
జవహర్ నగర్ డంపింగ్ యార్డు : కాలుష్య కాసారం
హైదరాబాద్ డంపింగ్ యార్డు మూసివేతకు ఎన్జీటీ ఆదేశాలు
కాలుష్యానికి చెక్ పెట్టిన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, జవహర్ నగర్ చెత్త యార్డు కథకు కొత్త మలుపు
హైదరాబాద్ పరిసర ప్రాంతాల ప్రజలను సంవత్సరాలుగా వేధిస్తున్న జవహర్ నగర్ చెత్త సమస్యపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) చివరికి కఠిన నిర్ణయం తీసుకుంది. చెన్నైలోని సదరన్ జోన్ ఎన్జీటీ జస్టిస్ పుష్పా సత్యనారాయణ ఆదేశాలతో, ఇకపై జవహర్ నగర్ డంపింగ్ యార్డులో కొత్తగా చెత్త లేదా రెఫ్యూజ్ డెరివ్డ్ ఫ్యూయల్ (RDF) వేయరాదని తెలంగాణ ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.దాదాపు మూడు దశాబ్దాలుగా వ్యాధులు, దుర్వాసన, లిచెట్ నీటి కాలుష్యంతో బతికిన స్థానిక ప్రజల పోరాటానికి ఇది ఒక పెద్ద విజయంగా నిలిచింది.
నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సంచలన ఆదేశాలు
జవహర్ నగర్ డంపింగ్ యార్డులో కొత్తగా రెప్యూజ్ డెరివడ్ ఫ్యూల్ తోపాటు చెత్తను వేయవద్దని చెన్నైలోని సదరన్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ జస్టిస్ పుష్పా సత్యనారాయణ ఈ ఉత్తర్వులు జారీ చేశారు. తమ నాలుగేళ్ల పోరాటం ఫలించి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చెత్త వేయవద్దని ఆదేశాలు జారీ చేసిందని యాంటీ డంపింగ్ యార్డు జాయింట్ యాక్షన్ కమిటీ కో కన్వీనర్ కేతెపల్లి పద్మాచారి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.
ఎన్జీటీలో జేఏసీ కేసు ఎప్పుడు వేసిందంటే...
జవహర్ నగర్ డంపింగ్ యార్డును తరలించి, ఇక్కడి ప్రజలను కాలుష్యం బారి నుంచి కాపాడాలని కోరుతూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో జవహర్ నగర్ యాంటీ డంపింగ్ యార్డు జాయింట్ యాక్షన్ కమిటీ తరపున బి శంకరనారాయణ, కేతేపల్లి పద్మాచారి, ఏ సంజీవరెడ్డి బాలకృష్ణ తదితరులు 15 మంది చెన్నైలోని సదరన్ జోన్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో 2021వ సంవత్సరంలో కేసు ఫైల్ చేశారు. తాము గత పదేళ్లుగా చెత్త కాలుష్యానికి వ్యతిరేకంగా పోరాడుతూనే ఉన్నామని కార్మిక నగర్ ప్రాంత నవోదయా వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు పాకాలపాటి శ్రీలేష్ సందీప్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.
డంపింగ్ యార్డు కాలుష్యంపై ఫెడరల్ తెలంగాణలో వార్తాస్త్రాలు
జవహర్ నగర్ డంపింగ్ యార్డు కాలుష్యం వల్ల గాలి, భూగర్భజలాలు, చెరువుల్లోని నీరు కలుషితమై ఈ పరిసర 12 గ్రామాల ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని 12 గ్రామాల్లో ‘ఫెడరల్ తెలంగాణ’ ప్రతినిధి తిరిగి బాధితులతో మాట్లాడి వరుసగా వార్తాస్త్రాలు సంధించారు. ఈ కాలుష్య కాటు సమస్యపై ఫెడరల్ ఇంగ్లీషులోనూ కథనాలు వచ్చాయి. ఇంగ్లీషు, తెలుగు భాసల్లో ఫెడరల్ తెలంగాణ య్యూ ట్యూబ్ ఛానల్ లో వీడియో స్టోరీలు టెలీకాస్ట్ అయ్యాయి. మూడు దశాబ్దాలుగా మురికిలో మగ్గిపోతున్న తెలంగాణ టౌన్,చెత్త కింద ఛిద్రమైన జవహర్ నగర్ ప్రజల జీవితాలు,జవహర్ నగర్ ముక్కు మూసుకుంటే, అధికారులు కళ్లు మూసుకున్నారు,వాళ్లని కాలుష్యం కసితీరా నమిలేస్తూ ఉంది... శీర్షికలతో ప్రత్యేక కథనాలను ‘ఫెడరల్ తెలంగాణ’ ప్రచురించింది. ఈ కథనాలను జేఏసీతోపాటు జవహర్ నగర్ డంపింగ్ యార్డు రీమూవల్ పీపుల్స్ ఫోరం సభ్యులు వారి సభ్యుల గ్రూపుల్లో ,జీహెచ్ఎంసీ కమిషనరుకు షేర్ చేశారు. చెత్త కాలుష్యంపై కేసు నడుస్తున్న నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కు కూడా ‘ఫెడరల్ తెలంగాణ’ కథనాలను షేర్ చేశారు.
