చామకూరకు చంద్రబాబు అభయం ?
x
Mallareddy with Chandrababu

చామకూరకు చంద్రబాబు అభయం ?

ఏ పార్టీలో ఉంటే తన ఆస్తులు, ప్రయోజనాలకు రక్షణ ఉంటుందో మల్లారెడ్డికి బాగా తెలుసు.


అటు తిరిగి ఇటు తిరిగి చివరకు మాజీమంత్రి చామకూర మల్లారెడ్డి తెలుగుదేశంపార్టీలో చేరక తప్పేట్లులేదు. ఎందుకంటే ఇది పార్టీపైనో లేకపోతే చంద్రబాబునాయుడుపైనో చామకూరకు ఉన్న అభిమానంతో కాదు. ఫక్తు అవసరాల కోసమే. ఏ పార్టీలో ఉంటే తన ఆస్తులు, ప్రయోజనాలకు రక్షణ ఉంటుందో మల్లారెడ్డికి బాగా తెలుసు. అందుకనే మెల్లిగా టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు ఎప్పటినుండో ప్రచారం జోరుగాసాగుతోంది. దీనికి సోమవారం హైదరాబాదులోనే జరిగిన ఒక ఘటన మరింత స్పీడును పెంచింది. ఇంతకీ సోమవారం జరిగిన డెవలప్మెంట్ ఏమిటంటే మల్లారెడ్డి తన అల్లుడు మర్రి రాజశేఖరరెడ్డితో కలిసి హైదరాబాదులోనే చంద్రబాబును కలిశారు. మర్రి కూతురి వివాహా పత్రిక ఇవ్వటానికే తాను కలిసినట్లు మల్లారెడ్డి చెబుతున్నా ఎవరు నమ్మటంలేదు.

ఎందుకంటే వీళ్ళతో పాటు ఇదే సమయంలో చంద్రబాబును కలిసిన తీగల కృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతు తాను తొందరలోనే టీడీపీలో చేరబోతున్నట్లు ప్రకటించారు. భేటీలో చంద్రబాబుతో తీగల, మల్లారెడ్డి కచ్చితంగా రాజకీయ వ్యవహారాలు చర్చించే ఉంటారనేందుకు తీగల ప్రకటన నిదర్శనంగా మారింది. కాకపోతే తీగల ప్రకటించారు మల్లారెడ్డి ప్రకటించలేదంతే. అయితే బీఆర్ఎస్ మేడ్చల్ ఎంఎల్ఏ మల్లారెడ్డి ఇప్పటికప్పుడు టీడీపీలో చేరాల్సిన అవసరం ఏముంది ? ఏముందంటే చాలానే ఉంది. రేవంత్ రెడ్డి, మల్లారెడ్డి ఒకపుడు టీడీపీలో ఉండేవారు. అయితే తెలంగాణాలో టీడీపీ నేలమట్టమైపోయిన తర్వాత మల్లారెడ్డి బీఆర్ఎస్ లో చేరితే రేవంత్ కాంగ్రెస్ లో చేరారు. తర్వాత మల్లారెడ్డి మంత్రి కూడా అయి ఆకాశమేహద్దుగా చెలరేగిపోయారు. పదేళ్ళ బీఆర్ఎస్ హయంలో మల్లారెడ్డిపై అనేక భూకబ్జా ఆరోపణలున్నాయి. కేసీఆర్ మెప్పుకోసం మల్లారెడ్డి అప్పట్లో రేవంత్ ను నోటికొచ్చినట్లు తిట్టి తొడలుకొట్టి చాల సవాళ్ళు చేశారు.

సీన్ కట్ చేస్తే 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవటం, కాంగ్రెస్ అధికారంలోకి రావటమే కాకుండా రేవంత్ సీఎం అయ్యారు. అప్పటినుండే మల్లారెడ్డికి కష్టాలు మొదలయ్యాయి. మల్లారెడ్డి మీద భూకబ్జాల కేసులు నమోదయ్యాయి. మల్లారెడ్డి ఆక్రమణల్లో ఉన్నకొన్ని భూములను ప్రభుత్వం తొలగించి స్వాధీనం చేసుకున్నది. ఇక హైడ్రా ఏర్పడిన తర్వాత చెరువులను ఆక్రమించి నిర్మించారనే కారణంతో మల్లారెడ్డి కాలేజీలపైకి బుల్డోజర్లు, జేసీబీలు నడిచాయి. హైడ్రాకు వ్యతిరేకంగా మల్లారెడ్డి కోర్టులో పిటీషన్ వేసినా పెద్దగా ఉపయోగం కనబడలేదు. ఇదే సమయంలో బుల్డోజర్లు, జేసీబీలు మర్రి రాజశేఖరరెడ్డి కాలీజేలమీదకు కూడా వెళ్ళాయి. ఎందుకంటే మర్రి కూడా చెరువులను ఆక్రమించి కాలేజీలను కట్టేశారు. మల్లారెడ్డి, మర్రికి ఉన్న సంబంధం ఏమిటంటే ఇద్దరూ మామా అల్లుళ్ళు.

