![కాంగ్రెస్ అభ్యర్ధికి షాకుల మీద షాకులు కాంగ్రెస్ అభ్యర్ధికి షాకుల మీద షాకులు](https://telangana.thefederal.com/h-upload/2025/02/14/512821-congressmlccandidatevnarendrareddy.webp)
కాంగ్రెస్ అభ్యర్ధికి షాకుల మీద షాకులు
ఈజీగా గెలిచిపోవచ్చని అనుకున్న కాంగ్రెస్ ఎంఎల్సీ అభ్యర్ధి వీ నరేంద్రరెడ్డికి షాకుల మీద షాకులు తగులున్నాయి.
ఈజీగా గెలిచిపోవచ్చని అనుకున్న కాంగ్రెస్ ఎంఎల్సీ అభ్యర్ధి వీ నరేంద్రరెడ్డికి షాకుల మీద షాకులు తగులున్నాయి. ఈనెల 27వ తేదీన తెలంగాణలోని మూడు ఎంఎల్సీ సీట్లకు ఎన్నికలు జరగబోతున్న విషయం తెలిసిందే. మూడింటిలో రెండు టీచర్ కోటాలో భర్తీ అవుతున్న ఎంఎల్సీ సీట్లుండగా మరోకటి గ్రాడ్యుయేట్ కోటాలో భర్తీ అవ్వాల్సిన ఎంఎల్సీ సీటు. వీటిల్లో కూడా ఒక టీచర్+గ్రాడ్యుయేట్ కోటాలో భర్తీ అవ్వాల్సిన ఎంఎల్సీ సీట్లు మెదక్-కరీంనగర్-నిజామాబాద్-ఆదిలాబాద్ జిల్లాల పరిధిలో ఉన్నాయి. మరో టీచర్ ఎంఎల్సీ సీటు నల్గొండ-ఖమ్మం-వరంగల్ జిల్లాల పరిధిలో ఉంది.
బీజేపీ(BJP) మూడు సీట్లకు పోటీచేస్తుండగా కాంగ్రెస్(Congress) కేవలం గ్రాడ్యుయేట్ కోటా ఎంఎల్సీ సీటుకు మాత్రమే పోటీచేస్తోంది. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్(BRS) అసలు పోటీలోనే లేదు. బీఆర్ఎస్ ఎటూ పోటీలో లేదుకాబట్టి, డైరెక్టు ఫైట్ కాబట్టి, అధికారంలో ఉండటం అడ్వాంటేజ్ కాబట్టి బీజేపీ గ్రాడ్యుయేట్ అభ్యర్ధి చిన్నమైల్ అంజిరెడ్డిని ఈజీగా ఓడించచ్చని కాంగ్రెస్ అభ్యర్ధి వీ నరేందరరెడ్డి అనుకున్నారు. అయితే ప్రచారంలోకి దిగిన తర్వాతే నరేందరరెడ్డికి లోతు ఎంతో తెలుస్తోందని సమాచారం. నరేందర్ రెడ్డికి అల్ఫోర్స్(Alphorns educational institutions) పేరుతో విద్యాసంస్ధలున్నాయి. ఈ విద్యాసంస్ధల్లో వేలాదిమంది విద్యార్దులు చదువుతున్నారు, చదివారు. కాబట్టి పూర్వ విద్యార్ధులు, విద్యార్ధుల తల్లి,దండ్రులు ఓట్లేస్తే చాలు ఈజీగా బీజేపీ అభ్యర్ధి అంజిరెడ్డి మీద గెలిచిపోవచ్చని మొదట్లో నరేందర్ అనుకున్నారు.
అయితే ప్రచారం మొదలుపెట్టిన తర్వాత అసలు సమస్యలు బయటపడుతున్నాయని తెలిసింది. ఇంతకీ ఆ సమస్యలు ఏమిటంటే ఓట్లేసి గెలిపించాలని నరేందర్ తరపున అడుగుతున్న వారిని అభ్యర్ధికి ఎందుకు ఓట్లేయాలని ఓటర్లు ఎదురుఅడుగుతున్నారు. తనతరపున ఓటర్లకు ఫోన్లుచేసి ఓట్లు వేయాలని అభ్యర్ధించేందుకు అభ్యర్ధి టెలికాలర్స్(Telecallers) వ్యవస్ధను ఏర్పాటు చేసుకున్నారు. టెలికాలర్స్ ఫోన్లుచేసి ఓట్లు వేయాలని అభ్యర్ధిస్తున్నారు. ఓట్లకోసం ఫోన్లుచేస్తున్న టెలికాలర్స్ కు చుక్కలు కనబడుతున్నాయట. నరేందర్ కు అసలు ఓట్లు ఎందుకు వేయాలో చెప్పమని ఓటర్లు నిలదీస్తున్నారు. తమపిల్లలు నరేందర్ విద్యాసంస్ధల్లో చదివినపుడు ఎంతబతిమలాడినా పదిరూపాయలు కూడా డిస్కౌంట్ ఇవ్వలేదని ఓటర్లు గుర్తుచేస్తున్నారు.
