
హైదరాబాద్ బ్లాస్ట్ లో 800 డిగ్రీల సెల్సియస్ కు చేరిన ఉష్ణోగ్రత
15 కు చేరిన సిగాచి బ్లాస్ట్ మృతుల సంఖ్య
సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి రసాయన పరిశ్రమలో పేలుడులో మరణించిన వారి సంఖ్య 15కు చేరింది. గాయపడిన వారు పలువురు ఆసుపత్రుల్లో చికిత్సపొందుతున్నారు. వీరిలో కొందరి పరిస్థితి క్లిష్టంగా ఉన్నట్లు తెలుస్తున్నది. అందువల్ల మృతుల ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముందని తెలుస్తోంది.
ఉమ్మడి మెదక్ జిల్లా పాశమైలారంలోని పారిశ్రామికవాడలోని పరిశ్రమలో సోమవారం భారీ పేలుడు సంభవించి సంగతి తెలిసిందే. ఉదయం 9.30 ప్రాంతంలో ప్రమాద సూచనలు కనిపించడంతో కొన్ని నివారణ చర్యలుతీసుకున్నా ఫలితం కనిపించలేదు. పరిశ్రమలో మైక్రో సెల్యులస్ పౌడర్ తయారు చేస్తున్న క్రమంలో బాయిలర్ నుంచివెలువడే తీవ్రమైన వేడి గాలి ప్రమాదానికి కారణమని, ఈ వేడి గాలికి పైప్ లైన్ లో పేలుడు సంభవించినట్లు పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. వేడి గాలి వల్ల ఈ ప్రమాాదం జరిగిందా లేక, రియాక్టర్ పేలుడు వల్ల జరిగిందా అనేదాని మీద విచారణ జరుగుతూ ఉంది. మొత్తానికి పేలుడులో పరిశ్రమలోని పలు కీలకవిభాగాలు దెబ్బతిన్నాయని, పరిశ్రమ మళ్లీ పని ప్రారంభించేందుకు కనీసం మూడునెలలుపట్టవచ్చని చెబుతున్నారు.
పేలుడు సమయంలో ఏకంగా 700-800 డిగ్రీల దాకా ఉష్ణోగ్రత పెరిగి ఉండవచ్చని దీని వల్లే భవనం కుప్పకూలి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఫలితంగా పేలుడు సమీపాన పనిచేస్తున్న వారిలో ఐదుగురు సజీవ దహనమయ్యారు. ప్రమాద తీవ్రతకు పరిశ్రమ భవనంలో 14 అంగుళాల మందంతో ఉన్న బీమ్ లు సైతం విరిగి, కుప్ప కూలిపోవడంతో నష్టతీవ్రత అనూహ్యంగా పెరిగిందని అధికారులు భావిస్తున్నారు.
పరిశ్రమ వైస్ ప్రెసిడెంట్ ఇలంగోవన్ క్వాలిటీ కంట్రోల్ విభాగం నుంచి కిందికి దిగుతున్న సమయంలోనే పేలుడు జరగడంతో ఆయన మృతదేహం 50 మీటర్ల దూరం వరకు ఎగిరి పడింది. పేలుడు ధాటికి గోడలు బద్దలై పరిశ్రమలోకి వస్తున్న ప్లాంట్ ఇన్‌చార్జ్‌పై పడి అక్కడికక్కడే మృతి చెందారు. ఈ పేలుడు ధాటికి పలువురు గాలిలోకి ఎగిరిపడ్డారు. అయితే ఇప్పటి వరకు పలు మృతదేహాలను వెలికి తీశారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని మియాపూర్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదం సంభవించిన సమయంలో పరిశ్రమలో 108 మంది పనిచేస్తున్నారని సమాచారం.
Next Story