
శిథిల సౌందర్యం (మండే కవిత)
డాక్టర్ ఎం గోపీ కృష్ణ ‘మండే’ కవిత
ముష్కరులదాడిలో ముక్కలైపోయిన
శిథిల శిల్పాలను ఎంతకాలమని
మనం చూస్తూ కూర్చుంటాము?
చరిత్రలోంచి నెత్తురోడుతున్న
శిల్పాల రక్తగాయాలనుంచి
ఎన్ని కొత్త పాఠాలు నేర్చుకోగలం?
గతగాయాలనుంచి
మనం నేర్చుకోవాల్సిందే..
కానీ ఎంతకాలమని వాటినేచూస్తూ
దుఖఃంలో మనం మునిగిపోగలం?
కాలం పుటలలోని గతాన్ని
మరవకుండాల్సిందే..
కానీ ఎంతకాలమని ఆ గరళాన్ని
కంఠంలో శివుడిలా ఉంచుకోగలం!
ద్వేషం విద్వేషాన్నే రగిలిస్తుంది..
ద్వేషంతోనిండిపోయిన మనసులో
మనం ప్రేమనెలా నింపుకోగలం?
విద్వేషం వినాశనాన్నే కోరుకొంటుంది..
వినాశనంతో భూమిపై స్వర్గాన్ని
మనం ఎలా నిర్మించగలం?
తప్పుజరిగిందన్న విషయం
మనకు అందరికీ తెలుసు..
బాధని మోయని మనసంటూ
లేదనీ మనకు తెలుసు..
కానీ ఈ బాధాబేతాళుడిమోస్తూ
భవిషత్తులోకి ఎలా వెళ్ళగలం?
శిథిల సమాధులపైన
నవనగరాన్ని ఎలా నిర్మించగలం?
పగిలినశిలలను చూస్తూంటే
మనసున్న మనందరి కన్నీళ్ళు
ప్రవహించే సెలఏళ్ళవుతున్నాయి..
ప్రాణంపెట్టిచేసిన శిల్పుల చేవ్రాళ్ళు
చరిత్రపుస్తకాలనుంచి మెల్లెమెల్లెగా అదృశ్యమై పోతున్నాయి..
పగిలిన తలలతో మిగిలిన మొండాలు
విరిగిపోయిన వాటి కాళ్ళూచేతులు
విషాదాన్నే నేడు పంచుతున్నాయి!
చెక్కేసిన ముక్కూమొహాలు
మనసుకలిచేసే ధ్వంసమైనశిల్పాలు
ఎంతకాలం కొత్తపాఠాలు చెబుతాయి?
జరిగిపోయిన తప్పులనే నెమరేసుకొంటూ
వాటినే భవిషత్తు తరాలకు చూపించుకొంటూంటే
ఘనమైన మన సంస్కృతి యువతరానికి తెలిసేదెలా?
గాయంచేసిన మచ్చలను
మరిచిపోయి వదిలేయక
ఆగాయాలే అలంకారమని
అపోహలతో జీవించక
శిల్పాలను సరిచేయకుంటే
సంస్కృతిని నిలుపుకొనేదెలా?
మన ఆలోచనలను మార్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది!
శిథిల శిల్పాలకు మరమ్మత్తులు చేయాల్సిన అవసరం ఎంతైనావుంది!
గతగాయాలను మరిచి గతవినాశనాలను విడిచి
మన ఘనతను మళ్ళీ ప్రపంచానికి కొత్తగా చూపాల్సిన రోజువచ్చింది!
హళీబేడునుకూడా బేళూరులా మార్చి
గాయాలను కాలంనదిలోకి వదిలేసి
శిథిలశిల్పాల పునరుజ్జీవనాన్ని మొదలుపెట్టాల్సిన అవసరమూవుంది!
మీరూ ఆలోచించండి...
శిథిలమైపోయిన శిల్పాలనే
మన వారసత్వ సంపదని
మన పిల్లలకు చెబుదామా?
విరిగినవాటిని సరిచేసి
గర్వించే సంస్కృతిగా
వాళ్ళకు పరిచయం చేద్దామా?
ఒక్కసారి ఆలోచించండి!
ఒక్కసారి ఆలోచించండి!!
ఒక్కసారి ఆలోచించండి!!!
Next Story