తాజాగా ఎన్జీటీ ఆదేశాలు
నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అప్లికేషన్ నంబరు 199 ,2021 (ఎస్ జడ్) అండ్ ఎల్ ఏ నంబరు 96,2022(ఎస్ జడ్) కేసుల్లో జవహర్ నగర్ డంపింగ్ యార్డులో కొత్తగా చెత్తను వేయవద్దని గత నెల 28వతేదీన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది.ఈ ఆదేశాల తర్వాత ఈ కేసులో ఫైనల్ హియరింగ్ కోసం నవంబరు 10వతేదీకి ఎన్జీటీ వాయిదా వేసింది.జవహర్ నగర్ లో చెత్తను డంపింగ్ చేయవద్దని కోరుతూ అన్ని ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి యాంటీ డంపింగ్ యార్డు జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటైంది. జేఏసీ ఆధ్వర్యంలో చెత్తను జవహర్ నగర్ కు తరలించవద్దని ఉద్యమం చేపట్టారు. అనంతరం తమ సమస్యపై జేఏసీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసు వేసింది. హైదరాబాద్ డంపింగ్ యార్డులో చెత్త వేయవద్దని బాధితులు 27 ఏళ్లుగా చేస్తున్న పోరాటానికి తాజాగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కొత్తగా చెత్తను వేయవద్దు అని ఆదేశాలు జారీ చేసింది.
చెత్త దుర్ఘంధం సమస్య పరిష్కారానికి...
జవహర్ నగర్ డంపింగ్ యార్డులో చెత్త దుర్ఘంధం సమస్యను పరిష్కరించేందుకు సెంట్రల్ పొల్యుషన్ కంట్రోల్ బోర్డు (సీపీసీబీ) జీహెచ్ఎంసీ అధికారులతోపాటు బాంబే ఐఐటీ నిపుణులతో చర్చించి దీనికి పరిష్కార మార్గాన్ని కనుగొనాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ గతంలో జారీ చేసిన ఉత్తర్వుల్లో సూచించింది. కేంద్ర కాలుష్య నివారణ బోర్డు 2025 అక్టోబరు 10వ తేదీన సమావేశం నిర్వహించి కొన్ని తీర్మానాలు చేసింది. చెత్త నుంచి కాలుష్యం వెలువడకుండా చేసేలా వేస్ట్ మేనేజ్ మెంట్ కు తీసుకోవాల్సిన చర్యలను సూచించాలని బాంబే ఐఐటీని కోరింది.
బాంబే ఐఐటీ నిపుణుల బృందానికి కాలుష్య నియంత్రణ మండలి నివేదిక
జవహర్ నగర్ డంపింగ్ యార్డు దుర్గంధం సమస్యకు బాంబే ఐఐటీ నిపుణుల బృందం నివేదికను కేంద్ర కాలుష్య నియంత్రణ మండలికి ఈ ఏడాది అక్టోబరు 28వతేదీన సమర్పించింది. చెత్త సమస్య పరిష్కారానికి జీహెచ్ఎంసీ చర్యలు తీసుకోవాలని, దీనికయ్యే ఖర్చును జీహెచ్ఎంసీనే భరించాలని బాంబే ఐఐటీ కమిటీ కోరింది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి చెన్నై ప్రాంతీయ డైరెక్టర్, తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి జవహర్ నగర్ డంపింగ్ యార్డు కాలుష్యంపై రూపొందించిన నివేదికను బాంబే ఐఐటీ నిపుణుల బృందానికి సమర్పించింది.
చెత్త డంపింగ్ కు ప్రత్యామ్నాయం ఏది?
