
గోరక్షకుడిపై కాల్పుల ఘటన... డిజిపి కార్యాలయం ముట్టడి
అరెస్ట్ అయిన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు
హైదరాబాద్ లక్డీకాపూల్‌లోని డీజీపీ కార్యాలయం వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. గోరక్షకుడిపై కాల్పులు నిరసిస్తూ బీజేపీ నేతలు డీజీపీ కార్యాలయం ముట్టడికి ప్రయత్నించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు ఈ ముట్టడి కార్యక్రమంలో పాల్గొన్నారు. రామచందర్ రావు సహా బీజేపీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. ఇంకా మిగిలిన బీజేపీ నేతలు డిజిపి కార్యాలయానికి చేరుకుంటుండగా అసెంబ్లీ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. బుధవారం సోనూసింగ్ పై కాల్పుల ఘటనను నిరసిస్తూ బీజేపీ ఆందోళన చేపట్టింది.
బీజేపీ నాయకులు ఆందోళన చేపట్టడంతో అసెంబ్లీ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసులు బిజెపి నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ముందు జాగ్రత్తగా డీజీపీ కార్యాలయం వద్ద సెక్యురిటీ పెంచారు. లక్డీకాపూల్, ఖైరతాబాద్, బషీర్ బాగ్ ప్రాంతాల్లో పోలీసులు గస్తీ కాస్తున్నారు
నగర శివారు పోచారం ఐటీ కారిడార్‌లో గో సంరక్షకుడు సోను సింగ్ పై జరిగిన కాల్పుల ఘటనలో ముగ్గురిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. నిందితులు ఇబ్రహీం, మోసిన్, శ్రీనివాస్‌ను అరెస్ట్ చేశారు. మరో నిందితుడు హనీఫ్ ఖురేషి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. బుధవారం సోనుసింగ్ అనే వ్యక్తి పై ఇబ్రహీం, అతని స్నేహితులు కాల్పులు జరిపారు. పాత కక్ష్యలతో సోనూ పై కాల్పులు జరిగినట్లు పోలీసులు తెలిపారు.
గోవుల అక్రమ రవాణా అడ్డుకున్నందుకు ?
కీసర మండలం రాంపల్లికి చెందిన సోనుసింగ్ గోసంరక్షణ కార్యకర్త. పశువుల అక్రమ రవాణాను గుర్తించి హిందూ సంఘాలకు ఇన్ఫర్ మేషన్ చేరవేసేవాడు. ఈ నేపథ్యంలో బుధవారం కారులో వెళ్తున్న సోనుసింగ్‌ను యమ్నంపల్లి వద్ద రౌడీషీటర్ ఇబ్రహీం అడ్డుకున్నాడు. గోవులను తరలిస్తున్న విషయం గోరక్షాదళ్‌కు అందిస్తున్నావంటూ సోనుసింగ్ తో ఇబ్రహీం ఘర్షణకు దిగాడు. ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది. చిలికి చిలికి గాలివానగా మారింది. ఒకరినొకరు తోసుకుంటూ పక్కనే ఉన్న గ్రౌండ్ లోకి వెళ్లారు. గొడవ ముదరటంతో ఇబ్రహీం తన వద్ద ఉన్న తుపాకీతో సోనుసింగ్ పై రెండు రౌండ్లు కాల్పులు జరపడంతోకుప్పకూలిపోయాడు.స్థానికులు చూసి ఇబ్రహీంను పట్టుకోవడానికి వచ్చినప్పటికీ అప్పటికే పరారయ్యాడు. సోనూ సింగ్ యశోద ఆసుపత్రి ఐసీయూలో ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు.