Sigachi Blast | తెలంగాణ అధికారులకు జ్ఞానోదయం
x
సిగాచి ఫార్మా పరిశ్రమలో పేలుడు అనంతరం శిథిలాలు

Sigachi Blast | తెలంగాణ అధికారులకు జ్ఞానోదయం

40 మంది కార్మికులు పేలుడుకు మాడి మసై పోయాక ఇక నుంచి ఫార్మా పరిశ్రమల్లో ద్వైమాసిక తనిఖీలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.


తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమల్లో జరిగే ప్రమాదాల నివారణకు సర్కారు కఠిన చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. అధిక ప్రమాదాలు ఉన్న ఫార్మా, రసాయన పరిశ్రమల్లో రెండేళ్లకు, ఐదేళ్లకు ఓ సారి జరిపే భద్రతా తనిఖీలను ఇక నుంచి రెండు నెలలకు ఓ సారి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పాశమైలారంలో సిగాచి ఫార్మాకంపెనీలో జరిగిన ఘోర పేలుడు ఘటనను అత్యంత దారుణమైన విపత్తుగా పరిగణించిన తెలంగాణ సర్కారు హైరిస్క్ ఉన్న ఫార్మా, కెమికల్ పరిశ్రమల్లో రెండు నెలలకు ఒక సారి తనిఖీలు చేయాలని నిర్ణయించారు. ఇక ముందు పరిశ్రమల్లో ప్రమాదాలు జరగకుండా నివారించేందుకు ప్రభుత్వం కఠినమైన కొత్త చర్యలు చేపట్టాలని నిర్ణయించింది.


ఏ ఏ శాఖలు తనిఖీలు చేస్తాయంటే...
అధిక ప్రమాదాలు జరిగే ఫార్మా, రసాయన, ఇతర పరిశ్రమల్లో ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, తెలంగాణ అగ్నిమాపక శాఖ, విద్యుత్ శాఖ, తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలికి చెందిన అధికారులు ఇక నుంచి పిరియాడికల్ తనిఖీలు చేపట్టనున్నారు. ఈ తనిఖీల్లో భాగంగా ఫ్యాక్టరీల్లో బాయిలర్లు, రియాక్టర్లు, ఎలక్ట్రికల్ యంత్రపరికరాలు, అగ్నిమాపక యంత్రాలు, కాలుష్య నియంత్రణ చర్యలను అధికారులు పరిశీలించి, ఏవైనా డిఫెక్టులు ఉంటే వెంటనే ఆయా పరిశ్రమల యాజమాన్యాలకు నోటీసులు జారీ చేయనున్నారు.

తనిఖీలు ఇక కఠినతరం
పారిశ్రామిక అనుమతుల పునరుద్ధరణకు సంబంధించిన ప్రస్తుత వార్షిక తనిఖీల వ్యవస్థను పెంచడంతోపాటు కఠినతరం చేయాలని నిర్ణయించారు. హైరిస్క్ ఉన్న ఫార్మాస్యుటికల్, కెమికల్ ఫ్యాక్టరీల్లో సేఫ్టీ నిబంధనలు పాటించకుంటే వారిపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. పరిశ్రమల్లో కార్మికుల భద్రతకు పెద్ద పీట వేయాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రెండు నెలలకు ఒక సారి పరిశ్రమల్లో చేసిన తనిఖీలపై వివరణాత్మక నివేదికలు ఇచ్చి జవాబుదారీ తనం పెంచాలని నిర్ణయించారు.

30 నెలల్లో పది ప్రధాన ప్రమాదాలు
గడచిన 30 నెలల్లోనే పది ప్రధాన పరిశ్రమల్లో ఘోర అగ్నిప్రమాదాలు, పేలుడు సంభవించాయి. ఈ ప్రమాద ఘటనల్లో 25 మంది మరణించగా మరో 70 మందికి పైగా కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. పాశమైలారంలోని సిగాచీ ఫార్మా కంపెనీలో జరిగిన పేలుడులో 40 మంది మరణించగా, మరో 33 మంది తీవ్రంగా గాయపడ్డారు. సిగాచీ పేలుడు ఘటన తెలంగాణ రాష్ట్రాన్ని కదిలించడంతోపాటు జాతీయ వార్తల్లోకి ఎక్కింది. ఫార్మా పరిశ్రమల్లో భద్రత నిబంధనలపై తీవ్రమైన ఆందోళనను ఈ ఘటన లేవనెత్తింది.

అధికారులతో మంత్రి వివేక్ త్వరలో సమావేశం
తెలంగాణలోని అన్ని పరిశ్రమల్లో భద్రతా తనిఖీలు, ప్రోటోకాల్‌లను బలోపేతం చేయాలని నిర్ణయిచిన నేపథ్యంలో తెలంగాణ కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ త్వరలో సీనియర్ అధికారులతో ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు.పరిశ్రమల్లో భద్రత నిబంధనల అమలుపై వివరణాత్మక కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేయడానికి మంత్రి అధికారులతో సమీక్ష జరపనున్నారు.

సిగాచి అధికారిక లేఖ విడుదల
పాశమైలారంలోని సిగాచి ఫార్మా ఫ్యాక్టరీలో ప్రమాద ఘటనపై యాజమాన్యం మొదటిసారి స్పందించింది. పాశమైలారంలోని సిగాచి ఇండస్ట్రీస్ లో జరిగిన ప్రమాదం వివరాలను తాము బాధతో పంచుకుంటున్నామని,ఈ ప్రమాదంలో 40 మంది విలువైన తమ కంపెనీ జట్టు సభ్యులు మరణించారని, మరో 33 మందికి పైగా గాయపడ్డారని సిగాచి ఇండస్ట్రీస్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.

ఫోరెన్సిక్ ల్యాబ్ కు సిగాచీ శాంపిల్స్
సిగాచీ పరిశ్రమ ఘటనా స్థలం నుంచి తెలంగాణ ఫోరెన్సిక్ బృందాలు శాంపిల్స్ సేకరించి పరీక్షకు పంపాయి. ఈ ఫోరెన్సిక్ పరీక్షల్లో ప్రమాదానికి అసలు కారణాన్ని గుర్తించాలని నిర్ణయించారు. ఫోరెన్సిక్ టీమ్ రసాయనాలు, అవశేషాలను సేకరించి వాటిని ల్యాబ్‌కు పంపాయి.

కాటేదాన్ లో భారీ అగ్నిప్రమాదం
సిగాచీ ప్రమాదం జరిగిన రెండు రోజులకే హైదరాబాద్ శివార్లలోని కాటేదాన్ లో మరో ప్రమాదం గురువారం జరిగింది. కాటేదాన్ లోని నేతాజీ నగర్ తిరుపతి రబ్బర్ కంపెనీ లో మంటలు ఎగసి పడుతున్నాయి. రెండు ఫైర్ ఇంజన్లతో అగ్నిమాపకశాఖ అధికారులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఫైర్ మెన్లు మంటలు ఆర్పె పని లో పడ్డారు.కాటేదాన్ రబ్బరు ఫ్యాక్టరీలో మంటలకు తోడు దట్టo గా నల్లని పొగ వ్యాపించింది. రబ్బరు మ్యాట్ లు తయారు చేసే కంపెనీలో మంటలు ఇంకా అదుపులోకి రాలేదు.


Read More
Next Story