హైదరాబాద్ నగర చెత్తను జవహర్ నగర్ డంపింగ్ యార్డులో వేయవద్దని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు సమావేశమయ్యారు. గతంలో నగర చెత్తను హైదరాబాద్ నలుమూలల ఉన్న ప్యారానగర్, దుండిగల్, కొత్తూరు, లక్డారం, షాద్ నగర్ ప్రాంతాల్లో డంపింగ్ యార్డులు ఏర్పాటు చేసి అక్కడకు తరలించాలని గతంలో నిర్ణయించినా, ఏర్పాటు కాలేదు. ప్యారానగర్ లో చెత్త వేయవద్దంటూ అక్కడి నివాసులు తెలంగాణ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించడంతో డంపింగ్ యార్డు ఏర్పాటు కాలేదు. మరో వైపు కొత్త డంపింగ్ యార్డులు ఏర్పాటు చేయవద్దని అక్కడి ప్రాంత ప్రజలు ఆందోళనలు చేయడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. అవుటర్ రింగ్ రోడ్డుకు 3 నుంచి 5 కిలోమీటర్ల దూరంలో చెత్త డంపింగ్ చేయవద్దని కాలుష్యనియంత్రణ మండలి చెబుతున్నా, ప్రభుత్వం ఓఆర్ఆర్ కు 1.7 కిలోమీటర్ల దూరంలో స్థలాన్ని కేటాయించిందని, దీంతో అది కూడా కార్యరూపం దాల్చలేదని జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ రీమూవల్ పీపుల్స్ ఫోరం ప్రతినిధి, యాక్టివిస్టు గోగుల రామకృష్ణ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.
చెత్త కాలుష్య సమస్యను పరిష్కరించాలి : చెన్నై యాక్టివిస్టు డీకే చైతన్య
జవహర్ నగర్ డంపింగ్ యార్డు చెత్త కాలుష్య సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ చెన్నైకు చెందిన సెంటర్ ఫర్ ఫైనాన్షియల్ అకౌంటబులిటీ రీసెర్చర్ చైతన్య దేవిరాకుల శేఖరన్ పోరాటానికి శ్రీకారం చుట్టారు. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నియమాల ప్రకారం వేస్ట్ ఎనర్జీ ఇండస్ట్రీని రెడ్ కేటగిరీకి మార్చాలని, కాలుష్యం వెలువడకుండా విద్యుత్ ఉత్పత్తి చేయాలని డీకే చైతన్య సూచించారు. చెత్త నుంచి వాయు కాలుష్యం, లిచెట్ వాటర్ వల్ల భూగర్భజలాలు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. చెత్త వల్ల పొల్యూషన్ ఇండెక్స్ 97.6 గా ఉన్నందున ప్లాస్టిక్ పదార్థాలను కాల్చవద్దని కోరారు.
చెత్త నిర్వహణలో నిబంధనలకు నీళ్లు
జవహర్ నగర్ డంపింగ్ యార్డులో వేస్ట్ మేనేజ్ మెంట్ నిబంధనల ప్రకారం విద్యుత్ ఉత్పత్తి చేయడం లేదని హైదరాబాద్ నగరానికి చెందిన క్లైమెంట్ ఫ్రంట్ ప్రతినిధి, పర్యావరణ ప్రేమికుడు రుచిత్ ఆశాకుమార్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. చెత్త నుంచి వెలువడుతున్న లిచెట్ వాటర్ వల్ల సరస్సులు, చెరువులు కలుషితం అయ్యాయని ఆయన తెలిపారు. పదిమంది పర్యావరణ వేత్తలతో కూడిన నిజనిర్ధారణ కమిటీ డంపింగ్ యార్డును పరిశీలించగా ప్లాస్టిక్ పదార్థాలను కాలుస్తూ ప్రజారోగ్యాన్ని దెబ్బతీస్తున్నారని తేలిందని ఆయన చెప్పారు. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నిబంధనల ప్రకారం బూడిదను సరిగా డిస్పోజల్ చేయడం లేదన్నారు. డంపింగ్ యార్డు చుట్టూ గ్రీన్ బెల్టు, కార్మికులకు స్థలం, యాక్టివిటీ ఏరియా ను ఏర్పాటు చేసి, మొక్కలు నాటాలనే నిబంధనను పాటించడం లేదన్నారు.
జవహర్ నగర్ చెత్త యార్డు సమస్య తెలంగాణ పర్యావరణ చరిత్రలో ఒక తీరని మచ్చగా నిలిచింది. ప్రజల ఆరోగ్యం, భూగర్భజలాలు, గాలి అన్నీ చెత్త కాలుష్యానికి బలైపోయిన ఈ ప్రాంతానికి ఇప్పుడు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు ఆశాకిరణంగా మారాయి. కానీ ఈ ఆదేశాలు కాగితం మీదే కాకుండా అమలులోకి రావడమే అసలైన సవాలు. జీహెచ్ఎంసీ, కాలుష్య నియంత్రణ మండళ్లు, ప్రభుత్వం సమన్వయంతో ముందుకెళ్లి ప్రజలకు నిజమైన ఉపశమనం అందిస్తేనే జవహర్ నగర్ ప్రజల దశాబ్దాల ఆందోళనలకు న్యాయం చేకూరుతుంది. చెత్తను పారేయడం కాదు...చెత్తను సమర్థంగా నిర్వహించడం నేర్చుకునే సమయం ఇది.
Next Story