ఫీజుల్లో డిస్కౌంట్ ఇవ్వాలని అడగాలని ఎంతప్రయత్నించినా నరేందర్ తమను కలవటానికి ఇష్టపడలేదన్న విషయాన్ని మరికొందరు గుర్తుచేస్తున్నారు. ఫీజులో చివరి రూపాయి చెల్లించేంతవరకు తమ పిల్లల హాల్ టికెట్లు ఇవ్వలేదన్న విషయాన్ని మరికొందరు తల్లి, దండ్రులు టెలికాలర్స్ తో చెబుతున్నారు. ఫీజుల్లో డిస్కౌంట్ ఇవ్వకపోయినా పర్వాలేదు కనీసం తమను కలవటానికి కూడా నరేందర్ ఇష్టపడని విషయాన్ని చాలామంది తల్లి, దండ్రులు టెలికాలర్లకు గుర్తుచేస్తున్నారని సమాచారం. ఇలాంటి అనేక కారణాలతోనే నరేందర్ నామినేషన్ దాఖలు చేసే సమయంలో కూడా పూర్వవిద్యార్ధులు ఎక్కడా కనబడలేదని తెలిసిందే. ఒక విద్యాసంస్ధ యజమాని ఎన్నికల్లో పాల్గొంటున్నారంటే పూర్వ విద్యార్ధులు మద్దతుగా ప్రచారం చేయటం చాలా సహజం. యజమానిపై తమకు ఉన్న అనుబంధంతోనో లేకపోతే ఇతరత్రా ఆబ్లిగేషన్ల కారణంగా ర్యాలీల్లో పాల్గొనటం, ప్రచారం చేస్తారు. అయితే ఇక్కడ నరేందర్ విషయంలో పూర్తిగా రివర్స్ జరుగుతోంది. నరేందర్ మీదున్న మంటను పూర్వవిద్యార్ధులు, వాళ్ళ తల్లి, దండ్రులు ఇపుడు చూపిస్తున్నారనే టాక్ పెరిగిపోతోంది.
సరే, బీజేపీ అభ్యర్ధి చిన్నమైల్ అంజిరెడ్డికి బాగా మంచిపేరుందా అంటే లేదనే సమాధానం వినిపిస్తోంది. నరేందర్ కి విద్యాసంస్ధలుంటే అంజిరెడ్డి పరిశ్రమలు, రియల్ ఎస్టేట్ రంగంలో బిజీగా ఉంటారు. ఆర్ధికంగా ఇద్దరూ చాలా బలమైన స్ధితిలోనే ఉన్నారు కాబట్టి ఓటర్లకు ఎంతైనా ఖర్చుపెట్టడానికి వెనకాడరు. తమ పార్టీల తరపున, మద్దతుదారుల తరపున ఇద్దరు బాగా పాజిటివ్ గా ప్రచారం చేయించుకుంటూనే ప్రత్యర్ధులపై బురదచల్లించేస్తున్నారు. ప్రత్యర్ధులపై బురదచల్లేందుకు ఇద్దరు సోషల్ మీడియాను విపరీతంగా ఉపయోగించుకుంటున్నారు.
ఓటర్ల వివరాలు
మెదక్-కరీంనగర్-నిజామాబాద్-ఆదిలాబాద్ జిల్లాల్లోని గ్రాడ్యుయేట్ నియోజకవర్గంలో 3,55,159 ఓట్లున్నాయి. ఇందులో కరీంనగర్ జిల్లాలోనే అత్యధికంగా 1.60 లక్షల ఓట్లున్నాయి. తర్వాత మెదక్ లో 77,781 ఓట్లు, నిజామాబాద్ జిల్లాలో 47,984, ఆదిలాబాద్ జిల్లాలో 69,134 ఓట్లున్నాయి. తనది కరీంనగర్ జిల్లా కాబట్టి, ఎక్కువ ఓట్లున్నది కూడా కరీంనగర్ జిల్లాలోనే కాబట్టి తన గెలుపుకు బాగా అనుకూలిస్తుందని నరేందర్ అంచనా వేస్తున్నారు. పై జిల్లాల్లోని మంత్రులు, ఎంఎల్ఏలు, ఎంపీలు, ఎంఎల్సీలు నరేందర్ గెలుపుకు బాగా కష్టపడుతున్నారు. అలాగే అంజిరెడ్డి విజయంకోసం ఎంపీలు, ఎంఎల్ఏలు కసరత్తులు చేస్తున్నారు. ఇద్దరికీ ప్లస్సులున్నాయి, ఇద్దరికీ మైనస్సులున్నాయి కాబట్టి గెలుపోటముల అవకాశాలు చెరిసగం ఉన్నాయని అర్ధమవుతోంది. ఓటర్లు ఎవరివైపు మొగ్గుచూపుతారో చూడాల్సిందే.