తమ కాలేజీలను, ఆస్తులను కాపాడుకోవటానికి మల్లారెడ్డి చేయని ప్రయత్నంలేదు. చివరకు బెంగుళూరుకు వెళ్ళి కాంగ్రెస్ ఉపముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ ను కలిశారు. అయితే అక్కడి నుండి ఎలాంటి హామీలు వచ్చినట్లులేదు. కూల్చివేతలకు సంబంధించి హైడ్రా నోటీసులను సవాలు చేస్తు మర్రి కూడా కోర్టులో కేసువేసినా పెద్దగా ఉపయోగం కనబడలేదు. అయితే ఏమైందో ఏమో కాలేజీలను ఇప్పటికిప్పుడు కూల్చేస్తే అందులో చదువుతున్న విద్యార్ధుల విద్యాసంవత్సరం దెబ్బ తింటుందన్న కారణంగా కొంతకాలం వెయిట్ చేస్తామని హైడ్రా కమీషనర్ ఏవీ రంగనాధ్ ప్రకటించారు. ఈ ప్రకటన మల్లారెడ్డి, మర్రి కాలేజీలకు మాత్రమే కాదు ఓవైసీల ఆధ్వర్యంలో నడుస్తున్న ఫాతిమా కాలేజీలతో పాటు చాలా కాలేజీలక వర్తిస్తుందని రంగనాధ్ ప్రకటించారు.

అంటే ఇప్పటికిప్పుడు మల్లారెడ్డి, మర్రి కాలేజీల కూల్చివేతలు జరగకపోయినా మరో ఆరునెలల తర్వాతైనా తప్పదు. తాను బీఆర్ఎస్ లోనే ఉంటే రేవంత్ మరింత మంటతో తనకు వ్యతిరేకంగా రేవంత్ వ్యవహరిస్తారని మల్లారెడ్డికి అర్ధమైపోయింది. అందుకనే అర్జంటుగా బీఆర్ఎస్ లో నుండి టీడీపీలోకి జంప్ చేయాల్సిన అవసరం వచ్చింది. ఒకపుడు మల్లారెడ్డి కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు ప్రచారం జరిగినా ఎందుకనో కుదరలేదు. ఇక బీజేపీలోకి వెళ్ళినా ఎలాంటి ఉపయోగం ఉండదు. మామ, అల్లుళ్ళ ప్రయోజనాలకు రక్షణ కావాలంటే చంద్రబాబును ఆశ్రయించటం ఒక్కటే దారి. కాబట్టే అల్లుడితో కలిసి మల్లారెడ్డి టీడీపీలో చేరబోతున్నారనే ప్రచారం బాగా జోరందుకుంది. ఈనెలఖరున మనవరాలి వివాహం అయిపోయిన తర్వాత టీడీపీలో చేరే విషయాన్ని మల్లారెడ్డి స్పీడు చేస్తారేమో చూడాలి.

చంద్రబాబు ఆపగలరా ?

అంతా బాగానే ఉందికాని మల్లారెడ్డి కాలేజీలు కూల్చకుండా రేవంత్ ను చంద్రబాబు ఆపగలరా ? ఇపుడిదే ప్రశ్న అందరిలోను పెరిగిపోతోంది. ఒకపుడు చంద్రబాబుకు రేవంత్ కీలకమైన మద్దతుదారుడన్న విషయం అందరికీ తెలిసిందే. చంద్రబాబుకు రేవంత్ శిష్యుడనే ప్రచారం కూడా ఉంది. అయితే దాన్ని రేవంత్ ఖండించారు. తెలంగాణా వ్యవహారాల్లో అందులోను ప్రభుత్వం తీసుకునే పాలసీ నిర్ణయాల్లో చంద్రబాబు జోక్యం చేసుకుంటారా ? చేసుకున్నా రేవంత్ వింటారా ? మల్లారెడ్డి, మర్రి కాలేజీలు చెరువులను ఆక్రమించి కట్టారన్న విషయం జనాలందరికీ తెలిసిపోయింది. ఈ విషయాన్ని హైడ్రా కమీషనరే మీడియా సమావేశంలో ఫొటోలు విడుదలచేసి మరీ ప్రకటించారు. చంద్రబాబు చెప్పారని రేవంత్ గనుక మల్లారెడ్డి, మర్రి కాలేజీలను కూల్చకుండా వదిలేస్తే జనాలు, ప్రతిపక్షాలు కాదు సొంతపార్టీ నేతలే రేవంత్ దుమ్ముదులిపేస్తారు. వీళ్ళ కాలేజీలను కూల్చకుండా వదిలేస్తే రేవంత్ ప్రభుత్వానికి చెడ్డపేరు రావటం ఖాయం. అప్పుడది తనకు బాగా మైనస్ అవుతుందని తెలుసుకోలేని అమాయకుడు కాదు రేవంత్. అందుకని మల్లారెడ్డి, మర్రి విషయంలో చంద్రబాబు జోక్యం చేసుకున్నా రేవంత్ వింటాడనే నమ్మకం తక్కువే. ఏదేమైనా తొందరలోనే మర్రి టీడీపీ ఎంట్రీ, మరో ఆరు నెలల్లో మల్లారెడ్డి, మర్రి కాలేజీల వ్యవహారం ఏమిటో తేలిపోతుంది.

Read More
Next Story