయలసీమ ఎత్తిపోతల పనులను ఏపీ వేగంగా పూర్తి చేసేందుకు తోడ్పాడు అందించింది ఇదే ఆదిత్యానాథ్ దాస్. పోలవరం నుంచి బనకచర్లలో కలపకుండా, పోలవరం నల్లమల సాగర్ కు లింకు చేసారు, అని చెప్పారు.
గోదావరి నీళ్లు కృష్ణా ద్వారా తరలిస్తే, బచావత్ అవార్డు ప్రకారం 45:21:14 తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రకు కృష్ణాలో నీటి వాటా ఇవ్వాల్సి ఉంటుంది. పోలవరం బనకచర్ల ప్రాజెక్టు విషయంలో ఈ రూల్ వర్తిస్తుంది. ఈ విధంగా కూడా తెలంగాణకు నీటి వాటా దక్కకుండా ఉండేందుకు కృష్ణాలో కలుపకుండానే, పెన్నా బేసిన్ కు గోదావరి నీటిని తరలించే ఆంధ్ర కుట్రకు రేవంత్ రెడ్డి సహకరించాడని, మాజీ నీటి పారుదల శాఖ మంత్రి ఆరోపించారు.
బనకచర్ల విషయంలో కర్ణాటక, మహారాష్ట్రలు తీవ్ర అభ్యంతరాలు తెలుపుతూ లేఖలు రాసాయి. సెప్టెంబర్ 17, 2025 నాడు కర్ణాటక ప్రభుత్వం ఇంటర్ స్టేట్ అగ్రిమెంట్ ప్రకారం, గోదావరి నీళ్లు తరలిస్తే కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖకు రాసిన లేఖ లో 112 టీఎంసీల నీళ్లు కృష్ణాలో ఆపుకుంటాం అని రాసింది. మహారాష్ట్ర కూడా వరద జలాల మీద ప్రాజెక్టు కట్టేందుకు ఏపీకి అవకాశం ఇస్తే కృష్ణాలో 74 టీఎంసీలు మా వాటా నీళ్లు ఆపుకుంటం, వరద ప్రాజెక్టులు కడుతం విదర్భ కు నీళ్లు తీసుకుపోతాం అని రాసింది. యిలా కర్ణాటక 112 టీఎంసీల నీళ్లు, మహారాష్ట్ర కృష్ణాలో 74 టీఎంసీలు అపుకుంటాము అన్నాయి. తెలంగాణకు 45 నిష్పత్తిలో వాటా దక్కుతుంది. ఈ వాటా తెలంగాణతో సహా ఏ రాష్ట్రానికి దక్కుండా చేసేందుకు గంపగుత్తగా నీళ్లు తరలించేందుకు పోలవరం నల్లమలసాగర్ ప్రాజెక్టుకు ఏపీ భారీ స్కెచ్ వేసింది, అని బనకచర్ల నుండి కాకుండా నల్లమలసాగర్ కు నీటిని తరలిస్తున్నారని వివరించారు.
నీళ్ళ విషయంలో రేవంత్ ప్రభుత్వం అన్యాయం చేస్తోందని చెప్తూ, “తెలంగాణ ప్రభుత్వం ఆదిత్యానాథ్ చైర్మన్ గా కమిటీ వేయటమే కాక, ఏపీ ప్రభుత్వం 11/12/2025 చివరి తేదీతో టెండర్ వేస్తే, అది అయిపోయాక తెలంగాణ ప్రభుత్వం 16 తేదీ నాడు కోర్టుకు వెళ్లింది. ఈ కేసు నీరు కార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం 23/12/2025 నాడు కమిటీ వేసింది. కేసు వేసి, మరో పక్క కమిటీ వేయటం ద్వారా కేసు వీగిపోయేందుకు మార్గం సృష్టించారు. ఏపీ నీళ్ల వివాద పరిష్కారానికి మేం పరస్పరం చర్చించుకోవడానికి వీలుగా రెండు రాష్ట్రాల ప్రతినిధులతో కమిటీ వేసుకున్నం, మేమే పరిష్కరించుకుంటాము అంటే వేసిన కేసులో బలం వుంటుందా,” అని నిలదీశారు.
బనకచర్లకు ఢిల్లీ మీటింగ్ అయిన 15 రోజులకే అత్యంత కీలకమైన అనుమతి వచ్చింది. 200 టీఎంసీలు తీసుకుపోయే అవకాశం, వెసులుబాటు ఉందని క్లియర్ గా అది చెప్పింది. అదే కేసీఆర్ సెక్షన్ 3 ఊటంకించటం ద్వారా నీటి పునఃపంపిణీ కి పర్మిషన్ తెచ్చారు. 940 టీఎంసీల అనుమతులు సాధించారు. రేవంత్ ఏమో ఏపీ ముఖ్యమంత్రి చెప్పినట్లు చేస్తున్నాడు, అన్నారు.

